సవాలు విసిరిన ‘సాగర్’ సమరం

by  |
major parties in telangana
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎదురుదెబ్బలు తిన్న అధికార పార్టీ గెలిచి తీరాల్సిందేననే లక్ష్యంతో సాగర్ బరిలోకి దిగుతోంది. పట్టు తమదే అనుకుంటున్న కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డికి కూడా ఇది జీవన్మరణ సమస్యగా మారింది. ప్రత్యామ్నాయం మేమే అంటూ బీజేపీ సవాల్ విసురుతోంది. మూడు పార్టీలకు సాగర్ ఉప ఎన్నిక అగ్నిపరీక్షగా తయారైంది. రాష్ట్రవ్యాప్యంగా రాజకీయ వేడిని రగిలిస్తోంది. దీనిని 2024 ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్నారు.

టీఆర్​ఎస్ పడి లేచేనా?

గతంలో లేని విధంగా దుబ్బాకలోనూ, జీహెచ్ఎంసీలోనూ టీఆర్ఎస్ అపజయాలను మూటగట్టుకుంది. సానుభూతి కూడా పని చేయలేదు. దుబ్బాకలో కేబినెట్​ మొత్తం కూర్చున్నా ఫెయిల్యూర్ తప్పలేదు. జీహెచ్​ఎంసీలోనూ అదే కథ. 100 సీట్లు తమవేనన్న ధీమా సగానికి పడిపోయింది. ఫలితంగా గులాబీ దళంలో నిరుత్సాహం నెలకొంది. ప్రభుత్వంలో కీలకంగా మారిన నేతలు పక్కచూపులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు పార్టీ అధినేత కేసీఆర్​ రంగంలోకి దిగాల్సి వచ్చింది. గతంలో ఉప ఎన్నికలను తేలికగా తీసుకునే గులాబీ బాస్​ ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. టీఆర్​ఎస్​కు ఇది అసలైన పరీక్ష. సాగర్​లో ఓడితే 2024 ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. టీఆర్​ఎస్​కు ఇది సిట్టింగ్​ స్థానం. ఎమ్మెల్యే నోముల అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. పార్టీ ద్వితీయశ్రేణి నాయకుల మధ్య సమన్వయం కుదరడం లేదు. నోముల హయాంలోనే ఇది బహిర్గమైంది. నోముల కుటుంబానికే తిరిగి టికెట్ ఇవ్వడం​ రెడ్డి వర్గానికి ఇష్టం లేదనే విషయాన్ని అధిష్టానం గుర్తించింది. దీంతో అభ్యర్థి ఎవరయితే బాగుంటుందన్న కోణంలో సర్వేలు నిర్వహించింది. నర్సింహయ్య కుమారుడు భగత్, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి అభ్యర్థిత్వాలను పరిశీలిస్తోంది. ఇక్కడ గులాబీ నేతల అంచనా తప్పితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అందుకే గెలుపు కోసం అన్ని ప్రయత్నాలను ప్రారంభించింది. ఏండ్ల తరబడి పట్టించుకోని రిజర్వాయర్లకు నిధులు విడుదల చేస్తోంది.

కాంగ్రెస్​కు దింపుడుకళ్లెం ఆశ

కాంగ్రెస్​ పార్టీకి సాగర్​ ఉప ఎన్నిక చివరి అవకాశంగా భావించాల్సి వస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, అత్యధిక విజయాలు, అనేక శాఖలకు మంత్రిగా పని చేసిన సీనియర్​ నేత కుందూరు జానారెడ్డికి ఇది సవాల్ గా మారింది. నిజానికి రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికలలోనూ, పంచాయతీ, పరిషత్​, పురపాలక ఎన్నికలలోనే కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. పార్లమెంట్​ ఎన్నికలలో మూడు స్థానాలు గెలిచినా అంతగా ప్రయోజనం చేకూరలేదు. పార్టీ పగ్గాల కోసం నేతలు విడిపోయారు. ఇప్పుడు యాత్రలు చేస్తున్నారు. కాంగ్రెస్​కు మళ్లీ బలం రావాలంటే సాగర్​ ఎన్నికలో గెలిచి తీరాల్సిందే. జానారెడ్డి గతంలో ఓడిపోయినా తమదే ఆధిపత్యం అని చెప్పుకుంటున్నారు. సీనియర్లంతా ఈ జిల్లాకు చెందినవారే. ఇప్పుడు గెలువకుంటే పార్టీ పూర్తిగా చచ్చిపోయినట్టేననే అంచనాకు వస్తున్నారు. అందుకే ఈ ఉప ఎన్నికపై దింపుడుకళ్లం అశలు పెట్టుకున్నారు.

