అధికార పార్టీ లీడర్ ధనదాహం.. బసవతారక్ నగర్ లో చెదిరిన పేదల గూడు..

by Shyam |   ( Updated:2021-12-20 02:50:55.0  )
అధికార పార్టీ లీడర్ ధనదాహం.. బసవతారక్ నగర్ లో చెదిరిన పేదల గూడు..
X

దిశ, శేరిలింగంపల్లి: రాళ్లు రప్పలతో నిండిన స్థలంలో తలా ఇంత జాగా చూసుకుని గుడిసెలు వేసుకుని కొందరు గత 30 సంవత్సరాలకు పైగా అక్కడే నివాసం ఉంటున్నారు. నగరం ఇంత అభివృద్ధి చెందినా, కనీసం కరెంట్ సదుపాయం కూడా లేకుండా, బిక్కుబిక్కుమంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఒకప్పుడు ఎందుకు పనికిరావు అనుకున్న భూములు ఇప్పుడు కోట్ల రూపాయల ధరలు పలుకుతున్నాయి. పేదలు గుడిసెలు వేసుకున్న సర్కార్ స్థలాలకు భారీ డిమాండ్ పెరిగింది. దీనికి తోడు అధికార పార్టీకి చెందిన కొందరు ఛోటామోటా లీడర్లు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు పక్క ప్లాన్ వేస్తున్నారు. తామే సర్కారీ స్థలాల్లో గుడిసెలు వేసి ఒక్కోరి వద్ద లక్షల రూపాయలు వసూలు చేశారు. అంతేకాదు నెలకు ఇంత ఇవ్వాలని షరతులు పెట్టారు. విషయం తెలిసిన శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఎవరికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు.

బడుగు జీవుల బసవతారక నగర్..

గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి సర్వే నెంబర్ 37 లో సుమారు 6 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. గత 30 ఏళ్ల క్రితం బ్రతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వడ్డెరలు ఆ సమీపంలో ఉన్న క్రషర్స్ లో పనిచేస్తూ అక్కడే గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అలా అక్కడ నివాసం ఏర్పర్చుకున్న వారికి నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన విజయరామరావు బసవతారక నగర్ గా నామకరణం చేసి అక్కడక్కడ ఉన్న గూడు లేని వారందరినీ ఒక్కచోటికి చేర్చారు. బసవతారక నగర్ లో ఉన్న 90శాతం మందికి ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేబర్ కార్డు ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని గుర్తింపు కార్డులు వారి వద్ద ఉన్నా ఇప్పటికి ఏమీలేని అనాథలుగా మిగిలిపోయారు. బీజేపీ గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బసవతారక నగర్ ప్రజల పక్షాన నిలుస్తూ ఆపార్టీ ఆధ్వర్యంలో అనునిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఇటీవల శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బసవతారక నగర్ కాలనీ ప్రజల సమస్యను మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

30 ఏళ్లకు పైగా గోపన్ పల్లి సర్వే నెంబర్ 37లో ఉన్నా ఏ ఒక్క అధికారి, ఏ ప్రజా ప్రతినిధి ఏమీ అనలేదు. కానీ ఉన్నట్టుండి రెవెన్యూ అధికారులు ఇళ్లను కూల్చడం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ స్థలం కాబట్టి స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నా.. అసలు విషయం అది కాదని, ఈ ఘటనకు అధికార పార్టీకి చెందిన లోకల్ లీడర్ వసూళ్ల పర్వమే కారణమని కొందరు భూ బాధితులు చెబుతున్నారు. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ లీడర్, బసవతారక నగర్ లో నివసించే మరో వ్యక్తి మధ్య గత కొంతకాలంగా ఆధిపత్య పోరునడుస్తుందని, అధికార పార్టీకి చెందిన నాయకుడు ఇటీవల 12 గుడిసెలు వేసి కొంతమందిని తీసుకువచ్చి పెట్టాడని, వారి వద్ద నుండి నెలకు రూ. 1200 ఇచ్చేలా మాట్లాడుకున్నట్లు ఇక్కడ ఏళ్ల తరబడి ఉన్న కొందరు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల ఈ స్థలం మీకే ఇచ్చేలా చూస్తా అంటూ కొందరి వద్ద రూ.3లక్షల చొప్పున వసూళ్లకు పాల్పడినట్లు చెబుతున్నారు.

ఆ నాయకుడి లీలలు ఇన్నీఅన్నీ కావు..

బసవతారక నగర్ లో వసూళ్లకు పాల్పడ్డ సదరు లీడరుకు ఈ తరహా మోసాలు కొత్తేమి కాదని, గతంలోనూ ఇక్కడ అనేక మోసాలకు పాల్పడ్డట్లు బాధితులు చెబుతున్నారు. విస్తారమైన వర్షాలు కురిసి వరదలు వచ్చిన సమయంలో ఇళ్లలోకి నీరు చేరి నిత్యవసర వస్తువులు నీట మునిగి నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఇందులోనూ సదరు లీడర్ తన చేతివాటాన్ని ప్రదర్శించారట. బసవతారక నగర్ లో రూ.9వేలు ఇచ్చి, అందులో ఈ లీడర్ ఒక్కోరి దగ్గర రూ. వెయ్యి తీసుకున్నారట. అంతేకాదు బసవతారక నగర్ లో లేనివారికి ఉన్నట్లు చూపి ప్రభుత్వం ఇచ్చిన రూ.10వేలల్లో రూ.5 వేలు వారికి ఇచ్చి, రూ.5 వేలు ఆ లీడర్ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా అధికార పార్టీ లీడర్ చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు తలనొప్పులుగా మారిన క్రమంలోనే రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపించారని సమాచారం. రోడ్డున పడ్డ భూ బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed