- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెడిసి కొట్టిన టీఆర్ఎస్ వ్యూహం.. జోష్‌లో కేడర్
దిశ,భద్రాచలం: భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యని ఒంటరి చేయాలనే టీఆర్ఎస్ పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. గులాబీ వ్యూహాన్ని ముందే పసిగట్టిన పట్టణ కాంగ్రెస్ సీనియర్లు కీలక సమయంలో ఎమ్మెల్యేకు అండగా నిలిచి గులాబీ నేతల ఎత్తుగడలకు చెక్ పెట్టారు. భద్రాచలంలో కాంగ్రెస్ బలం చెక్కుచెదరదని మరోమారు నిరూపించారు. మునుపటి కంటె రెట్టింపు ఉత్సాహంతో ఐకమత్యంగా అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీకి ఇది మింగుడు పడటం లేదు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ములుగు జిల్లా నుంచి వలస వచ్చి, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య అనూహ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించి ఘన విజయం సాధించారు. దీంతో షాక్ తిన్న గులాబీ నాయకత్వం ఆరోజు నుంచే పొదెం వీరయ్యపై దృష్టిపెట్టి ఎలాగైనా గులాబీ గూటికి రప్పించాలనే ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే భారీగా నగదు, ట్రైకార్ చైర్మన్ పదవి ఆశ చూపినట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. ఈ సమయంలోనే భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ వీడి గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా ఓవైపు సోషల్ మీడియాలో, మరోవైపు అనుకూల మీడియా ద్వారా ప్రచారం సాగించినా ఫలితం లేకపోయింది.
ఫలించని గులాబీ వ్యూహం
ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు గులాబీ కండువా కప్పడానికి భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఫలించడం లేదు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య మొండిఘటం అని తేలిపోవడంతో పార్టీలో చేర్చుకొనే అంశాన్ని పక్కనబెట్టి రాజకీయంగా ఆయన్ని బలహీనపర్చే మరో స్కెచ్ సిద్ధం చేసినట్లుగా తేటతెల్లమౌతోంది. అందులో భాగంగానే భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య బలం, బలహీనతలపై గులాబీ పెద్దలు దృష్టి పెట్టారు. సహజంగా గ్రూపు గొడవలతో సతమతమయ్యే కాంగ్రెస్ శ్రేణులంతా 2018 ఎన్నికల్లో ఒక్కటయ్యారు. దానికితోడు సీపీఐ, టీడీపీ శ్రేణులు పట్టుదలతో పనిచేయడంతో పొదెం వీరయ్య గెలుపు సునాయాసమైంది. అటు పిమ్మట కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ నాయకుల నడుమ అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఎమ్మెల్యే పొదెం వీరయ్య పట్టణ కాంగ్రెస్ నాయకుల్లో కొందరిని చేరదీసి, మరికొందరిని కనీసం పట్టించుకోవడంలేదనే ఆరోపణలతో కీలక నేతలంతా అలిగి ఆయనకు క్రమేపీ దూరమయ్యారు.
ఒంటరిని చేసేందుకు పావులు..
కాంగ్రెస్‌లో సమన్వయ లోపమే డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రధాన బలహీనతని భావించిన టీఆర్ఎస్ నాయకత్వం పొదెం వీరయ్యని ఒంటరిని చేసేందుకు పావులు కదిపింది. ఎప్పుడు ఎమ్మెల్యే పక్కన ఉండే భద్రాచలం పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నక్కా ప్రసాద్, అతని అనుచరుడైన భద్రాచలం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెల లోకేశ్‌కుమార్‌లను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడంలో గులాబీ నేతలు సక్సెస్ అయ్యారు. భద్రాచలం పట్టణ కాంగ్రెస్ పార్టీలోని మిగతా నేతలు ఎమ్మెల్యేకు ఎలాగు దూరంగా ఉంటున్న కారణంగా ఎమ్మెల్యే వెన్నంటే ఉండే వారిని పార్టీలో చేర్చుకొంటే ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఒంటరి అవుతారని, కాలక్రమేణా ఆయన కూడా చివరకు కారెక్కుతారని టీఆర్ఎస్ నాయకత్వం భావించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సీనియర్ల అండ
భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు కుడిభుజంగా కొనసాగిన నక్కా ప్రసాద్ తన అనుచరులతో గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో ఇక ఎమ్మెల్యే ఒంటరి అనుకున్నారు. స్థానికేతరుడైన వీరయ్య కష్టాల్లో పడ్డారని గులాబీ పార్టీ శ్రేణులు వేసుకున్న లెక్కతప్పింది. దూరమయ్యారని అనుకొన్న పట్టణ కాంగ్రెస్ సీనియర్లు అంతా ఒక్క తాటిపైకి వచ్చి ఎమ్మెల్యే వీరయ్యకు అండగా నిలిచారు. పార్టీ వీడిపోయిన ఒకరిద్దరి కంటె వెన్నంటే అడుగులు వేస్తున్న వారితో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఎంతో ఖుషీగా ఉన్నారు. ఇకపై సమన్వయంతో పార్టీని పటిష్టపర్చి వచ్చే ఎన్నికల నాటికి భద్రాచలం నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ బలమైన రాజకీయశక్తిగా చేయడంపై ఎమ్మెల్యే పొదెం వీరయ్య దృష్టి పెట్టారు.