ఆ ప్రయాణికుల శాంపిల్స్‌లో ఏం తేలింది.. ఆరోగ్యశాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు

by Anukaran |
Corona
X

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలోకి ప్రవేశించిందన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రయాణికులపై తిరిగి ఆంక్షలు తీసుకొచ్చారు. ప్రతీ ప్రయాణికుడికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేశాక నెగిటివ్ వస్తేనే అనుమతిస్తున్నారు. అందులోనూ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వారిని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు రోజుల క్రితం సౌతాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందని తేలడంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు అధికంగా ఉండటంతో ఇద్దరు ప్రయాణికుల శాంపిల్స్‌ను ముంబై ల్యాబ్‌కి పంపించి టెస్టు చేశారు.

ఈ క్రమంలో కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా మారాయి. ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరి శాంపిల్ డెల్టా వేరియంట్ కంటే వేరుగా ఉందని చెప్పుకొచ్చారు. దీంతో ఈ శాంపుల్‌ను కేంద్ర ప్రభుత్వ ల్యాబొరేటరీకి పంపించామని, ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. దేశం అతి పెద్దది కావడంతో నిత్యం లక్షలాదిగా అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు జరగుతుంటాయని, ఒకవేళ ఒమిక్రాన్ ప్రవేశిస్తే దాని వ్యాప్తిని నిరోధించడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మళ్లీ టెస్ట్, ట్రాక్, ట్రేస్, ట్రీట్, టెక్నాలజీ వ్యూహాన్ని ప్రారంభించాలన్నారు. ఒమిక్రాన్ రూపాంతరం డెల్టా వేరియంట్ కంటే అధికంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా, కరోనా థర్డ్ వేవ్ వచ్చిందని ఇప్పుడే చెప్పలేమని వెల్లడించగా.. దీని కట్టడికి గత 15 రోజులుగా కర్ణాటకకు వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed