- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భూ భారతి చట్టం అమలుకు రంగం.. తొలివారం అత్యంత కీలకం

(శిరందాస్ ప్రవీణ్ కుమార్)
భూ భారతి చట్టం అమలుకు రంగం సిద్ధమైంది. సోమవారం (ఏప్రిల్ 14న) సాయంత్రం కొత్త వెబ్‌సైట్ ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం గందరగోళం సృష్టిస్తున్న 33 మాడ్యూళ్ల నుంచి ఆరింటికి కుదించారు. ధరణి పోర్టల్ రూపురేఖలు కనుమరుగు కానున్నాయి. ఏ మాడ్యూల్ కింద అప్లయ్ చేయాలన్న దానిపై మీ సేవా నిర్వాహకులకు కూడా అర్థం కాని రీతిలో రూపొందించిన వెబ్‌సైట్‌ను సరళతరం చేశారు. తెలుగులోనూ జనపదాలతో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంగ్లిషు పదాలతోనే ఉండడం ద్వారా సామాన్య రైతులకు అర్థం కాదని స్పష్టం చేశారు. గూగుల్ ట్రాన్స్‌లేషన్ కాకుండా జనం మాట్లాడుకునే భాషలోనే వెబ్‌సైట్ ఉండాలని మార్గనిర్దేశం చేశారు. సామాన్య రైతు సొంతంగా దరఖాస్తు చేసుకునేలా డిజైన్ చేస్తున్నారు. ఆరు మాడ్యూళ్లతోనే అన్ని అంశాలు వచ్చేలా డిజైన్ చేశారు. ప్రస్తుత ధరణి పోర్టల్‌ని కొనసాగిస్తూనే అప్ గ్రేడ్ చేయడం ద్వారా కొత్త విపత్తులను అధిగమించేందుకు ఎన్ఐసీ పనిచేస్తున్నది.
మరో కొత్త సిస్టమ్‌ని ప్రవేశపెట్టేందుకు పౌర సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ ఒక్క రోజు కూడా అప్లికేషన్ల స్వీకరణ, పరిశీలన, స్లాట్ బుకింగ్స్, రిజిస్ట్రేషన్లకు అవరోధం వాటిల్లకుండానే టెక్నికల్ అప్‌గ్రేడ్ చేయడం గమనార్హం. భూ భారతి వెబ్‌సైట్‌ని అమల్లోకి తీసుకొచ్చేందుకు, డిజైన్ చేసేందుకు ఏ ఒక్కరోజు కూడా భూ పరిపాలన సేవలకు అవరోధం తలెత్తకుండా చర్యలు తీసుకోవడం ప్రశంసనీయం. సీసీఎల్ఏ సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మకరంద్ మంద నేతృత్వంలో టెక్నికల్ నిపుణులు పనిచేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచనల మేరకు కొత్త వెబ్‌పోర్టల్ తుదిరూపునకు చర్యలు చేపట్టారు. కొత్త ఆర్వోఆర్ 2025 చట్టంలో 23 అంశాలు ఉన్నాయి. ప్రతి సెక్షన్ అత్యంత కీలకంగా ఉంది. ఏ ఒక్కదాన్ని ఉపేక్షించడానికి, అమలు చేయకుండా పెండింగులో ఉంచేందుకు ఆస్కారం లేదు. ప్రతి సెక్షన్‌ని అమలు చేసేందుకు అవసరమైన సాంకేతిక దన్ను కల్పిస్తున్నారు.
కొత్తగా భూమిత్ర చాట్‌బాట్
భూ భారతి చట్టం, అప్లికేషన్లు, దరఖాస్తు విధానం వంటి అనేకాంశాలపై ఎలాంటి సందేహాలు తలెత్తినా నివృత్తి చేసేందుకు ‘భూ మిత్ర లేదా భూ రక్షక్’ వంటి చాట్‌బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయ పనివేళల్లో అది నిరంతరం పనిచేస్తుంది. దాని ద్వారా ఏ ప్రశ్నకైనా సమాధానాన్ని తెలుసుకునే వీలున్నది. ప్రజలకు కొత్త చట్టంపైన ఎలాంటి సందేహాలు వచ్చినా ఎవరినీ అడిగే పని లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఈ చాట్ బోర్డు పని చేసేలా డిజైన్ చేశారు. ఇప్పటికే ఎఫ్ఏక్యూ (తరచూ అడిగే ప్రశ్నలు) సమాధానాలను అప్‌లోడ్ చేశారు. రానున్న రోజుల్లో ఇంకెలాంటి డౌట్స్ వస్తాయో పరిశీలించి వాటిని కూడా భూ మిత్రకు అనుసంధానం చేస్తారు. అందుకే మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రెండు నెలల పాటు పరిశీలన చేయనున్నారు. అక్కడ ప్రజలకు ఎదురయ్యే ప్రశ్నలను బట్టి తీర్చిదిద్దనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ మంద మకరంద్ వివరించారు. రానున్న రోజుల్లో ఏఐని విస్తృతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. భూ మిత్ర ద్వారా సమాధానాలు ఇచ్చేందుకు సీసీఎల్ఏలో టీమ్ పని చేస్తుంది. ఉదాహారణకు నాలా కోసం ఎలా అప్లై చేయాలని ప్రశ్న అడిగితే దాని ప్రొసీజర్ ని వివరిస్తుంది. ఇంకా ఇలాంటి ఏ ప్రశ్నలకైనా సామాన్యులకు అర్ధమయ్యేలా చెప్పేందుకు చర్యలు చేపట్టనున్నారు. దీంతో పాటు టోల్ నంబర్ కూడా అందుబాటోకి తీసుకొస్తున్నారు. దీనికి గాను 8 లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. లైన్ బిజీగా వస్తుందన్న ఫిర్యాదులు అందకుండా సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు అప్ డేట్ అందిస్తారు. ఇక్కడ వచ్చే ఫీడ్ బ్యాక్‌ని ఎన్ఐసీకి అందిస్తూ చేర్పులు, మార్పులు చేపట్టనున్నారు. ఐతే ప్రశ్నలను నిర్దిష్టంగా అడగకపోతే టోల్ నంబర్‌కి కాల్ చేయమని సూచించేటట్లుగా భూ మిత్రను డిజైన్ చేశారు.
స్పీడ్
ధరణి పోర్టల్ ఓపెన్ చేసి.. జిల్లా, మండలం, ఊరు, సర్వే నంబరు సెర్చ్ చేసి.. ఓటీపీ కొట్టిన తర్వాత వాలిడేషన్ చేస్తుంది. ఇదంతా పూర్తి కావడానికి కనీసం 20 నుంచి 30 సెకన్లు అవుతుంది. ఇప్పుడు భూ భారతిలో దీన్ని రెండు నుంచి నాలుగు సెకన్లనే వివరాలను అందించేందుకు స్పీడ్ ని పెంచారు. బ్యాక్ కి వెళ్లాలన్నా అంతే స్పీడ్ తో వెళ్లొచ్చు. సైట్ ఓపెన్ చేయగానే హోం పేజీ వస్తుంది. లెఫ్ట్ సైడ్ లో ప్యానల్ ఉంటుంది. మరో వైపు ప్రొఫైల్ ఉంటుంది. డ్యాష్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. లెఫ్ట్ సైడ్ లోనే కేటగిరీలు ఉంటాయి. అప్లికేషన్ పెట్టుకోవడానికి అవసరమైన ఆరు మాడ్యూళ్లు కనిపిస్తాయి. 33 మాడ్యూళ్లల్లో కొన్నింటిని మెర్జ్ చేశారు. 5, 6 మాడ్యూళ్లను పూర్తిగా తొలగించారు. 18, 19 మాడ్యూళ్లను కలిపి ఆరింటిగా మార్చారు. ధరణి అప్లికేషన్ ఫారంలోకి వెళ్లిన తర్వాత వివిధ ఆప్షన్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. రిజిస్ట్రేషన్, సమస్యల కేటగిరిలను విభజించారు.
తొలివారం కీలకం
భూ భారతి అమలైన మొదటి వారం రోజులు అత్యంత కీలకమని అధికారులు గుర్తించారు. సైట్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లక్షలాదిమంది తమ రికార్డులను, డేటాను చెక్ చేసుకోవడానికి సైట్ ని విజిట్ చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కొంత స్లో కావచ్చు. కానీ సాధారణ స్థాయికి చేరుకున్న తర్వాత ధరణి కంటే తప్పకుండా స్పీడ్‌ని గుర్తించొచ్చునని అధికారులు చెప్పారు. కొందరు చెక్ చేయడానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు విజిట్ చేస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో అంతా స్టెబిలైజ్ అవుతుంది. అందుకు గాను సీసీఎల్ఏలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు వార్ రూమ్‌ని ఏర్పాటు చేశారు.
సెక్యూరిటీ
బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్, రూ.లక్షల కోట్ల విలువైన భూముల రికార్డులను విదేశీ సంస్థకు అప్పగించారన్న అపవాదుని మూటగట్టుకున్నారు. ఇప్పుడా పొరపాటు చేయకుండా స్వదేశీ ఎన్ఐసీ సంస్థకే అప్పగించారు. అలాగే ధరణి టూ భూ భారతికి డేటా ట్రాన్స్ ఫర్ చేసేటప్పుడు ఎలాంటి సెక్యూరిటీ థెఫ్ట్, సైబర్ అటాక్స్ చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. సైబర్ సెక్యూరిటీస్ విషయంలో అన్ని జాగ్రత్తలు చేపట్టారు. ఇండిపెండెంట్, ఫేక్ మెసెజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖలను అలెర్ట్ చేశారు.
డోంట్ వర్రీ
ధరణి పోర్టల్ నుంచి భూ భారతికి మారేటప్పుడు తమ రికార్డులు మారుతాయోమో.. ఎవరైనా తప్పుగా రాస్తారేమోనన్న అనుమానాలు అవసరం లేదు. ఎలాంటి డేటా చేంజెస్ ప్రస్తుతం చేయడం లేదు. ధరణిలోని డేటాను యథాతథంగా భూ భారతికి ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. అలాగే పీవోబీ వంటి జాబితాను మార్చడం లేదు. ప్రస్తుతం రైతుల పేరిట ఏ వివరాలు ఉన్నాయో అవే భూ భారతిలో దర్శనమిస్తాయి. ఈ క్రమంలోనే ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా డేటాను బ్యాక్ ఎండ్ లో టేప్ లో భద్రం చేస్తున్నారు. 8 టీబీ నుంచి 9 టీబీ వరకు ఉన్న డేటాను జాగ్రత్తపరుస్తున్నారు. అందుకే రైతులెవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని సీసీఎల్ఏ అధికారులు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం పెండింగులో ఉన్న ధరణి అప్లికేషన్లు కూడా భూ భారతికి బదిలీ అవుతాయి. మరోసారి అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు.
రైట్ టూ ప్రైవసీకి చెక్
ధరణి పోర్టల్ అమలు కాగానే కొందరు సంపన్న వర్గాలకు చెందిన వారు, ఉన్నతాధికారులు, వ్యాపార వర్గాలు వారి భూముల వివరాలను గోప్యంగా ఉంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. వారి డేటా కనిపించకుండా రహస్యంగా ఉంచేందుకు రైట్ టూ ప్రైవసీ అనే విధానాన్ని అమలు చేశారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా న్యాయ కోవిధులు కూడా తేల్చారు. కానీ అప్పటి ప్రభుత్వం ఆ భూముల డేటాను ప్రజలకు తెలియకుండా ఉండేందుకు సహకరించింది. ఇలా కొన్ని లక్షలాది ఎకరాల భూమి రైట్ టూ ప్రైవసీ కింద నమోదైంది. ఎక్కడైనా తాము ఈ భూమిని కొన్నామంటూ నలుగురికి చెప్పడం ద్వారానే ఏదైనా సమస్యలొస్తే పరిష్కరించుకునేందుకు వీలవుతుంది. కానీ కొందరు తాము ఎలా, ఎవరి నుంచి, ఏ భూమిని కొనుగోలు చేశామో తెలియకుండా రహస్యంగా ఉంచారంటేనే.. ఏ పద్ధతిన కొనుగోలు చేశారో అర్థమవుతుంది. అయితే రేవంత్ సర్కారు మాత్రం ఈ రైట్ టూ ప్రైవసీని పూర్తిగా ఎత్తివేస్తుండడం హర్షణీయం. ప్రతి ఎకరం భూమి వివరాలు కూడా ప్రజలందరికీ కనిపించే పారదర్శకతను ప్రదర్శిస్తున్నది.