జీహెచ్ఎంసీలో ఉలుకుపలుకు లేని పార్టీలు!

by Anukaran |   ( Updated:2020-11-16 23:52:36.0  )
జీహెచ్ఎంసీలో ఉలుకుపలుకు లేని పార్టీలు!
X

దిశ, శేరిలింగంపల్లి: గ్రేటర్ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లోనూ రాజకీయ సందడి మొదలైంది. బల్దియా ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా మారారు. పర్యటనల పేరుతో ఓటర్లతో మమేకమయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టికెట్​కోసం అధికార పార్టీ టీఆర్ఎస్ లో తీవ్ర పోటీ నెలకొనగా, భారతీయ జనతాపార్టీ లో కూడా ఒక్కో డివిజన్ నుంచి ఐదుగురు వరకు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం సైతం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వామపక్ష, టీడీపీ, వైఎస్సార్‌సీపీల ఉనికే కానరావడం లేదు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ సారి ఆశాభంగం తప్పదనట్లు కనిపిస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని దాదాపు అన్ని డివిజన్లలోనూ టీఆర్​ఎస్​ కార్పొరేటర్‌గా పోటీచేసేందుకు చాలామంది ఆశావహులు ఎదురుచూస్తున్నా రు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు తెలిసిన వారి ద్వారా పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు.

ఏదో విధంగా కేటీఆర్ దృష్టిలో పడేందుకు నానాతంటాలు పడుతున్నారు. దీనికితోడు ఆయా డివిజన్లలో ఇప్పటి వరకు కార్పొరేటర్లుగా పనిచేసిన వారిలో కొంతమంది మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందన్న నమ్మకంతో కొందరు టీఆర్ఎస్ లోకల్ లీడర్స్ గట్టిగా నే ప్ర యత్నాలు చేస్తున్నారు. వార్డుల వారీగా మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. ఇ న్నాళ్లు స్తబ్ధుగా ఉన్న వారు కూడా ఈసారి అధికార పార్టీ టికెట్ రేసులో ముందు న్నారు. ప్రస్తుత కార్పొరేటర్లను కాదని ఇతరులకు టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉందని, అలా ఒకరిద్దరికి టీఆర్‌ఎస్ పెద్దల నుంచి హామీ లభించిందని వినికిడి.

బీజేపీ ఎర్ర తివాచీ..

ఇప్పటికే రాష్ట్రంలో స్పీడ్ పెంచిన భారతీయ జనతాపార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం పకడ్బందీ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అన్ని డివిజన్ల నుంచి ఆపార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపనుంది. కార్పొరేటర్లుగా పోటీలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒక్కో డివిజన్ నుంచి చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. పార్టీలో ఎలాంటి పోటీఉన్నా అధికార పార్టీ అభ్యర్థులను మట్టి కరిపించగల అభ్యర్థులనే రంగంలోకి దింపుతామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు.

కానరాని వామపక్షాలు..

ప్రతీ ఎన్నికల్లోనూ మేమున్నామని ముందుకు వచ్చే ఎర్ర జెండా పార్టీల ఉనికి ఈ మధ్య మచ్చుకైనా కానరావడం లేదు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒకటి రెండు చోట్ల కూడా వామపక్ష అభ్యర్థులు బరిలో నిలిచేలా లేరని ఆ పార్టీ మద్దతుదారులే నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక టీడీపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన పార్టీల్లో ఎలాంటి ఉలుకూపలుకు లేదు. రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే చాన్స్ ఉందని ఇండికేషన్స్ వస్తున్నా కొన్ని పార్టీలు మాత్రం ఇంకా కాలయాపన చేయడంపై ఆయా పార్టీల అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికార టీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రం తమ మధ్యనే గ్రేటర్ సమరం ఉంటుందన్నట్లుగా పోటాపోటీ కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు.

కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం..

ఓవైపు అధికార టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెడితే ఒకప్పుడు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా సుప్తావస్థలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల సన్నాహాల్లోనూ మీనమేషాలు లెక్కిస్తున్నారు ఆపార్టీ నేతలు. మొదటి నుంచి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. గతంలో టీడీపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండేది. కానీ, రాష్ట్ర ఆవతరణ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీడీపీతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ కూడా స్తబ్ధుగా ఉండి పోవడం ఆ పార్టీ శ్రేణులకు కూడా రుచించడం లేదనే చెప్పాలి. కానీ, త్వరలోనే పూర్తి కార్యాచరణతో జీహెచ్‎ఎంసీ ఎన్నికల రంగంలోకి దిగుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆపార్టీ లీడర్లు.

Advertisement

Next Story

Most Viewed