- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పైసలే ఫస్ట్.. మిగతావి నెక్ట్స్
దిశ, న్యూస్ బ్యూరో :
తెలంగాణలో కొత్తగా తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అన్ని సెక్షన్ల ప్రజలు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం అది పారదర్శకంగా ఉంటుందని, జవాబుదారీతనం ఉంటుందని నమ్మబలికింది. గత ఏడాది సెప్టెంబరు 17న గెజిట్ విడుదల తరువాత అమలులోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖలోని నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ, అక్రమ లే ఔట్‌లను రిజిస్టర్ చేయరాదు. ఆ నిబంధనను తుంగలో తొక్కిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అనేక అక్రమ లే ఔట్‌లకు రిజిస్ట్రేషన్ జరిపించింది. ఇప్పుడు ఈ అక్రమాలను సక్రమం చేసుకూడానికి ఎల్ఆర్ఎస్ పేరుతో అవకాశం కల్పించామని చెబుతూ కరోనా కష్టకాలంలో నడ్డివిరిచే విధంగా భారీ స్థాయిలో ఫీజులు ఖరారు చేసింది. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు (కరోనా లాక్‌డౌన్ పీరియడ్ మినహాయించి) యధేచ్ఛగా రిజిస్ట్రేషన్లు జరిగేలా సహకరించిన ప్రభుత్వం ఇప్పుడు భారీ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకునే కార్యక్రమానికి తెర లేపింది. మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్ల గురించి మాత్రం ప్రభుత్వం నోరెత్తడం లేదు.
అప్పుడు వదిలేసి..
రాష్ట్రంలో ఎక్కడ లే ఔట్ ఉనికిలోకి రావాలన్నా గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ స్థాయిలో కమిషనర్ జీవో నెం. 67, 274కు లోబడి అనుమతి ఇవ్వాల్పిందే. అలాంటిది ఎలాంటి అనుమతులు లేకుండా లే ఔట్ వేస్తున్నవారిని చూసీ చూడనట్లుగా వదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని క్రమబద్ధీకరించుకోడానికి ఎల్ఆర్ఎస్ పేరుతో కొత్త పథకాన్నితెర మీదకు తీసుకొచ్చింది. ఆనాడు అక్రమంగా ఉన్నవన్నీ ఇప్పుడు డబ్బులు కడితే సక్రమం అయిపోతున్నాయి.
అప్పుడు నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల మీద మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అక్రమ లే ఔట్‌లు వేసినవారిపైనా, సంస్థలపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే చట్టం ఉన్నా, దాన్ని అమలు చేయడంలో అధికారులకు ఇప్పటికీ చిత్తశుద్ధి లేదు. ఎల్ఆర్ఎస్ పేరుతో భారీ వడ్డింపులతో సరిపెడుతోంది ప్రభుత్వం. మున్సిపల్ చట్టంలోని (178(3), 172(16) సెక్షన్లను తెలంగాణ రిజిస్ట్రేషన్ విభాగం ఉల్లంఘించి మరీ రిజిస్ట్రేషన్లు చేసింది. యాదగిరిగుట్ట, ఘట్కేసర్, జవహర్‌నగర్, బోడుప్పల్, పటాన్‌చెరు, షాద్‌నగర్ పట్టణాలకు చెందిన ప్లాట్ల యజమానులు బహిరంగంగానే ఈ ఆరోపణ చేస్తున్నారు. ఏడాది క్రితమే ఎల్ఆర్ఎస్ తీసుకువస్తే, కోవిడ్ కష్టాలు లేనందున రుసుం చెల్లించేవారమని అంటున్నారు. ఇప్పుడు కరోనా కాలంలో ఆర్థికంగా చితికిపోయిన తర్వాత ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ముక్కుపిండి మరీ వసూలు చేయడం ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు.
చట్టం అమలులో వైఫల్యం..
కొత్త చట్టం ప్రకారమే మునిసిపల్ ఎన్నికలను నిర్వహించామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. అదే చట్టంలోని రిజిస్ట్రేషన్ల విషయాన్ని మాత్రం మరిచిపోయింది. అప్పటి అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు ప్రజలకు గుదిబండగా మారింది. ఎల్ఆర్ఎస్ చేసుకుంటావా లేదా? అని మెడమీద కత్తి పెట్టిన తీరులో ప్రభుత్వం వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 113(8) 2018 డిసెంబర్ 15న గెజిట్‌గా మారింది. ప్రజల ఆర్థిక స్థోమతతో సంబంధం లేని తీరులో భారీ స్థాయిలో ఛార్జీలను ఖరారు చేసింది.
కొత్త మునిసిపల్ చట్టం ప్రకారం అక్రమ లే ఔట్ ప్లాట్లను, ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను, అనుమతి లేకుండా జరిగిన నిర్మాణాలను, అనుమతులను అతిక్రమించి వెలసిన కట్టడాలకు రిజిస్ట్రేషన్ చేయరాదంటూ జిల్లా రిజిస్ట్రార్లను, సబ్ రిజిస్ట్రార్లను రిజిస్ట్రేషన్ విభాగం అప్పట్లోనే ఆదేశించింది. అయినా రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఇవి ఎందుకు జరిగాయన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదంటున్నారు బోడుప్పల్ సమీపంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన మల్లేశం, వెంకటేష్, అరవింద్. చట్టం అమలు చేయడాన్ని విస్మరించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు ఉండవా? ఉన్నా చట్టానికి అతీతమా? వారు ఎప్పుడంటే అప్పుడే అమలు చేసుకునే వెసులుబాటు ఏమైనా ఉన్నదా? అనే ప్రశ్నలను ఇప్పుడు పట్టణ ప్రజలు లేవనెత్తుతున్నారు. అప్పుడే చట్టం ప్రకారంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తే తాము ప్లాట్లు కొనుగోలు చేసేవాళ్ళం కాదని జంగయ్య, ప్రసాద్ వ్యాఖ్యానించారు.