ములుగు బస్ డిపో కలేనా..?

by Shyam |   ( Updated:2021-08-09 05:32:59.0  )
ములుగు బస్ డిపో కలేనా..?
X

దిశ, ములుగు: పాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల్లో ములుగు జిల్లా ఒకటి. జిల్లా ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయినప్పటికీ అభివృద్ధి పథంలో మాత్రం చాలా వెనుకబడే ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ములుగు ఏజెన్సీ జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు అవసరం ఉన్నప్పటికీ.. ప్రభుత్వ అధికారులు, పాలకులు ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం జిల్లా అభివృద్ధిని కాలరాయడంలో ఇదొక భాగమని చెప్పుకోవచ్చు. బస్ డిపో విషయం పక్కన పెడితే జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ జిల్లా ఏర్పడక ముందు..ఏర్పాటై రెండున్నరేళ్లయినా అదే పరిస్థితిలో ఉండటం జిల్లా ప్రజలను మరింత బాధిస్తుంది. ముఖ్యంగా బస్టాండ్ లో కనీసం సౌకర్యాలైన తాగునీరు, ప్రయాణికులు సౌకర్యం మరుగుదొడ్లు, మూత్ర శాలలు సరిపడా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ములుగులో బస్సు డిపో ఏర్పాటు కోసం వచ్చిన ప్రతిపాదన అప్పటి మంత్రి అజ్మీర చందూలాల్ ఏటూరునాగారం మండల కేంద్రానికి 3 ఎకరాల భూమితో పాటు కోటి రూపాయల నిధులను సైతం మంజూరు చేయించినట్లు సమాచారం. అయినప్పటికీ ఏటూరునాగారం మండల కేంద్రంలో డిపో ఏర్పాటు విషయంలో నిర్మాణ పురోగతి లేదు. ములుగు పట్టణ అభివృద్ధిని విస్మరించినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఏటూరు నాగారంలో మంజూరైన బస్ డిపో ను ఏర్పాటు చేయడంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రగతి లేకపోవడం దురదృష్టకరమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, పాలకులు తక్షణమే చొరవ చూపించి ములుగు జిల్లా కేంద్రంలో డిపో ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ను బాగుచేసి ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక వసతులను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. హన్మకొండ నుండి సాయంత్రం 5 తర్వాత బస్సులు లేకపోవడంతో ఏజెన్సీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లా ప్రజలు నిత్యం అనేక అవసరాల నిమిత్తం వరంగల్, హన్మ కొండకి వెళతారు. ప్రయాణికులకు సరి అయిన బస్ సర్వీసులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా చొరవ చూపించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story