సింగరేణి పరీక్ష పేపర్ లీక్ చేస్తానంటూ లక్షలు కాజేసిన మోసగాడు అరెస్ట్

by Sumithra |
accused-is-Harinath-Rushi
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులనుంచి రూ. లక్షలు వసూలు చేసిన మోసగాడిపై కేసు నమోదైంది. నేడు జరిగే ఫిట్టర్ ఎగ్జామ్‌కు సంబంధించి ఏకంగా క్వశ్చన్ పేపరే లీక్ చేస్తానంటూ ఓ వ్యక్తి మాయమాటలు చెప్తున్నట్లు సింగరేణి విజిలెన్స్ విభాగానికి సమాచారం అందడంతో నిందితుడిపై కేసు నమోదైంది. కేపీయూజీ మణుగూరు ఏరియాలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పనిచేస్తున్న సీహెచ్ హరినాథ్ రుషి నిరుద్యోగులను వలలో వేసుకునేందుకు సింగరేణిలో జరిగే ఎగ్జామ్‌ను వాడుకున్నాడు. ఐటీఐ ఫిట్టర్ ట్రైనీ (ఎక్స్టెర్నల్) ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం కొత్తగూడెంలో అయిదు పరీక్ష కేంద్రాల్లో 2681 మందికి రాత పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

అయితే, హరినాథ్ తనకు సింగరేణి ఉన్నతాధికారులు తెలుసని, పేపర్ లీక్ చేయించి పాస్ చేయించే బాధ్యత తనదని అభ్యర్థులకు మాయమాటలు చెప్పి రూ. లక్షలు వసూలు చేశాడని విజిలెన్స్ విభాగానికి సమాచారం అందింది. మణుగూరు పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేశారు. పరీక్ష కేంద్రాల్లో అత్యాధునికంగా మెటల్ డిటెక్టర్లను సైతం ఉపయోగిస్తున్నామని, రాత పరీక్ష పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని సింగరేణి అధికారులు చెపుతున్నా.. కొందరు అక్రమార్కులు పేపర్ లీక్ చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయడం సింగరేణి వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే అభ్యర్థులు ఎవరూ మోసపూరిత మాటలను నమ్మవద్దని, అలా ఎవరైనా చెబితే తమ దృష్టికి తీసుకురావాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed