- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారదా కేసులో ఇద్దరు బెంగాల్ మంత్రులు అరెస్టు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. నారదా అవినీతి కేసులో ఇద్దరు రాష్ట్రమంత్రులు, ఒక ఎమ్మెల్యే, మరో నేతను సీబీఐ అధికారులు సోమవారం ఉదయం కోల్‌కతాలోని వారి నివాసాల్లో అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీంతో టీఎంసీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. సీబీఐ కార్యాలయం ఎదుట నిరసనలకు దిగారు. సీబీఐ అధికారులకు రక్షణ ఇస్తున్న కేంద్ర బలగాలు నిరసనకారులను చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేశారు. అరెస్టుల విషయం తెలియగానే సీఎం మమతా బెనర్జీ కూడా సీబీఐ ఆఫీసు చేరుకున్నారు. 45 నిమిషాలపాటు ఆందోళనలో పాల్గొన్నారు. సీబీఐ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని మమతా బెనర్జీ అధికారులతో అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్ర అధికారులను అరెస్టు చేయరాదని బెనర్జీ వివరించారు. తన అధికారులను అరెస్టు చేయాలనుకుంటే తననూ అరెస్టు చేయాలని మండిపడ్డారు.
ప్రస్తుత రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ, రవాణా శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటోపాద్యాయ్‌లతో బలవంతంగా అరెస్టు మెమోలపై సంతకం చేయించుకున్నారని టీఎంసీ వర్గాలు ఆరోపించాయి. అనంతరం వారిని కోల్‌కతాలోని నిజాం ప్యాలెస్ దగ్గరలోని సీబీఐ ఆఫీసుకు తీసుకెళ్లారని, ప్రస్తుతం వారిని అక్కడే నిర్బంధించారని వివరించాయి. ఈ నలుగురిపై చార్జిషీటు దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించడానికి రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఇటీవలే సీబీఐకి అనుమతి ఇచ్చారు. త్వరలోనే వీరిపై చార్జిషీటు ఫైల్ చేయనున్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ఎమ్మెల్యేలను అరెస్టు చేయడానికి ముందు స్పీకర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని, అడ్వకేట్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ బిమన్ బంధోపాద్యాయ్ అన్నారు. సీబీఐ అధికారుల చర్యలు చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఈ అరెస్టులు రాజకీయ ప్రేరేపితమైనవని, ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఈ కుట్రలకు పాల్పడుతున్నదని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ విమర్శించారు. టీఎంసీ నేతలను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ముకుల్ రాయ్, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిలను ఎందుకు అరెస్టు చేయలేదని టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ ప్రశ్నించారు. వీరంతా నారదా అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నవారేనని అన్నారు.
2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2014లో నారద న్యూస్ పోర్టల్ స్టింగ్ ఆపరేషన్‌లో అప్పుడు అధికారంలోని టీఎంసీ ఎమ్మెల్యేలు ఓ కల్పిత కంపెనీకి అనుకూలంగా వ్యవహరించడానికి డబ్బులు తీసుకుంటున్నట్టు బయటపడింది. ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చి బిజినెస్‌మ్యాన్‌ల వ్యవహరిస్తూ డబ్బు ఆశచూపిస్తూ మొత్తం ఎపిసోడ్‌ను వీడియో తీశాడు. ఈ వీడియో టేపులు అప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి.