నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

by Shyam |   ( Updated:2020-04-26 09:09:28.0  )
నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రత్యేక రాష్ట్ర సాధన నినాదంతో ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో ఆరేళ్ళుగా ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరపుకుంటూ వస్తోన్న పార్టీ ఈ సారి లాక్‌డౌన్ కారణంగా నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు. నిబంధనలు పాటిస్తూ కార్యకర్తలు జెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చారు. గతంలో పార్టీ ఆవిర్భవ వేడుకల్లో నాయిని నర్సింహారెడ్డి జెండాను ఆవిష్కరించగా, నిరుడు కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సారి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేయనున్నారు. వేడుకలను పురస్కరించుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం రక్తదానం చేశారు. కార్యకర్తలు కష్టకాలంలో పేదలకు సాయం చేస్తూ రక్తదానం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రజా సేవకు పునరంకితమవుదాం..

రెండు దశాబ్దాలు ప్రజల్లో మమేకమైన అనుభవంతో మరోసారి ప్రజా సేవకు పునరంకితమవుదామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో పార్టీ ప్రత్యక్ష ప్రభావం చూపకపోయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు ద్వారా పరోక్షంగా ప్రభావం చూపిందన్నారు. పార్టీ ప్రస్థానం ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం దాకా వచ్చిందన్నారు. 20వ వసంతంలోకి అడుపెడుతున్న సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్, విద్యాసాగర్‌రావు లాంటి వారి త్యాగాలను గుర్తుచేసుకోవాలన్నారు. రెండు దశబ్దాలుగా ప్రజాదరణ పొందుతున్న పార్టీలు దేశంలో కొన్నే ఉన్నాయని, అందులో టీఆర్ఎస్ ఒకటన్నారు. 60లక్షల మంది సభ్యత్వం ఉందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అవహేళన చేయబడ్డ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలు రాష్ట్ర ఏర్పాటు తర్వాత గౌరవాన్ని దక్కించుకున్నాయన్నారు.

tags:Trs, Ktr, Formation, Country, flag, Blood donation, Telangana

Advertisement

Next Story

Most Viewed