నగరవాసులకు శుభవార్త చెప్పిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

by Sridhar Babu |   ( Updated:2021-12-28 07:44:12.0  )
Roads-1
X

దిశ, వనస్థలిపురం: ఎల్బీనగర్ నియోజకవర్గంలో రోడ్లను ప్రత్యేకంగా తీర్చిదిద్ది ముస్తాబు చేస్తున్నామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. సాగర్ రింగ్ రోడ్డు నుంచి బీఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ వరకు సీఆర్ఎంపీ(కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రాం) కింద రోడ్ల సుందరీకరణకు మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ నిధులు మంజూరు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగర రోడ్ల అభివృద్ధిలో భాగంగా మంత్రి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు.

నగరంలోని ద్వితీయ శ్రేణి రోడ్లు ముస్తాబు చేసి అందుబాటులోకి తీసుకురావాలనే సీఆర్ఎంపీ క్రింద మరమ్మతులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఐదేళ్లపాటు రోడ్ల పూర్తి నిర్వహణ సదరు కాంట్రాక్టర్ భాధ్యతగా ఉంటుందన్నారు. లాక్ డౌన్ వేళ పనామా నుంచి ఎస్కేడి నగర్ చౌరస్తా, సుష్మా చౌరస్తా-బీఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ వరకు సీఆర్ఎంపీ రోడ్లు నిర్మించినట్లు వివరించారు. నూతనంగా మరో రెండు రోడ్లను మంజూరు చేశారని వెల్లడించారు.

డివిజన్ లోని బీడీ రెడ్డి గార్డెన్స్ నుంచి నందిహిల్స్ మీదుగా మీర్ పేట్ వరకు ఈ రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. గతంలో రోడ్లను కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వేసేవారిని, దాన్ని అరికట్టేందుకు వారికే ఐదేళ్లపాటు నిర్వహణ భాధ్యత ఉండేలా మంత్రి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తద్వారా నాణ్యమైన రోడ్లు రూపొందుతాయని తెలిపారు. డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటిక రెడ్డి అరవింద్ రెడ్డి, నాయకులు, ప్రజలు, సంక్షేమ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story