అంతర్జాతీయ వేదికపై ‘లడఖ్’ ఉన్నిదుస్తులు

by Shyam |   ( Updated:2021-03-09 00:45:54.0  )
Ladakh’s Finest
X

దిశ, ఫీచర్స్: ప్రతీ ప్రాంతానికి అంతర్లీనంగా ఏదో ఒక కళ ఉండే ఉంటుంది కానీ దాన్ని గుర్తించడం ముఖ్యం. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న ఆ కళను నేర్చుకోవడం, అందులో ప్రావీణ్యం సాధిస్తూనే మోడ్రన్ టచ్ ఇస్తే ఆటోమేటిక్‌గా ప్రపంచస్థాయి గుర్తింపును పొందడం చాలా సందర్భాల్లో చూశాం. పురాతన కళకు అద్భుతమైన సృజనాత్మకతను జోడిస్తే ఎంత గొప్ప ఫలితాలు చూడగలం, వరల్డ్ వైడ్‌గా ఎలా సత్తాచాటగలమో ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రపాతిత ప్రాంతం లడఖ్ వస్త్ర వారసత్వాన్ని ఇద్దరు ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఎలా గుర్తించారు? ఆ ప్రాంత ఉన్ని ప్రాశస్త్యం, సహజ రంగుల అద్దకం వారసత్వాన్ని లడఖ్ నుంచి లండన్ ఫ్యాషన్ వీక్‌కు ఎలా చేర్చారు? సంప్రదాయ లడఖ్ ఉన్నికి ఏ విధంగా ఆధునికత జోడించారు? ఉన్నితో రూపొందించబడ్డ దుస్తులు అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఆకట్టుకోబడుతున్నాయి? ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం.

Padma Yangchan, Jigmet Disket

కేంద్రపాలిత ప్రాంతం ‘లడఖ్’ ఒకప్పుడు గ్లోబల్ ట్రేడ్ రూట్‌కు ప్రసిద్ధి. ఇక్కడి నుంచే సంప్రదాయ ఉన్ని, ముడి సరుకు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతుండేది. షిప్ మేకింగ్‌కు అవసరమయ్యే ముడి సరుకును ఈ ప్రాంత సంప్రదాయ మత్స్యకారులు పడవల ద్వారా మధ్య ప్రాచ్య దేశాలకు పంపేవారు. వస్త్రాలు నేయడం ఈ ప్రాంత వాసుల వారసత్వం, వారి సంస్కృతిలో ఒక భాగం. కానీ కాలక్రమంలో టెక్నాలజీ రాకతో సంప్రదాయ కళలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. కాగా పూర్వీకుల ఘనతను చాటుతూనే, ఆధునిక సొబగులద్ది ప్రపంచస్థాయిలో నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు లడఖ్‌కు చెందిన పద్మ యాంగ్‌చన్, జిగ్మెట్ డిస్కెట్. సంప్రదాయ, ఆధునికతల కలబోతగా దుస్తులు రూపొందించేందుకు నమ్జా కోచర్ (Namza Couture) అనే వెంచర్‌ను 2016లో ప్రారంభించారు. దీని ద్వారా మోడ్రన్ లైఫ్ స్టైల్‌కు అనుగుణంగా ‘ఈజీ టు వేర్’ డిజైన్స్‌ రూపొందించి లడఖ్‌ను వస్త్రవాణిజ్య హబ్‌గా మార్చాలని డిసైడ్ అయ్యారు.

ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచ్‌లర్స్ ఇన్ సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పద్మ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి లండన్, ముంబై, ఢిల్లీకి చెందిన పలు డిజైనింగ్ హౌసెస్‌లో పని చేసింది. అయితే తన కాలేజీ ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా థిమ్కా(Thimka) అనే సంప్రదాయ పద్ధతిలో ఉన్ని వస్త్రాలకు రంగు అద్దకం నేర్చుకుంది. ఆ సమయంలోనే లడఖ్ సంప్రదాయ వస్త్ర కళల గొప్పతనం గురించి తెలుసుకున్న ఆమె.. దీనిపై రీసెర్చ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ ప్రాంత సంస్కృతి, వారసత్వంగా వచ్చిన ఆర్ట్స్ గురించి స్టడీ చేసి, వాటిని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత లేహ్‌లో వస్త్రాల తయారీపై దృష్టి సారించింది. స్థానిక కళాకారుల దగ్గరు ఈ కళకు సంబంధించిన వివరాలు తెలుసుకుని, వారి విధానంలోనే వస్త్రాలు నేయించి తను అనుకున్న విధంగా మోడ్రన్ దుస్తులు తయారు చేయించి మార్కెట్‌లో విడుదల చేయాలనుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో బీ.టెక్ చేసిన జిగ్మెట్ డిస్కెట్‌ను కలిసింది పద్మ. సంప్రదాయ వస్త్రకళలపై డీఆర్‌డీ‌వోలో ఇంటెర్న్‌షిప్‌లో చేరిన జిగ్మెట్..లేహ్ ప్రాంతవాసులు వస్త్రాలపై సహజ సిద్ధమైన పూల రంగులు ఏ విధంగా అద్దుతారో తెలుసుకుంది. ఏయే ఫ్లవర్స్‌ను నేచురల్ డైయింగ్ కోసం వాడొచ్చు? అనే విషయంపై స్టడీ చేసింది. ఇంటెర్న్‌షిప్ పూర్తైన తర్వాత ఆమెకు ఢిల్లీలోని ఓ ఫార్మాసూటికల్ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చినా సరే వదిలేసింది జిగ్మెట్. పద్మతో పాటు లేహ్ స్థానిక కళాకారులతో కలిసి సహజ పద్ధతిలో వస్త్రాలు తయారు చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగింది. అలా వారిద్దరి నాయకత్వంలో నమ్జా కోచర్ వెంచర్ ప్రారంభమైంది.

పద్మ, జిగ్మెట్ ఇద్దరూ గొర్రె ఉన్ని (నంబు, పష్మినా), జడల బర్రె ఉన్ని (ఖులు), ఒంటె ఉన్నితో ఆ ప్రాంత వారసత్వాన్ని ఫాలో అవుతూ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ (బట్టల ఉత్పత్తి) షురూ చేశారు. వీటికి సహజమైన పూల రంగుల అద్దకానికి స్థానిక కళాకారులను నియమించుకుని ఫైనల్‌గా మోడ్రన్ స్టైల్ గార్మెంట్స్ తయారు చేశారు. ఈ పనులకు మహిళా స్వయం సహాయక సంఘాలను సంప్రదించి వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. స్థానికుల సహాయంతో ఫైనల్‌గా మోడ్రన్ అండ్ ట్రెండీ స్టైల్ గార్మెంట్స్ రూపొందించి మార్కెట్‌లో రిలీజ్ చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో..ఆ తర్వాత లడఖ్‌లోని జంస్కార్ సబ్ డిస్ట్రిక్ట్‌లో ఉండే గొర్రెల ఉన్నితో స్పెషల్ డిజైన్డ్ వస్త్రాలు రూపొందించారు. ఇవి కాస్త అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షించగా..ఈ వారసత్వ సంప్రదాయ వస్త్ర కళల ప్రదర్శనకు గతేడాది అరుదైన అవకాశం లభించింది. లడఖ్‌కు చెందిన అరుదైన వస్త్రాలు, యూనిక్ డిజైన్స్ ప్రదర్శించాలని కోరుతూ లండన్ ఫ్యాషన్ వీక్ నుంచి ఆహ్వానం అందింది. ఈ ప్రాంత వస్త్ర వారసత్వ సంపద నంబు, స్పరుక్స్‌తో డిజైన్ చేసిన వస్త్రాలు అక్కడ ప్రదర్శించగా ఇంటర్నేషనల్ ఫ్యాషన్ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. ఫారినర్స్ ఈ గార్మెంట్స్‌కు అట్రాక్ట్ అయి ఆర్డర్స్ ఇవ్వడం ప్రారంభించారు. తద్వారా నమ్జా వెంచర్‌లో రూపొందించబడే ఫాబ్రిక్స్‌కు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడింది. తమ పూర్వీకుల సంస్కృతి, వస్త్ర కళలు రక్షిస్తూనే తమను తాము రీ ఇన్వెంట్ చేసుకోవడం, ఇంటర్నేషనల్ లెవల్‌లో గుర్తింపు పొందడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు పద్మ, జిగ్మెట్. తమ ప్రొడక్ట్స్ అందరికీ అందుబాటులో ఉంచేందుకు త్వరలో వెబ్‌సైట్ కూడా తీసుకురాబోతున్నామనే న్యూస్ షేర్ చేస్తుండడం హ్యాపీగా ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed