MK Stalin: తమిళనాడుకే కాదు.. అన్ని రాష్ట్రాల విజయం- స్టాలిన్

by Shamantha N |
MK Stalin: తమిళనాడుకే కాదు.. అన్ని రాష్ట్రాల విజయం- స్టాలిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు గవర్నర్ దగ్గర బిల్లుల పెండింగ్ అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. కాగా.. ఈ తీర్పుని తమిళనాడు ముఖ్యమంత్రి స్వాగతించారు. "ఈ తీర్పు తమిళనాడుకే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒక పెద్ద విజయం" అని స్టాలిన్ అన్నారు. “రాష్ట్ర స్వయంప్రతిపత్తి, సమాఖ్యవాదం అనే డీఎంకే సిద్ధాంతం కోసం తమిళనాడు పోరాడింది. పోరాడుతుంది. ఈ పోరాటంలో గెలుస్తుంది." అని చెప్పుకొచ్చారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే ఉంచేసుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లుల్ని సమ్మతించకపోవడం, పునఃపరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని తెలిపింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలో ఆయన తీరు మారడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపైనే సుప్రీం తీర్పు వెలువరించింది.

బిల్లుల లొల్లి

ఇకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును పాస్‌ చేసి ఆమోదం కోసం పంపినప్పుడు గవర్నర్‌ ఆ బిల్లుకు ఆమోదముద్ర వేయడం, సమ్మతి ఇవ్వకపోవడం, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం, పునఃపరిశీలనకు మళ్లీ అసెంబ్లీకి పంపడం వంటివి చేస్తారు. ఆ తర్వాత మళ్లీ సభ దానిని ఆమోదిస్తే.. గవర్నర్ సమ్మతితో నిలిపివేయలేరు. కానీ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు. రాజ్యాంగానికి, ప్రభుత్వ విధానాలకు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకు విరుద్ధంగా ఉందని భావిస్తే.. ఆవిధంగా రిజర్వ్ చేసే వీలు ఉంటుంది. ఇకపోతే, ఈ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీజేఐ జస్టిస్ ఖన్నా మాట్లాడుతూ.. “గవర్నర్‌ బిల్లును పరిశీలనకు వెనక్కి పంపాక.. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన తర్వాత రెండోసారి ఆ బిల్లులను గవర్నర్‌ రాష్ట్రపతికి సిఫార్సు చేయవద్దు. అలా చేస్తే అది చట్టవిరుద్ధం అవుతుంది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లుగానే పరిగణించాలి. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించదలిస్తే నెలరోజుల్లోపే గవర్నర్‌ దానిపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతికి సిఫార్సు అవసరం లేదనకుంటే 3 నెలల్లోపు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ శాశ్వతంగా వాటిని తమ దగ్గరే ఉంచుకోలేరు’’ అని గవర్నర్ ని ఉద్దేశించి అన్నారు.



Next Story

Most Viewed