ఎమ్మెల్సీ ఎన్నికల హోరు.. ‘కారు’లో జోరుగా బేరం

by Anukaran |   ( Updated:2021-11-23 23:12:25.0  )
ఎమ్మెల్సీ ఎన్నికల హోరు.. ‘కారు’లో జోరుగా బేరం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అధికార టీఆర్ఎస్ పార్టీలో క్యాంపులు కూడా స్టార్ట్ అయ్యాయి. స్క్రూటినీ, విత్ డ్రాయల్స్ తరువాత ఊపందుకోవాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇప్పుడే రంజుగా మారింది. బాహాటంగా సాగుతున్న తీరోకటైతే.. అంతర్గతంగా జరుగుతున్న ప్రచారం మరో తీరుగా ఉంది.

ఇంతకీ ఏం జరుగుతోంది..?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,326 ఓట్లు ఉండగా ఇందులో 996 మంది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఒక ప్రజా ప్రతినిధి ఇద్దరు అభ్యర్థులకు ఓటేయాల్సి ఉంటుంది. అయితే, ఇందులో మండల పరిషత్, జిల్లా పరిషత్ సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో నైరాశ్యం నెలకొంది. తమకు నిధులు కేటాయించే విషయంలో, విధులు అప్పగించే విషయంలో సర్కారు శీతకన్నేసిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాదరావుపై కూడా స్థానిక ప్రతినిధుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వీటన్నింటిని ఆసరాగా తీసుకుని ప్రత్యర్థులు సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్ వలలో చిక్కుకున్నట్టయితే పార్టీ తీరని నష్టాన్ని చవి చూడాల్సి వస్తోందని గుర్తించిన అధిష్టానం క్యాంపు రాజకీయాలు షురూ చేసినట్టుగా అర్థం అవుతోంది. పార్టీతో అనుబంధం ఉన్నప్పటికీ సీక్రెట్ ఓటింగ్ కావడంతో తమ ఓటర్లు పక్క చూపులు చూడకుండా ఉండేందుకు అప్రమత్తం అయినట్టు తెలుస్తోంది.

రెండుకు.. రెండు.. ఒకటికి.. ఐదు..?

మండలిలో అడుగుపెట్టేందుకు ఒక్కో అభ్యర్థి 664 ఓట్లు వస్తే మెజార్టీ సాధించినట్టు అవుతుంది. టీఆర్ఎస్ పార్టీకి 996 మంది ఓటర్లు ఉండగా 330 మంది కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు ఉన్నారు. అయితే గెలుపుకోసం అవసరమైన మెజార్టీని పొందేందుకు ప్రత్యర్థులు సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేసి బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక ఓటుకు రూ. 5 లక్షల వరకూ ముట్టచెప్తామన్న సంకేతాలను పంపిస్తున్నారు. సీక్రెట్‌గా సాగుతున్న ఈ ఒప్పందాల ప్రభావం ఎంతమేర ఉంటుందో వేచి చూడాల్సిందే. మరో వైపున అధికార పార్టీ కూడా తమ ఓటర్లను సాటిస్ఫై చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. క్యాంపులను నిర్వహించి దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లడమే కాకుండా ఒక్కో ఓటరుకు రూ. 2 లక్షల వరకు ముట్టజెప్పాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇద్దరు అభ్యర్థులకు కలిపి ఈ మొత్తం ఇచ్చేందుకు రంగం సిద్దం చేసినట్టు సమాచారం.

హుజురాబాద్ రిపీట్..

హుజురాబాద్ నియోజకవర్గంలో అక్కడి ఓటర్లు ఇచ్చిన తీర్పు పునరావృతం అవుతుందా అన్న నమ్మకం ప్రత్యర్థుల్లో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక ప్రతినిధుల్లో నెలకొన్న అసహనాన్ని ఓటు రూపంలో చూపించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు ఇదే సరైన సమయం అని భావించే స్వతంత్రులుగా బరిలో నిలుస్తున్నట్టు సమాచారం. సైలెంట్ ఓటింగ్ ఖచ్చితంగా పడుతుందని వారి నిర్ణయంతోనే తమ తలరాతలు మారుతాయన్న ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త వార్ ?

Advertisement

Next Story