ఫోన్ వాడకానికి, మానసిక ఆరోగ్యానికి లింక్?

by sudharani |
ఫోన్ వాడకానికి, మానసిక ఆరోగ్యానికి లింక్?
X

ఈ మధ్యకాలంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చనిపోతే డిప్రెషన్ కారణం అని నిర్ధారించేస్తున్నారు. కానీ మానసిక అనారోగ్య స్థితి అయిన ఈ డిప్రెషన్ గురించి ఒకరితో పంచుకుంటే గానీ తెలియదు. కానీ పంచుకోవడానికి చాలా మంది సంకోచిస్తారు. దాన్ని కనిపెట్టడానికి కూడా ఒక యాప్ ఉంటే బాగుంటుంది కదా.. ఇదే ఆలోచన డల్హౌసీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలకు కూడా వచ్చింది. మానసిక ఆరోగ్యం గురించి ఎవరి దగ్గరికైనా వెళ్లి అడిగితే వారు చెప్పడానికి ఇబ్బందిపడతారు. వారు ఎలాంటి ఇబ్బందిలేకుండా చెప్పుకోగలిగేది ఒక్కరికే. అది వారి స్మార్ట్‌ఫోన్. అందుకే ఫోన్ వాడకానికి, మానసిక ఆరోగ్యానికి లింక్ పెడుతూ ఈ పరిశోధకులు ఒక యాప్ రూపొందించారు. దాని పేరు ప్రోజిట్.

స్మార్ట్‌ఫోన్‌లో సులభంగా ట్రాక్ చేయగల వ్యాయామం, నిద్ర, కాల్ ఫ్రీక్వెన్సీ, మెసేజ్ హిస్టరీ, వింటున్న సంగీతాన్ని బట్టి.. ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను గుర్తిస్తుంది. అంతేకాకుండా మెసేజ్ టైప్ చేస్తున్నపుడు సంబంధిత వినియోగదారుడు కీస్ట్రోక్ బలాన్ని అంటే అతను కీబోర్డు మీద ఎంత ఒత్తిడి కలిగిస్తున్నాడనే విషయాన్ని కూడా ట్రాక్ చేసి ఈ విషయాలను నిర్ధారిస్తుంది. సాధారణంగా డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్న వ్యక్తి సరిగా నిద్రపోడు, వ్యాయామం మీద ఆసక్తి ఉండదు, అనవసర కాల్స్ తీసుకోడు, ఒకే వ్యక్తికి ఎక్కువ సార్లు కాల్ చేస్తుంటాడు, బాధాకరమైన పాటలు, మోటివేషనల్ వీడియోలు చూస్తుంటాడు. ఈ లక్షణాలన్నింటి ప్రోజిట్ యాప్ పసిగట్టి డిప్రెషన్ తీవ్రతను కూడా తెలియజేస్తుంది. అలాగే వినియోగదారులు తమ సంఘటనల గురించి, తాము బాధతో చెప్పుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే కూడా ఈ యాప్‌కు చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ యాప్‌ను 300 మంది మీద ప్రయోగాత్మకంగా ప్రయత్నించారు. వారిలో సగం మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నవారే. వారిని ఈ యాప్ సరిగా గుర్తించగలిగినట్లయితే ఈ యాప్ తన పనిలో విజయవంతమైనట్టేనని పరిశోధకులు అంటున్నారు.

Advertisement

Next Story