- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ తో విద్యుత్ శాఖ సతమతం..
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణకు వెలుగులందించే విద్యుత్ శాఖ కొవిడ్ బారిన పడి సతమతమవుతోంది. రోజురోజుకూ ఉద్యోగులు కరోనా కాటుకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ సంస్థల్లో కలిపి ప్రతిరోజుకు కనీసం 200 నుంచి 250కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఉద్యోగుల నుంచి కుటుంబీకులకూ ఈ మహమ్మారి సోకుతోంది. దీంతో ఉద్యోగుల్లో, కుటుంబీకుల్లో ఆందోళన నెలకొంది. ఫీల్డ్ వర్క్ కు వెళ్లిన వారే అధిక శాతం వైరస్ బారిన పడ్డారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి అన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే అదంతా నామమాత్రమేనని పలువురు సిబ్బంది చెప్పడం గమనార్హం.
పెరుగుతున్న కేసులు
విద్యుత్ శాఖలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఎన్పీడీసీఎల్ లో ప్రతిరోజు సగటున 50 కేసులు నమోదవుతున్నాయి. ఎస్పీడీసీఎల్ లోనూ సగటుగా 40 కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా సింగరేణిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే వైరస్ కట్టడికి సంస్థ తీసుకుంటున్న చర్యలతో కేసులు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులే కాక వారి కుటుంబీకులు కూడా వైరస్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొద్దిమందికే వ్యాక్సిన్
విద్యుత్ ఉద్యోగుల కోసం వ్యాక్సినేషన్ ఏర్పాట్లు చేసినట్లు యాజమాన్యాలు చెబుతున్నా కొద్దిమందికి మాత్రమే టీకా అందినట్లు కార్మికులు చెబుతున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఏప్రిల్ 24, 26 తేదీల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినా అందులో ఉద్యోగులు, కుటుంబీకులకు కలిపి 300 మందికి మాత్రమే వ్యాక్సిన్ అందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సింగరేణిలో మే 7వ తేదీ నాటికి ఉద్యోగులు, కుటుంబీకులు, కాంట్రాక్ట్ కార్మికులను కలిపి 25,921 మందికి వ్యాక్సిన్ అందింది. కాగా మరో 50 వేల డోసుల కోసం ప్రభుత్వానికి, భారత్ బయోటెక్ సంస్థకు సింగరేణి సీఎండీ లేఖ రాసినట్లు అధికారులు వెల్లడించారు.
ఎక్కడెన్ని కేసులంటే?
కరోనా ఫస్ట్ వేవ్ నుంచి మొదలు సెకండ్ వేవ్ వరకు ఎన్పీడీసీఎల్ లో మొత్తం 1,183 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కోలుకున్న వారు 644, యాక్టివ్ కేసులు 539 ఉండగా 17 మంది మరణించారు. ఎస్పీడీసీఎల్ లో మొత్తం 1900 కేసులు నమోదయ్యాయి. ఇందులో 644 మంది కోలుకున్నారు. 700 యాక్టివ్ కేసులుండగా 40 మంది మరణించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. సెకండ్ వేవ్ లో సుమారు 1000 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సింగరేణిలో ఉద్యోగులు, కుటుంబీకులు, కాంట్రాక్టు కార్మికులందరినీ కలిపి మొత్తం కేసులు 11,587 నమోదయ్యాయి. ఇందులో 9,482 మంది వైరస్ ను జయించారు. 2013 యాక్టివ్ కేసులున్నాయి. 92 మంది మృత్యువాతపడ్డారు. కాగా పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు 5003 మంది ఉన్నారు. 4,298 మంది కోలుకున్నారు. 655 యాక్టివ్ కేసులుండగా 50 మంది ఉద్యోగులు కొవిడ్ తో మరణించారు. సింగరేణి ఉద్యోగుల కుటుంబీకులు 5,140 మంది కొవిడ్ బారినపడ్డారు. ఇందులో 4,118 మంది రికవరీ అవ్వగా 982 యాక్టివ్ కేసులున్నాయి. 40 మంది మరణించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల్లో 1,444 మందికి కరోనా సోకింది. 1,066 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 376 కాగా ఇద్దరు కార్మికులు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
సింగరేణిలో నాలుగు ప్రాంతాల్లో ఆక్సీజన్ ప్లాంట్లు
సింగరేణి సంస్థ కొవిడ్ బారిన పడిన ఉద్యోగుల సంక్షేమం కోసం నాలుగుచోట్ల ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రామగుండం, మందమర్రి, బెల్లంపల్లి, కొత్తగూడెం నాలుగు ప్రాంతాల్లో ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. కొద్దిరోజుల్లో ఈ పనులు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. ఒక్కో ప్లాంటులో రోజుకు 100 సిలిండర్ల ప్రాణవాయువును ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు చేశారు. ఇందుకు కావాల్సిన పరికరాలను విదేశాల నుంచి తీసుకొస్తున్నారు. ఈ నెలాఖరులోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. అలాగే సింగరేణి పరిధిలోని ఆస్పత్రుల్లో 700 బెడ్లుంటే కొవిడ్ కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అదనంగా మరో 700 బెడ్లు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటుచేసి జాగ్రత్తలు పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తికీ కూడా ఎలాంటి ఆటంకం లేదని అధికారులు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్ తో పోల్చుకుంటే ఈ ఏడాది ఏప్రిల్ లో బొగ్గు ఉత్పత్తిలో 70 శాతం పెరుగుదల ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు
కొవిడ్ బారిన పడిన ఉద్యోగులను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల కోసం కంట్రోల్ రూంల ఏర్పాటు నామమాత్రమే. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని యాజమాన్యాలు చెబుతున్నా చర్యలు శూన్యం . స్పాట్ బిల్లర్లు, ఫీల్డ్ వర్కర్లు అత్యధిక శాతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్ నియంత్రణకు సెక్షన్ ఆఫీసర్లు ఏర్పాటు చేసినా పైపై చర్యలు మాత్రమే. ఇప్పటికైనా యాజమాన్యాలు ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి- నాగరాజు, తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనివయన్(వీడబ్ల్యూ-2871) వ్యవస్థాపక అధ్యక్షుడు
ఎన్పీడీసీఎల్ లో
మొత్తం కేసులు = 1,183
కోలుకున్న వారు = 644
యాక్టివ్ కేసులు = 539
మొత్తం మరణాలు = 17
ఎస్పీడీసీఎల్ లో
మొత్తం కేసులు = 1900
కోలుకున్న వారు = 644
యాక్టివ్ కేసులు = 700
మొత్తం మరణాలు = 40
సింగరేణిలో
మొత్తం కేసులు = 11,587
కోలుకున్న వారు = 9,482
యాక్టివ్ కేసులు = 2013
మొత్తం మరణాలు = 92