’అభయం’ అందేనా…?

by Sridhar Babu |
’అభయం’ అందేనా…?
X

దిశ,వేములవాడ: ఏ ఆధారం లేని వృద్ధులకి జీవనాధారంగా ఉంటూ వారి కన్నీళ్లను తుడిచి కడుపు నింపుతుందనుకున్న పథకం అర్ధఆకలితో అలమటింప చేస్తుంది. బతకలేని వారికి భరోసానిస్తుందనుకుంటే వారి బతుకుకే భారంగా మారింది అభయహస్తం పథకం…. అభయ హస్తం ద్వారా 60 ఏళ్లు పై బడిన వారికి పింఛన్ ఇస్తామని 2009లో ప్రవేశ పెట్టిన పథకం నీరుగారిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన తరువాత అభయ హస్తంలో మార్పులు చేసి, పింఛన్ అందిస్తామని చెప్పి నాలుగేండ్లు గడుస్తున్నప్పటికీ… ఇప్పటి వరకు దాని ఊసెలేదు. దీంతో లబ్ధిదారులు పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కరికి ఒక్కటే పింఛన్ అని చెప్పడంతో ఇటు ఆసరా పింఛన్ అందక, అటు ఆభయ హస్తం రాక వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా అభయహస్తం పథకంకు 60581 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభయ హస్తం కు ప్రతి యేడాదికి రూ.365లు చెల్లిస్తే, 60 ఏళ్లు నిండిన తరువాత ప్రతి నెల వారికి రూ.500ల చొప్పున చెల్లిస్తుంది. ఇలా 60 ఏళ్లు నిండి, అర్హులైనా వారు 3969 మంది ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో ప్రవేశ పెట్టిన ఈ ఆభయ హస్తం 2015 వరకు సక్రమంగా సాగింది. తెలంగాణ సర్కారు ఏర్పడిన తరువాత అందులో కొన్ని మార్పులు చేసి, పింఛన్ అందిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికి వరకు పింఛన్ ఇవ్వట్లేదు. అడగకున్న ఉద్యోగుల వయస్సు పెంచిన సర్కారు, ఏళ్లుగా పింఛన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వృద్ధులను పట్టించుకున్న పాపానపోలేదు. పింఛన్ వస్తదనే ఆశతో వృద్ధులు ప్రతి యేడాది రూ.365ల చొప్పున పైసలు జిల్లాలో రూ.4.82 కోట్లు చెల్లించారు.

కట్టిన పైసలన్నా ఇస్తారా .. లేరా…!

ప్రతి నెల రూ.500 లు సర్కారు ఇస్తుందనే గంపెడు ఆశతో వృద్ధులు ప్రతి సంవత్సరం రూ.368 పైసలు చెల్లించారు. పింఛన్ ఇయ్యకున్నా, కట్టిన పైసలన్నా ఇస్తరా, ఇయ్యారా అనే ఆవేదన లబ్ధిదారుల్లో మొదలైంది. నాలుగేళ్లు అయినా తమ గోడును పట్టించుకునే వాడే కరువయ్యాడు. ఇప్పటికే కొందరు చనిపోగా, మిగిలిన వారికైనా పింఛన్ కి, కట్టిన పైసలన్నా ఇయ్యాలే అని వేడుకుంటున్నారు.

ఆసరా పింఛన్ అయినా…

ప్రతి నెల ఆసరా పింఛన్ వేల మందికి పంపిణీ చేస్తున్నారు. కానీ అభయహస్తం లబ్ధిదారులకు మాత్రం ఆసరా పింఛన్ వర్తించడం లేదు. ఎందుకంటే ఒక్కరికి ఒక్కటే పింఛన్ అన్న ప్రభుత్వ నిబంధన ప్రకారం వీరు ఆసరాకు నోచుకోవడం లేదు. ప్రతి నెల వీరి బంధువులకు , స్నేహితులకు ఆసరా పింఛన్ రావడంతో,తమకు పింఛన్ రావడంలేదనే మనోవేధనకు గురి అవుతున్నారు వృద్ధులు. ఇప్పటికైనా అభయ హస్తం లబ్ధిదారులందరికి ఆసరా పింఛన్ ఇచ్చి, మలిదశలో ఉన్న తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story