దమ్మిడి లేకున్నా దావత్ గ్రాండ్.!

by Daayi Srishailam |
దమ్మిడి లేకున్నా దావత్ గ్రాండ్.!
X

ఫంక్షన్ గ్రాండ్‌గా కావాలె.

చేతిలో పైసలుండవు.

ఐనా తగ్గొద్దు అనుకుంటాం.

ఎందుకంటే..

ఇక్కడ "పతారె" సూపెట్టాలె.

"అర్రే.. ఫలానోడు ఫంక్షన్ ఏమన్నజేశిండారా" అని గొప్పగ చెప్పుకోవాలె.

"పోతో పోనీ.. పది రూపాయలు అప్పయినా సరే" అనిపిస్తది.

పోకడ పెద్దది పోతం.

"గ్రాండు.. బ్రాండు" అని ఖర్చును లెక్కే చెయ్యం.

అంతా అయిపోయినంక "అయ్యో ఇంతయిందా" అని ఆలుమగల కయ్యం.!!

- దాయి శ్రీశైలం

ఫంక్షనంటే ఉత్తగైతదా.? సుట్టాలుండాలె. పక్కాలుండాలె. రంగులుండాలె. హంగులుండాలె. అదీ ఇదీ అర్సుకోనీకె మంది ఉండాలె. ఆ మందిని అర్సుకోనీకె మందు ఉండాలె. ఇవన్నీ కావాల్నంటే చేతిలో పైసా ఉండాలె. ఎవరైనా "ఇవన్నీ ఎందుకయ్యా" అని అంటే.. "ఏం.. ఎట్లగన్పిస్తున్నం.? మీతాన్నే ఉన్నయా పైసలూ.? ఒక్కగానొక్క బిడ్డె.. అప్పుజేశైనా సరే దావత్ గొప్పగజేస్తం" అని చాటంత యవ్వారాన్ని చాపంత చేసి కూసుకుంటరు.

బారసాల నుంచి షురూ..

దునియాల ఎవ్వనికి లేని దావతులు.. ఫంక్షన్లు మనకే ఉంటయి. ఏమన్నంటే "ఇది మన కల్చర్‌రా బయ్" అని అంటారు. ఇక్కడ కల్చర్‌ని తప్పుబట్టడం లేదు. కల్చర్ పేరు చెప్పి అడ్డమైన ఖర్చులు పెంచుతున్నారని చెప్తున్నాం. తుమ్మినా దావతే.. దగ్గినా దావతే. వారం దినం ఏది లేకుండా ఏదో ఒక సాకు చెప్పి వారం రోజులు దావత్ చేసుకుందామన్నా మనొళ్లు "సై" అంటరు. పుట్టంగ "పురుడు"తో మొదలైతుంది ఈ కథ. "లేక లేక కొడుకు పుట్టిండు.. మా ఇంటికి మా లచ్చిమొచ్చింది" అని డాబు దర్పం ప్రదర్శించి.. ఐదారు యాటలు కోసి బారసాల దావతను బరాబ్బర్ చేసి తగ్గేదేలే అని చూపెట్టుకుంటారు.

ధోతీ ఫంక్షన్ జోష్

"జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమే". పైసలున్నోడు ఏ కార్యం చేసినా ఆడంబరంగానే ఉంటుంది. "బారసాలకే బంగారు తొట్టెల్లో ఊపినోడు" ధోతీ ఫంక్షన్‌కు ఉత్తగుంటడా.? షూటింగ్‌లు.. సిట్టింగ్‌లు అని "కాన్‌దాన్" కథేంటో చూపిస్తాడు. వాడంటే డబ్బున్నోడు ఏదంటే అది చేస్తడు. ఎంతంటే అంత పెడతడు. కానీ.. ఈ కల్చర్‌లో పడి కామన్‌మ్యాన్ కూడా కొట్టుమిట్టాడుతుండు. బామ్మర్ది బాగా చేసిండు.. సడ్డకుడు సరాసరి చేసిండు అని పైసా ఆదాయం లేకపోయినా ఫంక్షన్ కోసం లక్షలు ఖర్చు చేస్తుండు. "పిల్లలకు ధోతీ కట్టించలేని గతిలేనోన్నా" అనే ప్రతిష్టకు పోయి తాహతకు మించి ఖర్చు చేస్తుండు.

ఎంగేజ్‌మెంట్ ‌టెక్కు

పెళ్లికంటే ఎంగేజ్‌మెంట్‌ హంగామే ఎక్కువంటోంది. ఒకప్పుడు ఎంగేజ్‌మెంట్ పిల్ల తరపున నలుగురు.. పిలగాని తరపున నలుగురు కూర్చొని.. మంచి చెడ్డ మాట్లాడుకొని పంతులుతో లగ్గం పత్రిక రాపిచ్చుకుంటుండె. పూలు.. పండ్లు పెడుతుండె. కానీ ఇప్పుడు పూలుపండ్లు పేరుకే. బయట పంతులు పత్రిక రాస్తుంటే.. లోపల ఎంగేజ్‌మెంట్‌కొచ్చినొళ్లు సీసల సప్పుడు చేస్తుంటరు. దీంట్లో ఇంకా ఎవరి లెక్కలు వాళ్లవి.. ఎవరి దోస్తులు వాళ్లకు. ఇవే సామాన్యుడి సడుగులు ఇరిగేలా చేస్తున్నాయి. ఉన్నోడు గొప్పగా ఫంక్షన్ చేసుకుంటే.. ఆ ఉచ్చులోపడి సామాన్యుడు కూడా సాంతం ఊడ్చేదాక ఖర్చు పెడుతుండు.

అమ్మో.. పెళ్లా.?

పెళ్లంటే ఇప్పుడు పెద్ద కథ. అంటారు కదా.. ఆకాశమంత పందిరి.. భూదేవంత పీటలూ అనీ. అంత ఆడంబరం ఉంటుంది. ఖర్చుదైతే లెక్కేలేదు. ఈ కాలం పెళ్లిళ్ల ఖర్చు లక్షలు.. కోట్ల ముచ్చట్నే. ఉన్నొళ్లకైతే ఖర్చుతో లెక్కలేదు. కానీ.. లేనోడి పరిస్థితి.? ఇంకేముందీ అప్పుల కుప్పే. లేకపోతే మనోడి ఈగో ఒప్పుకోదు కదా.? ఊరందర్నీ పిలవాలి.. చుట్టాలను అర్సుకోవాలి. వచ్చినవాళ్లకు ఏ లోటూ లేకుండా చూసుకోవాలి. ఒప్పించాలి.. మెప్పించాలి. ఆ పనీ.. ఈ పనీ తడిచి మోపెడవుతుంది. "ఆడపిల్ల పెళ్లంటే ఆర్నెళ్ల కరువు" అంటారు. అంటే అమ్మాయి పెళ్లికి ఇల్లు.. గల్లా ఖాళీ అయ్యేంత ఖర్చులుంటాయన్నమాట.

కట్నం పెరుగుతోంది

"కట్నం తీసుకున్నవాడు గాడిద" అని సూక్తులు బానే చెప్తాంగానీ లోపల మాత్రం "ఇప్పుడు నా కొడుక్కి పెళ్లి చేస్తే ఎంత కట్నమొస్తుండొచ్చు" అనే ఆశ ఉంటుంది. "రాన్రాను వధువు కట్నాలిచ్చేది అంతరించి.. వరుడే కట్నమిచ్చే ట్రెండ్ వస్తుంది" అని ఇరవై సంవత్సరాల నుంచి వింటున్నాం. కానీ.. అది అయ్యేది లేదు పొయ్యేది లేదు. పైగా "నా బిడ్డ బాగుండాలి" అనే స్వార్థంతో అడగకున్నా భారీ కట్నాలిచ్చే ధోరణి పెరుగుతోంది. "నలుగురిలో పరువు పోవద్దు.. బిడ్డె పెళ్లి గ్రాండ్‌గా చేసిండు" అని పదిమందీ చెప్పుకోవాలని "గ్రాండ్" అనే ప్రెస్టేజీలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఫొటోషూట్ ట్రెండ్

కొత్తదనం కోరుకోవడంలో తప్పులేదు. ఐతే.. అది ఆమోదయోగ్యంగా.. ఆదర్శంగా ఉంటే బాగుంటుంది. "పెళ్లి ఒక మధురమైన ఘట్టం" కాబట్టి ఫొటోలు తీసుకొని ఆల్బమ్స్ భద్రపరచుకునే సంస్కృతి ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడు పెళ్లికన్నా ఫొటోషూట్లే ఇంపార్టెంట్. ప్రీవెడ్డింగ్ షూట్.. పోస్ట్ వెడ్డింగ్ షూట్.. ప్రీ డెలవరీ షూట్.. పోస్ట్ డెలివరీ షూట్.. సీమంతం షూట్ ఇలా కొత్త కొత్త ట్రెండ్స్ వచ్చి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఈ ట్రెండ్ సునామీలో పాపం సామాన్యుడు సచ్చి బతుకుతున్నాడు. ఏమన్నంటే.. "తప్పదుగా" అని చెప్పడం తప్పించుకుంటున్నాడు కానీ ఖర్చుకైతే వెనకాడటం లేదు.

హల్దీ ఫంక్షన్ టెన్షన్

ఒకప్పుడు పెళ్లిళ్లో నలుగు పెట్టేవాళ్లు. ఇప్పడదే రూపాంతరం చెంది "హల్దీ ఫంక్షన్"గా హల్ చల్ చేస్తోంది. దానికోసం అందమైన సెట్టింగులేస్తున్నారు. హల్దీతో పాటు ఇంకా బీర్లు గీర్లు చల్లుకుంటున్నారు. ఇక ఇవన్నీ చూసి మురిసిపోవడానికి మళ్లీ "ఫొటోషూట్". పెళ్లంటే ఒకప్పుడు ఇంటిల్లిపాది.. చుట్టాలకు.. ఇరుగుపొరుగుకు గాజులు పెట్టించి.. మైదాకు పెట్టేవాళ్లు. ఇప్పుడు దాన్నికూడా ఒక ట్రెండ్ చేసిపడేశారు. దానికి "మెహందీ ఫంక్షన్" అని పేరు పెట్టారు. ఇన్ని ఇకమతులు.. ఇన్ని కథలు ఉంటే అంతంతమాత్రం ఆదాయం ఉన్నోడు ఏం కావాలి.? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి.?

రిటర్న్ గిఫ్ట్ పాయె

ఫంక్షన్‌కి వచ్చినవాళ్లు ఏదో ఉత్త చేతుల్తో వెళ్లక ఏదో తోచినంత "సదివింపుల కింద" ఇచ్చిపోతుంటారు. ఉన్నోడు ఇవన్నీ పెద్దగా పట్టించుకోడు. కానీ లేనోడికైతే కొంత ఉపయోగపడతాయి కదా.? లూటీపోయిన చేనులో కొంత చిగురొచ్చినంత ఆశ ఉంటుంది సదివింపులతో. కానీ.. నోటికాడికొచ్చిన దాన్నీ లాగేసుకుంది కొత్త ట్రెండు "రిటర్న్ గిఫ్ట్ కల్చర్". అంటే ఫంక్షన్‌కొచ్చినొళ్లు ఉత్త చేతుల్తో వెళ్లకుండా చేతిలో ఏదో ఒక గిఫ్ట్ పెట్టి పంపిస్తారన్నమాట. ఏదో ఒక గిఫ్ట్ అంటే అంగట్లో దొరికే "అరేక్‌మాల్" సామాను అనుకునేరూ. దానికీ భారీగానే సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఉన్నది పాయె.. వచ్చేది పాయె. ఏం ఫాయిదా.?

మెయింటెనెన్స్ కష్టాలు

ఖర్చుది ఒకెత్తయితే.. మెయింటెనెన్స్‌ది ఒకెత్తు. అసలీ "ఫంక్షన్ హాల్ కల్చర్" పెరిగిందే మెయింటెనెన్స్ బాధలు తప్పించుకోవడానికి. "ఇంటికాడ కార్యం చేస్తే వాళ్లతోని వీళ్లతోని పరేషానుంటది" అని ఫంక్షన్ హాల్‌ను ఆప్షన్‌గా ఎంచుకుంటారు. అదొక్కటి చూసుకుంటాంగానీ.. పంక్షన్ హాల్లో చేస్తే తక్కువవుతుందా.? వంట.. క్యాటరింగ్.. స్టేజీ.. డెకరేషన్.. డీజే.. బ్యాండ్ మేళం.. ఇలా అన్నీ రౌండప్ చేసి రౌండ్ ఫిగర్ అవుతుంది. ఇంటికాడ చేస్తే లక్షతో పోయేది ఫంక్షన్ హాల్లో రెండు లక్షలు అవుతుంది. ఇవి చాలవన్నట్టు ఈ మధ్య స్పెషల్ ఈవెంట్స్ కింద లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

సుక్క.. ముక్క పక్కా

ఫంక్షన్‌కి "వచ్చినొళ్లకు ఏ లోటూ లేకుండా చూడాలి" అనే ఆలోచనతో "ముక్క"తో పాటు "సుక్క" ఏర్పాటు కూడా చేస్తున్నారు. చుట్టాలు పెట్టిండ్రని.. పక్కింటొళ్లు పెట్టిండ్రని "ముక్క సుక్క" తగ్గకుండా పెట్టి తాహతకు మించి ఖర్చు చేస్తున్నారు. పరిమిత ఆదాయం ఉన్నొళ్లకు ఇది తలకుమించిన భారమైతుంది. కానీ.. వచ్చినవాళ్లు సరిగా తింటరా.? ఒక్కరూ సక్రమంగా తినరు. అదింతా ఇదింతా పెట్టుకొని.. దేనినీ పూర్తిగా తినకుండా అంతా పడేస్తారు. 50శాతం ఆహారం వృథా అవుతోంది. పాపం.. ఎంత కష్టపడితే వచ్చాయవి.? ఎన్ని అప్పులుచేస్తే నిండాయి ఆ బగోన్లు.. డేగులు.?

కలిపి చేయండి

👉 హంగు ఆర్భాటాలకు పోయి ఉన్నదంతా ఖర్చు చేసి అప్పుల పాలు కాకుండా ఫంక్షన్ ప్లాన్ చేయండి.

👉 పెళ్లి అదే ఫంక్షన్ హాల్.. బారసాలకు అదే ఫంక్షన్ హాలా.?

👉 చిన్న చిన్న ఫంక్షన్లకు బాంకెట్ హాల్స్.. రిసార్టులు కాకుండా కమ్యునిటీ హాల్స్.. ఓపెన్ గ్రౌండ్స్‌ ఎంచుకోండి.

👉 పెళ్లిలాంటి వాటికి ఒకరోజు మ్యారేజ్.. ఇంకోరోజు రిసెప్షన్ పెట్టుకోకుండా అన్నీ ఒకేరోజు అయ్యేలా ప్లాన్ వేసుకోండి.

👉 పెళ్లి.. తదనంతరం రిసెప్షన్ పెట్టుకుంటే చుట్టాలు ఉంటారు. అతిథులూ హాజరవుతారు కదా.

👉 దావత్ దాంట్లోనే అయిపోతుంది.

👉 ఈ ఫార్ములా ఫాలో అయితే రూ.5 లక్షలు అయ్యేది రూ.3 లక్షలతో క్లోజ్ చేయొచ్చు.

సంఖ్య తగ్గిస్తే

👉 చేసే ప్రతీ ఫంక్షన్‌కూ 500-1000 మంది అతిథులు అవసరం లేదు.

👉 సన్నిహిత బంధువులు.. స్నేహితులను పిలిస్తే ఫంక్షన్ సజావుగా జరుగుతుంది.

👉 ఫుడ్డు.. సీటింగ్.. ఇతర అన్ని ఖర్చులు తగ్గుతాయి కదా.?

👉 ఎవరో ఏమో అనుకుంటారని ప్రతిష్టకు పోయి ఊరంతా పిలిచి దావత్ చేస్తే ఉన్నదంతా ఊడ్సుకపోతుంది.

👉 మొహమాటం ఎందుకు.. ఎవరన్నా అడిగితే ఫ్యామిలీ వరకే చేసుకున్నామని చెప్పండి.

👉 ఫంక్షన్లో సగం వేస్టే చేస్తారు.. కాబట్టి ఖరీదైన కాంటినెంటల్.. లగ్జరీ వంటకాలకు బదులు లోకల్ సింపుల్ మెనూ పెట్టండి.

👉 బిర్యానీ.. కూరలు.. చపాతీలకంటే మించిన ఆహారం ఏముంటది చెప్పండి.?

లోకల్ ఫొటోగ్రఫీ

👉 ఫొటోగ్రఫీ.. డెకరేషన్.. మేకప్ వంటివి ఇప్పుడు స్థానికంగా కూడా నైపుణ్యంగా చేస్తున్నారు.

👉 వాటికోసం నగరంలోని పెద్ద బ్రాండ్లు.. ఖరీదైన సర్వీసులను వద్దు.

👉 స్థానికంగా లభ్యమయ్యే సేవలను వినియోగిస్తే మంచిది.

👉 డెకరేషన్ లాంటి పనులకు స్నేహితులనో.. చుట్టాలనో సాయం తీసుకుంటే బెటర్.

👉 ఇలాంటి వాటికి పెద్ద పెద్ద ఎక్స్‌పర్ట్‌లు.. ప్లానర్స్ అవసరం లేదు.

చేతినిండా పని: మురళి, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్

ఒకప్పుడు పెళ్లిళ్లకే ఫొటోలు తీయించుకునేవారు. ఇప్పుడు "చెవులు కుట్టే" కార్యక్రమానికి కూడా ఫొటోషూట్ చేయిస్తున్నారు. ప్లాన్స్‌ను బట్టి రేట్స్ ఉంటాయి. ఒక చిన్న బర్త్ డే పార్టీకి ఎంతలేదన్నా రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు చార్జ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్స్ వల్ల మాకైతే చేతినిండా పని దొరుకుతుంది.

ఏదో ఒకటి ఉంటది: వేణుగోపాల్ రెడ్డి, కన్వెన్షన్ హాల్ ఓనర్

పెళ్లిళ్ల సీజన్ అప్పుడే ఫంక్షన్ హాల్స్‌కు.. కన్వన్షన్ హాల్స్‌కు గిరాకీ ఉండే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతీ సీజన్ ఫంక్షన్ సీజనే. బర్త్ డేలు.. ధోతీ ఫంక్షన్స్.. హల్దీ.. మెహెందీ ఈవెంట్స్‌కు కూడా హాల్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక ఫంక్షన్ అయితే కచ్చితంగా ఉంటుంది.

Next Story

Most Viewed