రాష్ట్రంలోకి రుతుపవనాలు.. మూడ్రోజులు వర్షాలు

by Shyam |
రాష్ట్రంలోకి రుతుపవనాలు.. మూడ్రోజులు వర్షాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నిజామాబాద్‌, పెద్దపల్లి జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం అర్థరాత్రి వరకు పలుజిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణశాఖ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాత్రి మొదలైన వాన బుధవారం సాయంత్రం దాకా కురిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత రాత్రి కురిసిన వర్షానికి లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం ఉదయం నుంచి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. రాష్ట్రలో పలు చోట్ల రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు) తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచే వర్షాలు మొదలయ్యాయి. గురువారం ఉదయం వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 31.4 మి.మీ.గా నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో 190.5, ములుగు జిల్లా మంగపేటలో 178.8, యాదాద్రి జిల్లా మర్యాలలో 156.3, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో 142.8 గంగవరంలో 134.3 మి.మి వర్షపాతం నమోదైంది. గురువారం ఉయదం 8 గంటల వరకు మొత్తం 20 జిల్లాల్లో వర్షం కురిసింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి కల్వంచలో 89.5, శేరిలింగంపల్లి హఫీజ్‌పేట్‌లో 79.8, పెద్దఅంబర్‌పేట 77.5, సరూర్‌నగర్‌ పరిధిలో 74.3, హయత్‌నగర్ పరిధిలో 67.8 మి.మి. వర్షం కురిసింది. ఇక శుక్రవారం ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, నారాయపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలో అత్యధిక ప్రాంతాలు, నారాయణపేట, గద్వాల జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అదే విధంగా శనివారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, మేడ్చల్, గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా… రాష్ట్రం మొత్తం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

విస్తరించిన రుతుపవనాలు

మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవాలోని మొత్తం ప్రాంతాలు, కొంకన్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో పలు ప్రాంతాలు ప్రాంతాలు, రాయలసీమ, కోస్తాంధ్రాలో మొత్తం ప్రాంతాలు, దక్షిణ ఒరిస్సాలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలోని మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు, అస్సాం, మేఘాలయలో మరికొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయి.

Advertisement

Next Story