రాజకీయం మౌనం.. అదే అభివృద్ధికి శాపం

by Sridhar Babu |   ( Updated:2021-12-03 23:30:39.0  )
రాజకీయం మౌనం.. అదే అభివృద్ధికి శాపం
X

దిశ, భద్రాచలం (చర్ల): రాజకీయ నాయకుల మౌనం మండల అభివృద్ధి శాపంగా మారిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ప్రజా సమస్యలను పట్టించుకోని నాయకులు అభివృద్ధి గురించి కూడా ఆలోచించడం లేదనే విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల (సంపాదన) కోసం ఒక్కటయ్యే నాయకులు మండల అభివృద్ధి కోసం కలవలేక పోతున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకుల వైఫల్యం వల్లనే చర్లలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీ భూపాలపల్లి జిల్లాకు తరలిపోయిందనేది కాదనలేని నిజం. అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ నాళం నర్సింహారావు చర్లకు వచ్చి విజయకాలనీ – దండుపేట కాలనీ నడుమ గుట్టలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీ‌కి అనుకూలమైన స్థలమని చెప్పారు. తర్వాత ఏమైందో కానీ యూనివర్సిటీ జాడ కనిపించలేదు. కనీసం ఈ విషయాన్ని పట్టించుకున్న నాయకులు లేరు. స్థలం చూపించకపోతే ఇప్పుడు ఏకలవ్య పాఠశాల కూడా అలాగే తరలిపోయే ప్రమాదం పొంచి ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చర్ల కేంద్రంగా మంజూరైన ఏకలవ్య పాఠశాల తరగతులు ప్రస్తుతం భద్రాచలంలో జరుగుతున్నాయి. చర్లలో ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణానికి స్థలం చూపించడంలో రెవెన్యూ అధికారులు చేతులెత్తేసిన ట్లు గా కనిపిస్తోంది. ఎక్కడ స్థలం చూసినా ఏదో ఒక రకమైన అడ్డంకి వస్తోంది. తొలుత ఏకలవ్య పాఠశాల కోసం వైకుంఠధామం పక్కన కేటాయించిన స్థలానికి విజయ కాలనీ గిరిజన రైతులు పట్టాలు చేతపట్టుకొని కోర్టు మెట్లెక్కి, అది మాకు పట్టాలిచ్చిన భూమి అంటూ అడ్డుపడటంతో ఆ ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. ఇక మరో ప్రయత్నంగా స్థానిక రెవెన్యూ అధికారులు ప్రభుత్వ జూనియర్ కాలేజీ పక్కన ఎంపిక చేసిన స్థలానికి కాలేజీ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు అడ్డు తగిలారు.‌ చర్లలో మరోచోట ఎక్కడ ఏకలవ్య కి సరిపోయేంత ప్రభుత్వ స్థలం కనిపించడం లేదు. అన్నిచోట్ల ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణ పనులు చకచకా జరుగుతుండగా, చర్లలో స్థలం చూపించని కారణంగా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. స్థలం చూపించమని ఏకలవ్య అధికారులు పదేపదే చర్ల మండల తహశీల్దార్‌ వెంటపడి మొరబెడుతున్నారు. ఏకలవ్య కి స్థలం కేటాయింపు రెవెన్యూ అధికారులకు పెద్ద తలనొప్పిగా తయారైంది.

ముందుచూపు లేకనే ఇబ్బందులు

చర్ల మండల రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులు ముందుచూపు కొరవడిందని అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. చర్ల విజయకాలనీ దగ్గర ప్రభుత్వ భూమిని (గుట్టలను) ఎఫార్‌స్టేషన్ కోసం అటవీశాఖకి అప్పగిస్తుంటే భవిష్యత్తు అవసరాలు గుర్తించి ఏ ఒక్క రాజకీయ నాయకుడు ముందుకు వచ్చి అడ్డుపడలేదు. అటవీశాఖకి ఇవ్వగా మిగిలిన భూమిని పల్లె ప్రకృతి వనం కోసం చర్ల గ్రామపంచాయతీకి హడావుడిగా కేటాయించడం వెనక ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇది చెట్టుపుట్టలు ఉండే ఏజెన్సీ ప్రాంతమే కనుక పల్లె ప్రకృతి వనం అంత అవసరం కాదని స్థానిక ప్రజల అభిప్రాయం. ఇప్పటికే చర్లలో చాలాచోట్ల పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి.

జిల్లా కలెక్టర్ ఈ విషయమై చొరవ చూపి పల్లె ప్రకృతి వనం కోసం ఇచ్చిన భూమిని ఏకలవ్య కి కేటాయిస్తే భూ సమస్య సునాయాసంగా పరిష్కారమై ఏజెన్సీ వాసులకు ఏకలవ్య చదువులు దగ్గర అవుతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. భవిష్యత్తు ఇచ్చే పిల్లల చదువుల కంటె పల్లెప్రకృతి వనం అంత అవసరం కాదనే మాట చర్లలో ప్రతి నోట వినిపిస్తోంది. రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు సామాజిక స్పృహ లేకనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానిక ప్రజానీకం ఆరోపిస్తోంది. రాజకీయ పార్టీలలో, కుల సంఘాల్లో రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పదవులు పొందిన నాయకులు ఏ ఒక్కరు కూడా చర్ల మండల అభివృద్ధి పైన, ప్రజాసమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టి పనిచేయడంలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పదవులతో పరిచయాలు పెంచుకొని తమ పరపతి, పలుకుబడి ద్వారా సంపాదన, రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం తప్ప ప్రజల గురించి గానీ, ఈ ప్రాంత అభివృద్ధి గురించి గానీ శ్రద్ధ చూపిన దాఖలాలు లేవని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

