TS Congress: నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల..! ఆ నియోజకవర్గాల్లో ఇంకా వీడని పీటముడి

by Shiva |   ( Updated:2024-03-27 04:29:22.0  )
TS Congress: నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల..! ఆ నియోజకవర్గాల్లో ఇంకా వీడని పీటముడి
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభకు ఎన్నికలు షెడ్యూల్ విడులైన నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ 17 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించారు. ఇక బీజేపీ కూడా అన్ని స్థానాల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపింది. అధికార కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో కాస్త వెనుకబడింది. 17 స్థానాలకు గాను కేవలం 9 స్థానాలకు మాత్రమే క్యాండిడేట్స్‌ను ప్రకటించింది. ఈ మేరకు మిగిలిన 8 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్‌ ఇవాళ అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనబోతున్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ భేటీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో సహా, కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏఐసీసీ రాష్ట్రానికి చెందిన నేతలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించింది. వారు ప్రతిపాదించిన సూచనల మేరకు అభ్యర్థులను పరిశీలించి ఫైనల్‌ లిస్టును సీఈసీకి పంపించింది. ఈ మేరకు నిజామాబాద్‌ పార్లమెంట్ స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు కంచుకోట అయిన మెదక్‌ నియోజకవర్గం నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్‌ను బరిలో దించే అవకాశం ఉంది.

ఇక భువనగిరి ఎంపీ స్థానానికి సంబంధించి ఇంకా క్లారిటీ రానట్లుగా తెలుస్తోంది. ఆ స్థానంలో పార్టీ సీనియర్లు ఇతరుల పేర్లు తెర పైకి తీసుకొస్తుంటే సీఎం రేవంత్‌ రెడ్డి మాత్రం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డిని పోటీలో దింపేందుకు సమాయత్తమవుతున్నారు. వరంగల్, ఖమ్మం బరిలో పసునూరి దయాకర్, ఖమ్మం పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో హస్తం పార్టీ ఏటు తేల్చుకోలేకపోతోందని సమాచారం. కాగా, అభ్యర్థుల జాబితాను నేడు సాయంత్రం లేదా రేపు ఉదయం విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Advertisement

Next Story