ఐపీఎల్ 13వ సీజన్‌లో మారిందేమిటి?

by Shyam |
ఐపీఎల్ 13వ సీజన్‌లో మారిందేమిటి?
X

దిశ, స్పోర్ట్స్: మరోవారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానుంది. ప్రపంచంలో అత్యంత ఆదరణ, విలువైన లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఆడటానికి ఏ దేశ క్రికెటర్ అయినా కలలు కంటుంటాడు. అలాగే సాధారణ రోజుల్లో క్రికెట్ చూడని వాళ్లు కూడా ఐపీఎల్ కోసం ఎదురు చూస్తుంటారు. ఐపీఎల్ జరిగే సమయంలో టీవీల అమ్మకాలు, డీటీహెచ్ కనెక్షన్ల కొనుగోళ్లు భారీగా పెరుగుతుంటాయి. ఐపీఎల్ కోసమనే ప్రత్యేకంగా స్కీమ్స్ పెట్టి వినియోగదారులను ఆకర్షిస్తుంటారు. అయితే గత సీజన్‌తో పోల్చుకుంటే ఈ సీజన్‌లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటో చూద్దాం

వేదిక: కరోనా కారణంగా మార్చి-మే మధ్యలో నిర్వహించాల్సిన ఐపీఎల్ వాయిదా పడింది. దీంతో ఆరు నెలల ఆలస్యంగా యూఏఈ గడ్డపై ఈ మెగా లీగ్ నిర్వహిస్తున్నారు. పూర్తి బయోసెక్యూర్ వాతావరణంలో మూడు మైదానాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గతంలో ఎనిమిది జట్లకు ఎనిమిది హోం గ్రౌండ్లు ఉండేవి. కొన్ని జట్లకు రెండేసి హోం గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ సారి అబుధాబి, షార్జా, దుబాయ్‌ల్లో మాత్రమే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.

కరోనా పరీక్షలు: ఐపీఎల్ జరిగే సమయంలో ఆటగాళ్లకు డోపింగ్ టెస్టులు నిర్వహించడం సాధారణమే. అయితే ఈ సారి వాటికి తోడు కోవిడ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. బయోబబుల్‌లోకి ప్రవేశించక ముందే మూడు సార్లు కోవిడ్ టెస్టులు చేస్తారు. ఆ తర్వాత ప్రతీ ఐదు రోజులకు ఒకసారి టెస్టులు నిర్వహించనున్నారు. నెగిటివ్ వచ్చిన వారిని గ్రౌండ్‌లోకి… పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించనున్నారు.

ప్రేక్షకులు లేకుండానే…

ఐపీఎల్ అంటేనే స్టేడియంలలో ప్రేక్షకుల సందడి. బౌండరీలు, సిక్సులు బాదినప్పుడు ప్రేక్షకుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లిపోయేది. ఆటగాళ్లకు కూడా ప్రేక్షకులను చూస్తే ఉత్సాహం వచ్చేది. కరోనా నేపథ్యంలో ఈ సారి ఖాళీ స్టేడియంలలోనే ఐపీఎల్ నిర్వహించనున్నారు. అంతేగాకుండా మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయాల్లో కూమా మార్పులు చోటుచేసుకున్నాయి. గత సీజన్‌లో ప్రతీ మ్యాచ్ రాత్రి 8.00 గంటలకు ప్రారంభం అయ్యేది. రెండు మ్యాచ్‌లు ఉంటే.. మొదటిది సాయంత్రం 4.00 గంటలకు, రెండో ది 8.00 గంటలకు నిర్వహించేవారు. కానీ ఈ సారి మ్యాచ్ సమయాన్ని అరగంట ముందుకు జరిపారు. మ్యాచ్‌లు ఆలస్యంగా ముగియడం వల్ల టీవీల్లో టీఆర్పీలు తగ్గిపోతున్నాయనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకే ప్రారంభం అవుతాయి.

భౌతిక దూరం..

ఐపీఎల్‌లో మొదటి బంతి పడిన దగ్గర నుంచి ఫైనల్ మ్యాచ్ చివరి బంతి వరకు ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది ఎలా నడుచుకోవాలో బీసీసీఐ నియమావళి రూపొందించింది. ఇందులో ముఖ్యమైనది భౌతికదూరం పాటించడం. ఒక బయోబబుల్‌లో ఉన్న వాళ్లు మరో బయోబబుల్ వారితో తప్పని సరిగా భౌతిక దూరం పాటించాలి. బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది, మ్యాచ్ అఫీషియల్స్, ఆటగాళ్లు ఒకరిని ఒకరు కలుసుకోవడానికి వీలు లేదు.

వీవో పోయి డ్రీమ్11 వచ్చె…

ఇండో-చైనా ఉద్రిక్తల నడుమ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వీవో తప్పుకుంది. దీంతో బీసీసీఐకి ఆర్థిక కష్టాలు తప్పవని అందరూ అనుకున్నారు. అయితే డ్రీమ్11 ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించడానికి ముందుకు వచ్చింది. అన్‌అకాడమీ, క్రెడ్ వంటి సంస్థలు అధికార భాగస్వామ్యులుగా చేరారు. ఇది బీసీసీఐకి ఊరటనిచ్చే అంశం. అంతేగాకుండా ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా అన్ని జట్లు తమ జెర్సీలను మార్చాయి. ఒక్కో సీజన్‌లో ఒక్కో స్పాన్సర్ ఉంటుండటంతో టీమ్ జెర్సీలు మారిపోతున్నాయి. రెండు రోజుల క్రితం రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కొత్త జెర్సీని వినూత్నంగా ఆవిష్కరించింది.

ఉమ్మిపై నిషేధం..

కరోనా నేపథ్యంలో ఐసీసీ తీసుకొని వచ్చిన తాత్కాలిక నిబంధనల్లో ఒకటైన ‘ఉమ్మి నిషేధం’ ఐపీఎల్‌లో అమలు చేయనున్నారు. బౌలర్లు సీమ్ రాబట్టడానికి ఇకపై ఉమ్మిని బంతిపై రాయడానికి వీళ్లేదు. ఒకసారి చేస్తే అంపైర్లు హెచ్చరిస్తారు. మరోసారి అదే తప్పు చేస్తే ఎదుటి జట్టుకు 5 పెనాల్టీ పరుగులు ఇస్తారు.

Read Also…

‘ధోనీ ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలడు’

Advertisement

Next Story