‘పది’ పరీక్షల్లో నో జంబ్లింగ్!

by Shyam |
‘పది’ పరీక్షల్లో నో జంబ్లింగ్!
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘పది’ పరీక్షల నిర్వహణలో అధికారులు, సిబ్బంది నియమాకాలపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19 నుంచి జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు మంగళవారం రాత్రి తుది జాబితాను సిద్ధం చేశారు. నిజామాబాద్ నగరంతోపాటు నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలం 3 జోన్లలో 30 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ కేంద్రాల్లో జూనియర్లను అధికారులుగా, సీనియర్లను ఇన్విజిలేటర్లుగా నియమించారు. పైగా ఉపాధ్యాయులను ఈసారి జంబ్లింగ్ ప్రాతిపదికన నియమించకపోవడంపట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

నో జంబ్లింగ్!

సాధారణంగా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు ఉపాధ్యాయులను జంబ్లింగ్ పద్ధతిలో నియమిస్తారు. కానీ, ఈ సారి అలా కేటాయించలేదు. కనీసం రూరల్‌లో ఉన్నవారికి అర్బన్, అర్బన్‌లో ఉన్న వారికి రూరల్ ప్రాంతాల్లో విధులు కేటాయించలేదు. దీంతో ఈ విషయంపై విమర్శలు వస్తున్నాయి. సెల్ఫ్ సెంటర్లలో ఇన్విజిలేషన్ బాధ్యతలు ఇవ్వడం ఎంత వరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు అధికారులను ప్రభావితం చేయడం వల్లే ఇలా ఇన్విజిలేషన్ ఇచ్చినట్టున్నారని ఆరోపణలూ వస్తున్నాయి. 2019లో జరిగిన పరీక్షల్లో సీఎస్(చీఫ్ సూపరింటెండెంట్), డీవో(డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్)లుగా ఉన్న వారికి ఈసారి బాధ్యతలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు. జిల్లా పాలనాధికారి పరీక్షల నిర్వహణ విషయంలో జంబ్లింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, సెల్ఫ్ సెంటర్ల బాధ్యతలను తొలగించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Tags : 10th class exam, jumbling system, nizamabad dist, students


👉 Read Disha Special stories


Next Story

Most Viewed