- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక ఫోన్‌కాల్‌తో సీన్ రివర్స్
దిశ ప్రతినిధి, వరంగల్: ఎదురు తన్నబోయి.. ఎల్లెలికల పడ్డట్లయింది వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నేతల పరిస్థితి. బీజేపీకి ఎక్కుబెట్టబోయిన అస్త్రం చివరికి వారికే గుచ్చుకుంది. నిరసన, నిరాహారదీక్ష అంటూ రాజకీయ వేడి పుట్టిద్దామనుకున్న గులాబీ నేతలకు బాస్ చేత తిట్లుతినాల్సి వచ్చింది. హంగు ఆర్భాటాలను ఆపాల్సిందిగా జిల్లా నేతలకు పెద్ద సార్ నుంచి సమాచారం అందింది. దాంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు జీ హుజూర్ అంటూ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసుకున్నారు.
గోదావరి జలాలను బీడు భూముల్లోకి మళ్లించకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఆటంకం కలిగిస్తోందని ఆరోపిస్తూ వరంగల్ రూరల్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్ మంగళవారం రూరల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షకు ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారం ఉదయం అక్కడ ఫ్లెక్సీల హడావిడి మొదలైంది. జిల్లా నుంచి పార్టీ శ్రేణులు కూడా తరలి వస్తున్నాయి. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యేలు కలెక్టరేట్‌కు చేరుకుంటారని భావిస్తున్న తరుణంలో నిరాహార దీక్ష వద్దంటూ ఫోన్ ద్వారా సమాచారం అందింది. నిమిషాల వ్యవధిలోనే ఫ్లెక్సీలు మాయమయ్యాయి. వేదిక కూడా మాయమైంది.
బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేయదల్చుకున్న నిరాహార దీక్ష ఒక్క ఫోన్‌కాల్‌తో ఆగిపోయింది. ఇంతకీ ఫోన్‌లో ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడిన అవతలి వ్యక్తి ఎవరో కాదు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. కానీ ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేలు బైటకు చెప్పుకోలేకపోయారు. అధిష్ఠానానికి తెలియకుండానే ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసినట్టున్నారు. బీజేపీమీద యుద్ధం చేద్దామని స్థానికి నేతలు ఉత్సాహం చూపుతూ ఉంటే అధిష్ఠానం నుంచి అందుకు విరుద్ధమైన సమాధానం రావడంతో షాక్ తిన్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. తెలియని భయమేదో వారిని వెంటాడుతోంది. టీఆర్ఎస్ సెల్ఫ్‌గోల్ చేసుకుందా అనే చర్చ వరంగల్‌లో మొదలైంది. మున్ముందు ఇతర జిల్లాల్లోకీ వ్యాపిస్తుందేమో.