వాపు కాదంటున్న బీజేపీ

రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారిగా ఊపు మీదికొచ్చింది. కాంగ్రెస్​ను, టీఆర్​ఎస్ కు సవాల్ విసిరింది.​ దుబ్బాకలో విజయం, గ్రేటర్​లో పోటాపోటీగా స్థానాలను దక్కించుకోవడంతో ఆ పార్టీ దూకుడు మీదుంది. యువత ఎక్కువగా కాషాయం వైపు ఉందనేది అంచనా. దుబ్బాక, జీహెచ్​ఎంసీ విజయాలు గాలివాటమనే విమర్శలు ఉన్నాయి. అందుకే సాగర్​ ఉప ఎన్నిక కీలకం కానుంది. ఇక్కడ కూడా గెలిస్తే ప్రత్యామ్నాయం తామేనన్న సంకేతాలిచ్చినట్టే. ఇప్పటికే అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది. గతంలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ పార్టీకి పెద్దగా ఓట్లు రాలేదు. సంస్థాగత నిర్మాణం కూడా అంతగా లేదు. గత ఎన్నికలలో పోటీ చేసిన కంకణాల నివేదితకు 1.48 శాతం (2.675) ఓట్లే వచ్చాయి. ఇప్పుడు గెలుపు సాధిస్తే రాష్ట్రంలో అనుకూల పవనాలు మరింత పెరిగే ఛాన్స్​ ఉన్నట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నేతలు బీజేపీ గూటికి చేరుతున్నారు. హాలియా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, జానారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే రిక్కి ఇంద్రసేనారెడ్డి బీజేపీలో చేరారు. తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన డాక్టర్ రవినాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

సామాజికవర్గాలుగా అంచనాలు

సాగర్‌లో సామాజికవర్గాల ప్రభావం ఉంటుందని అంచనా. ఇక్కడ యాదవుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆధిపత్యం మాత్రం రెడ్లదే. నోముల రెడ్లకు వ్యతిరేకంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రెడ్లు టీఆర్​ఎస్​కు దూరమవుతూ వచ్చారని అంటున్నారు. ​ యాదవుల ఓట్లు తప్పకుండా గంపగుత్తగా పడుతాయని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అందుకే గొర్ల పథకాన్ని పరుగులు పెట్టిస్తోంది. మూడేండ్లుగా పెండింగ్ లో ఉన్న గొర్ల పంపిణీ స్కీమ్ ను మళ్లీ తీసుకొచ్చారని ప్రచారం కూడా ఉంది. కాంగ్రెస్​కు రెడ్ల మీదనే ఆశలున్నాయి.

అందుకే గుర్రంపోడు ఇష్యూ

బీజేపీ గిరిజనుల ఓట్లపై భారీ నమ్మకం పెట్టుకుంది. టీఆర్​ఎస్​ యాదవులను దగ్గరకు తీస్తోందని, కాంగ్రెస్​ కు రెడ్ల అండ ఉందని గుర్తించింది. ఈ నియోజకవర్గంలో గిరిజనుల ఓట్లు కూడా ప్రభావితం చేసే స్థాయిలోనే ఉన్నాయి. అందుకే గిరిజన సమస్యలను ప్రధానంగా తీసుకుంది. పోడు భూముల అంశంపై పోరాటానికి దిగింది. యాదవుల ఓట్లు రాబట్టుకునేందుకు అదే వర్గానికి టికెట్​ ఇచ్చే ఆలోచన కూడా చేస్తోంది.

Advertisement

Next Story