అన్నింటా నాయకుల వైఫల్యమే

చర్ల మండల నాయకులు అన్నింటా వైఫల్యం చెందుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నేతల వ్యక్తిగత స్వార్థపు ఆలోచనలతో ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి. మా నాయకులు కుబేరులు అని చెప్పుకోవడం తప్ప, జనం కోసం సాధించిన విజయాలు ఏమీ లేవనేది ప్రజాభిప్రాయం. చర్లలో ఫైర్‌స్టేషన్ మంజూరు చేపిస్తామంటూ రైతుల దగ్గర చందాలు వసూలుచేసిన డబ్బు కాల్ డిపాజిట్‌గా బ్యాంకులో డిపాజిట్ చేసి చేతులు దులుపుకున్నారు. మూడు దశాబ్దాలుదాటినా ఫైర్‌స్టేషన్ జాడలేదు. ఇక 20 గ్రామాల రైతుల పొలాలకు సాగునీరు అందించే వద్దిపేట నాయకులు చెప్పేది వట్టి మాట గానే మిగిలిపోయింది. పంటలకు నోచుకోని పొలాలను చూస్తూ బాధపడుతున్న రైతులు చివరకు నాయకులను తిట్టుకుంటున్నారు. దీనిని ఎన్నికల అస్త్రంగా నాయకులు ఉపయోగించుకోవడం పరిపాటిగా మారింది.

ఇక చర్ల రైతులకు సంబంధించిన ఏడీఏ కార్యాలయం, తాలిపేరు డివిజన్ ఆఫీస్ లో భద్రాచలం షిఫ్ట్ చేస్తున్నా చర్ల నాయకులు ప్రేక్షక పాత్ర పోషించారు తప్ప నోరు తెరిచి ఇదేంటి అని అడగలేదు. ఇక మరో ప్రధాన సమస్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు బాగా చదువుకుంటే నాయకుల వైఫల్యాల గురించి నిలదీస్తారనే భయమో, ఏమోగానీ చదువుకి సంబంధించిన అంశాలపై ఎవరూ శ్రద్ధ చూపడం లేదు. సర్కార్ చదువు అందుబాటులోలేక ఇంటర్మీడియట్‌తోనే చాలామంది మానేస్తున్నా నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఏమాత్రం పట్టినట్లుగాలేదు. డిగ్రీ కాలేజీ మాదిరిగానే ఇప్పుడు ఏకలవ్య భూ సమస్యలను పట్టించుకోవడం లేదు. రైతులు, విద్యార్థుల సమస్యల పట్ల చర్ల నాయకుల చిత్తశుద్ధికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాజకీయ నాయకులు పట్టించుకోని ఇలాంటి అనేక ప్రజాసమస్యలు ప్రతి ఊరిలో నెలకొన్నాయి.

తప్పెవరిది..? నాయకులదా ? ప్రజలదా ?

సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంలో తప్పు నాయకులదా లేక ప్రజలదా అనేది ప్రధాన చర్చనీయాంశమైంది. సమాజం పట్ల కనీస అవగాహన లేని వాళ్ళను ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించి వదిలేయడం నాయకులు చేస్తున్న ప్రధాన తప్పు. పనిచేసే సామర్థ్యం ఉన్న వాళ్ళను పక్కనపెట్టి అసమర్థులు, అనుచరులు, పైరవీకారులు పార్టీ పదవులు ఇచ్చి చేతులు దులుపుకోవడం రెండవ తప్పు. ఇక పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా ప్రవర్తించడం నాయకులు చేస్తున్న ముచ్చటైన మూడవ తప్పు. సమస్యలు సాధిస్తారనే నమ్మకం కోల్పోయి బాధిత ప్రజలు ఆందోళనలు, ఉద్యమాలు, ప్రజా పోరాటాలకు కలిసిరావడంలేదని ప్రజలపై నిందలు వేయడం నాయకులు చేస్తున్న నాలుగో తప్పు.

ఇక తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారి ప్రజా శ్రేయస్సు, ప్రాంతాల అభివృద్ధి కోసమే అని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేయడం నాయకులు చేస్తున్న ఐదవ తప్పు. అయితే ప్రజలు కూడా కొన్ని తప్పులు చేస్తున్నారనడం అతిశయోక్తి కాదు. నమ్మించే నాయకులను పదేపదే నమ్మడం, వారికి జై కొట్టి వాళ్ళ కోసం గుడ్డలు చింపుకోవడం, గొంతెత్తి అరిచి గొడవలు పడటం, సమస్యలు పట్టించుకోని రాజకీయ నాయకులను నిలదీయకపోవడం ప్రజలు చేస్తున్న ప్రధాన తప్పులు గా చెప్పవచ్చు. అందుకే ఏళ్ళు గడిచినా ప్రజాసమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ప్రజలు గ్రహించాలి. తమ నాయకులు ఏ స్థాయికి ఎదిగారో చెప్పుకొని మురిసిపోవడం కంటే వాళ్ళ వలన ఊరికి ఎంత మేలు జరిగిందనేది ప్రజలు అంచనా వేయాలి. అప్పుడే నాయకులను ఆదరించాలా లేక ప్రజాక్షేత్రంలో నిలదీయాలా అనేది క్లారిటీ వస్తుంది. సమాజానికి కొంతైనా మేలు కలుగుతుంది.

Advertisement

Next Story