- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంస్థాగత ఎన్నికలకు టీఆర్ఎస్ సమాయత్తం
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సమితి బలోపేతానికి సంస్థాగత ఎన్నికలపై అధిష్టానం దృష్టి సారించింది. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. యువతకు పెద్దపీట వేసేందుకు, గ్రామస్థాయిలో నాయకత్వ బాధ్యతలను అప్పగించేందుకు సమాయత్తం అవుతోంది. పార్టీ సీనియర్లకు సైతం అవకాశం కల్పిస్తూనే యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలో 60లక్షలకు పైగా టీఆర్ఎస్ పార్టీకి సభ్యులున్నారు. అయితే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 2న జెండా పండుగ నిర్వహించనుంది. అదేరోజు రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 142మున్సిపాలిటీల్లో పార్టీ జెండాను ఎగురవేసి గ్రామ, వార్డు కమిటీల నిర్మాణాన్ని పార్టీ నేతలు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీలు, 12 నుంచి 20వరకు మండల, పట్టణ కమిటీలు, 20 తర్వాత జిల్లా కమిటీల నిర్మాణం కంప్లీట్ చేస్తారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో డివిజన్ కమిటీలు,1400ల స్లమ్ ఏరియాలో బస్తీ కమిటీలను నియమిస్తారు.
అదే విధంగా పార్టీ అనుబంధ కమిటీలను సైతం సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేస్తాయడంతో పాటు సోషల్ మీడియాను సైతం పటిష్టం చేయనున్నారు. అందులో భాగంగానే మండల, పట్టణ, నియోజకవర్గ కమిటీలను నియమిస్తారు. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర కమిటీని నియమించి ప్లీనరీని నిర్వహించనున్నారు. నియామకమైన పార్టీలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచన మేరకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పార్టీ కమిటీల్లో 51శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటేనే చెల్లుబాటు అవుతుందని లేకుంటే ఆ కమిటీకి గుర్తింపు ఉండదని మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో ఈనెల 27న ప్రకటించారు. దీంతో పార్టీ నాయకులంతా కమిటీల్లో 51శాతం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
15 మందితో గ్రామకమిటీలు
టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలో 15 మంది సభ్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 51శాతం కల్పించనున్నారు. అంటే 15 మందిలో 8 మంది సభ్యులు ఉంటారు. అనుబంధ కమిటీలను 11 మందితో వేయనున్నారు. రైతు, విద్యార్థి, మహిళ, యువజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్, కార్మిక విభాగం, సోషల్ మీడియా కమిటీలను వేయనున్నారు. అన్ని అనుంబంధ సంఘాలను వార్డు, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉంటాయి. ఇప్పటికే గ్రామకమిటీల నియామకంపై నేతలతో చర్చిస్తున్నారు. మండలాధ్యక్షుడి నేతృత్వంలో ఆ మండలంలోని గ్రామాలను ఎంపీపీ, జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ, కోఆపరేటివ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు కొన్ని గ్రామాల బాధ్యలను అప్పగించారు. వారు నిర్వహించే ప్రతి సమావేశం, చర్చించే అంశాలు, తీసుకున్న నిర్ణయాలను స్థానిక ఎమ్మెల్యేలకు వివరించి అనుమతి పొందనున్నారు.
పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీ బలోపేతంతో పాటు, చురుకుగ్గా పాల్గొనని వారు ఉన్నారు. అయితే వారికి కమిటీల్లో అవకాశం కల్పించరు. కేవలం పార్టీ కోసం చురుగ్గా పనిచేసేవారికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు. పార్టీ జెండా మోసేవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలోనే ఈ కమిటీల ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నికలను పార్టీ నియమించిన ఇన్ చార్జులు పర్యవేక్షిస్తారు. గత కమిటీలు చేసిన పనులను విశ్లేషించడంతో పాటు పార్టీలో వీక్ గా ఉన్నవారికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. అయితే ఏ గ్రామంలో పార్టీ బలహీనంగా ఉంది… ఎవరిని నియమిస్తున్నామనే విషయాలను స్థానిక ఎమ్మెల్యేకు వివరిస్తారు. ఆయన అనుమతి మేరకే గ్రామశాఖ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
గ్రామంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారంతా కమిటీ నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. సమావేశం నిర్వహించి పార్టీకోసం పనిచేసేవారిని ఎన్నుకోనున్నారు. అయితే కమిటీ ఎన్నిక విషయంలో ఎలాంటి గొడవలు, భేదాభిప్రాయాలు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ఎక్కువగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకే యత్నిస్తామని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కమిటీల ఎన్నికకు ఒక మండలం వారు మరో మండలంలో పరిశీలకుడిగా వ్యవహరిస్తారని, వారి ఆధ్వర్యంలోనే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోనున్నారు.
పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టిసారించడంతో అందుకు సంబంధించిన సన్నాహాక సమావేశాలను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో గత రెండ్రోలుగా నిర్వహిస్తున్నారు. పార్టీ కమిటీలను ఎలా ఎన్నుకోవాలి, ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయాలను చర్చిస్తున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి వారి అభిప్రాయం తీసుకోవాలని పార్టీ ఇన్ చార్జులు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలకు సూచిస్తున్నారు. సంస్థాగత కమిటీల్లో ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు సాగుతున్నట్లు పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.