చైనా ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టినట్లు ఆధారాలున్నాయి : ట్రంప్

by vinod kumar |
చైనా ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టినట్లు ఆధారాలున్నాయి : ట్రంప్
X

వాషింగ్టన్ :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పట్లో చైనాను వదిలిపెట్టేలా లేరు. కరోనా పుట్టుకపై ఎవరు ఎన్ని నివేదికలు అందించినా.. తాను మాత్రం మొదటి నుంచి ఒకే మాటకు కట్టుబడి ఉన్నారు. కరోనా వైరస్ కచ్చితంగా వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా అంతకు కొన్ని గంటల ముందే అమెరికా నిఘా సంస్థలు.. కరోనా వైరస్ మానవుల సృష్టి కాదని స్పష్టం చేశాయి. వైరస్ జన్యుమార్పిడి ద్వారా తయారైంది కూడా కాదని నిఘా వర్గాలు తేల్చాయి. కాని తమ నిఘా సంస్థల మాటలను కూడా పట్టించుకోకుండా.. కరోనాకు చైనానే మూల కారణమని ట్రంప్ వాదిస్తున్నారు. తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. కాని ఇప్పుడు వాటిని వెల్లడించలేనని ట్రంప్ చెప్పారు. కరోనా వైరస్ పుట్టుకపై లోతైన విచారణ జరుగుతోందని.. త్వరలోనే ఆ వివరాలు బయటకు వస్తాయని ట్రంప్ వెల్లడించారు. కాగా, వూహాన్ లోనే వైరస్ పుట్టిందని చెప్పడానికి మీ వద్ద ఉన్న బలమైన ఆధారాలు ఏమిటో చెప్పగలరా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆ ఆధారాలను బయటకు చెప్పడానికి నాకు అనుమతి లేదు. కాబట్టి చెప్పను’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు చైనాపై దుమ్మెత్తి పోస్తున్న ట్రంప్.. జిన్‌పింగ్‌ను మాత్రం వెనకేసుకొని వచ్చారు. ఈ విషయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను బాధ్యడిని చేయదలచుకోలేదని అన్నారు. వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ పొరపాటున బయటకు వచ్చి ఉండొచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే వైరస్ బయటకు వచ్చిన తర్వాత చైనా కట్టడి చేయలేకపోయిందా లేదా కావాలనే నిర్లక్ష్యం వహించిందా అనే విషయాన్ని పక్కన పెడితే.. దీని వల్ల ప్రపంచం భారీ స్థాయిలో నష్టపోయిందని ట్రంప్ అన్నారు. చైనా సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. వైరస్ పుట్టుకకు ముందు చైనాలో ఏం జరిగిందనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలని.. దానిపైనే తమ విచారణ సాగుతోందని అన్నారు.

Tags: White house, Donald Trump, Coronavirus, Wuhan Lab, China, Secret AgenciesWhite house, Donald Trump, Coronavirus, Wuhan Lab, China, Secret Agencies

Advertisement

Next Story