‘సహకారం'లో సరికొత్త చరిత్ర..!

by Shyam |

దిశ, నెట్‌వర్క్: తెలంగాణ రాష్ట్ర సహకార వ్యవస్థలోనే ఇదో సరికొత్త చరిత్ర. మునుపెన్నడూ లేని విధంగా సహకార సంఘాల ఎన్నికల్లో అధికారపక్షం అన్ని అవకాశాలనూ వినియోగించుకున్నది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జరిగిన సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి తొమ్మిది జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు(డీసీసీబీ) ఉండగా, మరో తొమ్మిది జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య(డీసీఎంఎస్)లు ఉన్నాయి. వీటన్నింటికీ తొలిదశలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ సొసైటీలను అధికార టీఆర్ఎస్ పార్టీయే చేజిక్కించుకున్నది. అయితే డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులకు ముందుగా జరగాల్సిన డైరెక్టర్ల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది. అలాగే, రాష్ట్రంలో ఉన్న మొత్తం 147 కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ పదవులు, 74 జిల్లా మార్కెటింగ్ సహకార సొసైటీ డైరెక్టర్ పదవులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఇందుకు ప్రభుత్వం మంత్రులను రంగంలోకి దింపింది. దీంతో రాష్ట్రంలో డైరెక్టర్ల పదవులకు ఒక్క చోట కూడా ఎన్నికలు జరగలేదు. ఇలా పదవులన్నీ ఏకగ్రీవమవడం రాష్ట్ర సహకార చరిత్రలోనే తొలిసారని అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలన్నీ “సహకార” రాజకీయాలకు దిగడం కొసమెరుపు. ఈ లెక్కన మరో మూడు రోజుల్లో జరగనున్న సెంట్రల్ బ్యాంక్, మార్కెటింగ్ సొసైటీ జిల్లాల చైర్మన్, వైస్ చైర్మన్‌ల పదవులు గులాబీ నేతలు దక్కించుకోవడం లాంఛనం కానుంది.
వరంగల్‌లో..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో డైరక్టర్ పదవులు ఏకగ్రీవం చేయడంలో మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు సఫలీకృతులయ్యారు. దీంతో డీసీసీబీ, ఓరుగల్లు జిల్లా మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో మొత్తం 20 డైరెక్టర్ల పోస్టులకు 17నామినేషన్లు దాఖలవ్వగా, సింగిల్ నామినేషన్లతో డైరెక్టర్ పోస్టుల ఏకగ్రీవం అయ్యాయి.


మహబూబ్‌నగర్‌లో..
ఉమ్మడి మహబూబ్ నగర్‌ జిల్లాలోనూ డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవంగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజారంజకమైన పరిపాలన కొనసాగిస్తుండటం వల్లే జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.


నల్లగొండలో..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీసీసీబీ డైరెక్ట‌ర్ల ఎన్నిక బాధ్య‌త‌ను రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీష్‌రెడ్డికి అప్ప‌గించ‌డంతో ఆయ‌న 11 మంది గులాబీ ఎమ్మేల్యేల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని, కాంగ్రెస్ నుంచి నామినేష‌న్లు ప‌డ‌కుండ ఆ పార్టీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి సక్సెస్ అయ్యారు. ఫలితంగా న‌ల్ల‌గొండ జిల్లాలోనూ డీసీసీబీ డైరెక్ట‌ర్ల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఇందులో ఒకటి కాంగ్రెస్ ద‌క్కించుకోగా మిగ‌తా 16 డైరెక్ట‌ర్ స్థానాల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుంది. మ‌రో మూడు డైరెక్ట‌ర్ ప‌ద‌వుల‌కు ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు లేక‌పోవ‌డంతో అవి ఖాళీగా మిగిలిపోయాయి. 10 మంది జ‌న‌ర‌ల్ డైరెక్ట‌ర్ స్థానాల‌కు 18 మంది, రెండు బీసీ డైరెక్ట‌ర్ స్థానాల‌కు ఐదుగురు నామినేష‌న్ వేశారు. ఇందులో కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఉన్నారు. వారితో విత్ డ్రా చేయించ‌డానికి న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కుంభం శ్రీ‌నివాస్‌రెడ్డిని ఏక‌గ్రీవంగా డైరెక్ట‌ర్ చేస్తామ‌న‌డంతో మ‌రో మూడు చోట్ల వారు ఉప‌సంహ‌రించుకున్నారు. సొంత పార్టీ నుంచి నామినేష‌న్లు దాఖ‌లు చేసిన అభ్య‌ర్థుల‌కు నచ్చజెప్పి వారితో విత్ డ్రా చేయించ‌డంతో డీసీసీబీ ఎన్నికలు నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం త‌ప్పింది. అలాగే డీసీఎంఎస్ డైరెక్ట‌ర్లు 10కి ప‌దిమంది టీఆర్ఎస్ డైరెక్ట‌ర్లను ఏక‌గ్రీవంగా ఎన్నికచేసేందుకు మంత్రి వేసిన పాచిక‌లు పారాయి. టీఆర్ఎస్‌కు ఈ రెండు చైర్మన్‌, వైస్ చైర్మన్ ప‌ద‌వులు ద‌క్క‌నుండ‌టంతో న‌ల్ల‌గొండ‌కు వ‌చ్చిన గులాబీ ఎమ్మేల్యేలు, కొత్త‌గా ఎన్నికైన డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి మిఠాయిలు పంచుకుని సంబురాలు జ‌రుపుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed