‘పంచాయతీ’ తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు

by srinivas |
‘పంచాయతీ’ తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు
X

దిశ, ఏపీ బ్యూరో: పంచాయతీ ఎన్నికలపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. టీచర్లు, ఉద్యోగుల తరఫున దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లను కొట్టివేసింది. పిటిషన్లను అనుమతించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ఇప్పటికే ప్రభుత్వం, ఎస్ఈసీ తరఫున వాదనలు పూర్తయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది.

దీనిపై సోమవారం ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం సుబ్రహ్మణ్యం, ఎస్ఈసీ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, నిమ్మగడ్డ తరపున డీవీ సీతారామ్మూర్తి వాదనలు వినిపించారు. మంగళవారం ప్రభుత్వం వాదనలపై ఎస్ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదని, ఇంత వరకు ఎక్కడా జరగలేదని అన్నారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయవాది ఆదినారాయణరావు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపు వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

Advertisement

Next Story

Most Viewed