చట్టాలు రద్దు.. ఉద్యమం కొనసాగుతుందన్న రైతు సంఘం నేత టికాయత్

by Anukaran |
చట్టాలు రద్దు.. ఉద్యమం కొనసాగుతుందన్న రైతు సంఘం నేత టికాయత్
X

దిశ, డైనమిక్ బ్యూరో : గురునానక్ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగానే ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఆందోళన విరమించాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రకటనతో ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతు సంఘాలు స్పందించాయి.

భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంటులో రద్దు చేసే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధరపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, దాని గురించి రైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పంజాబ్ డిప్యూటీ సీఎం ఎస్ఎస్ రంధవా మాట్లాడుతూ..11 నెలలుగా సాగిన రైతు ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు చనిపోయారని తెలిపారు. కేంద్రం ఆ రైతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

Next Story

Most Viewed