- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బుల్లితెరకు పెద్ద చిక్కు!
కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలవగా.. థియేటర్లు తెరుచుకోక సినిమా రంగం మరింత దెబ్బతింది. దీంతో అందరూ టీవీనే దిక్కనుకున్నారు. కానీ షూటింగులు లేకపోతే టీవీలో సీరియళ్లెలా వస్తాయి? మొదటి లాక్‌డౌన్ సమయంలో వేసిన సినిమాలే వేసి, పాత సీరియళ్లను రంగంలోకి దింపి ఎలాగోలా పొద్దుగడిపారు. అలా మూడు నెలలు గడిచిన తర్వాత ఇలీవల షూటింగులకు అనుమతి ఇచ్చారు. కానీ దురదృష్టం అందరినీ వదిలేసి ఈ చిన్న నటీనటుల మీద పడింది. మట్టిగాజులు సీరియల్ షూటింగ్‌లో ఓ నటుడికి కరోనా పాజిటివ్ రావడంతో మళ్లీ ఇబ్బందులు మొదలవుతున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ పరిధిలో మరో 15 రోజులు కఠినమైన లాక్‌డౌన్ విధిస్తున్నారనే వార్త ఇప్పుడు వాళ్ల మీద పిడుగు పడ్డట్టయ్యింది.
అప్పుల పాలవుతున్న ఆర్టిస్టులు
సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి అలసిపోయి, ఓ వైపు సీరియళ్లలో నటిస్తూనే.. మరో వైపు పెద్ద పెద్ద అవకాశాల కోసం ఎదురుచూస్తూ పూట గడిపేస్తుంటారు. పేరుకే తెరమీద కనిపిస్తున్నా, వారికి కూడా సినిమా కష్టాలు, సీరియల్ కష్టాలు కామనే. అలాంటిది మూన్నెల్లుగా ఎలాంటి పని లేకుండా ఇంట్లో కూర్చుని తినాలంటే ఎవరికైనా ఇబ్బందే. సేవింగ్స్ లేనివారి పరిస్థితి అగమ్యగోచరమే. ఒక్క ఆర్టిస్టులు అనే కాదు, సీరియల్ లేదా టీవీ ప్రోగ్రామ్ తెర మీద కనిపించడానికి కష్టపడే ప్రతి ఒక్కరూ ఈ లాక్‌డౌన్ వల్ల ప్రభావితమయ్యారు. టాలెంట్ ఉన్నా ప్రదర్శించలేని సమయంలో ఓ నటుడు పడే వేదన వర్ణనాతీతం. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులు అందరిదీ ఇదే పరిస్థితి. ఇక డబ్బింగ్ ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్ల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో వారంతా అప్పుచేసి బతకాల్సి వస్తోంది.
చానళ్లది వింత పరిస్థితి
కంటెంట్ సృష్టించడానికి క్రియేటివ్ సిబ్బంది ఉన్నారు కదా.. అని కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన చానళ్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. 24 గంటల పాటు ప్రసారాలకు కార్యక్రమాలు లేక, నిజానికి కార్యక్రమాలు రూపొందించే వారు లేక ఈ పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణగా తెలుగు చానళ్లనే తీసుకుంటే, లాక్‌డౌన్ సమయంలో సీరియళ్లు, ప్రోగ్రామ్‌లు ప్రసారం చేసే చానళ్లన్నీ పాత సీరియళ్లను, ప్రస్తుత సీరియళ్ల పాత ఎపిసోడ్లను ప్రసారం చేసి కాలం వెళ్లదీశాయి. ఇక వేసిన సినిమాలనే వేసి వేసి, టీవీ అంటే చిరాకు వచ్చేలాగ కొన్ని ఛానళ్లు ప్రవర్తించాయి. ఇంకా కొన్ని చానళ్లయితే లాక్‌డౌన్ ఆసరాగా తీసుకుని దాన్ని కూడా ఒక కంటెంట్‌గా మార్చేసి, వీడియో కాల్‌తో కార్యక్రమాలను డిజైన్ చేసి ప్రసారం చేశాయి. కానీ షూటింగులు లేకపోతే ఈ క్రియేటివిటీతో నెట్టుకురావడం చాలా కష్టం. ప్రభుత్వం షూటింగులకు అనుమతి ఇవ్వగానే ఆనందంతో ఎగిరి గంతేశారు. కానీ మళ్లీ ఒక నటుడికి కరోనా పాజిటివ్ వచ్చిన భయం, గ్రేటర్ హైద్రాబాద్ రీ లాక్‌డౌన్ వార్తలతో మళ్లీ చానళ్లు డీలా పడ్డాయి.
ప్రకటనల కోసం పడిగాపులు
లాక్‌డౌన్ తర్వాత కార్యక్రమాల పునఃప్రారంభాన్ని చానళ్లు వివిధ క్రియేటివ్ కార్యక్రమాలు, ప్రెజంటేషన్‌తో ఆహ్వానించాయి. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసి, వీక్షకులను ఆకట్టుకున్నా.. ప్రకటనలు ఇచ్చే వారు లేకపోతే టీవీ చానళ్లకు ఆదాయం ఉండదు. పుట్టిబుద్ధెరిగిన తర్వాత ఒక లీడింగ్ టీవీ ఛానల్ వారు మా చానల్‌లో ప్రకటనలు ఇవ్వండి అంటూ ప్రత్యేకంగా ఒక ప్రకటన ప్రసారం చేయడం ఎవరూ చూసి ఉండరు. కానీ ఇప్పుడు అడ్వర్టైజ్ ఇండియా వారి ప్రోత్సాహంతో తమ నెట్‌వర్క్ గురించి ప్రచారాలు చేస్తూ టీవీ చానళ్లు ప్రకటనలు ఇస్తున్నాయి.
ఏదేమైనా చిన్న రంగానికి కరోనా కారణంగా పెద్ద దెబ్బ తగిలిందనొచ్చు. ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 15 రోజుల లాక్‌డౌన్ విధిస్తే మాత్రం మళ్లీ షూటింగ్‌లు ఆగిపోక తప్పని పరిస్థితి. అందుకే అధికారిక ప్రకటన వచ్చేలోపు వీలైనన్ని ఎపిసోడ్‌లు షూట్ చేయాలని 24 గంటలు కష్టపడుతున్నారు. ముందు వీడియో ఫుటేజీ తీసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు నెమ్మదిగా చేసుకుందామని నిర్మాతలు యోచిస్తున్నారు. అలాగని ప్రాణాలను పణంగా పెట్టి పనిచేయాలా అంటే.. తప్పని పరిస్థితి అని ఆర్టిస్టులు తమ బాధను వెల్లగక్కుతున్నారు. ఎప్పటికైనా మంచి రోజులు రావాలని ఆశించడం తప్ప, ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏం లేదని వాళ్లు నిరుత్సాహపడుతున్నారు.