- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ కేసీఆర్.. ప్రగతిభవన్‌పై కేంద్రం నిఘా!
ప్రగతి భవన్‌లో ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎవరెవరు అక్కడకు వస్తున్నారు? ఏమేం మాట్లాడుతున్నారు? ఎంత సేపు లోపల ఉంటున్నారు? అనే అంశాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. దీనిపై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా పెట్టింది. ఇక్కడి కదలికలన్నీ కేంద్రానికి వెంటవెంటనే చేరిపోతున్నాయి. దీనికి తోడు రాష్ట్రానికి చెందిన కాషాయదళపతి కూడా తన సోర్స్ లను ఏర్పాటు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండే ఒకరిద్దరి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దానినీ ఢిల్లీకి చేరవేస్తున్నారు. రాష్ట్రంలో పాగా వేయడం.. బీజేపీ అంతిమలక్ష్యం. అందుకు 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్. దక్షిణాదిన కర్ణాటకలో అధికారంలో ఉన్న కమలనాథులు తెలంగాణపైనా కన్నేశారు. ఇక్కడ అధికారంలోకి రావడానికి తగినంత స్పేస్ ఉందని బలంగా నమ్మడంతోపాటు ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: విపక్షాలు ఏం చేస్తున్నాయో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా వేస్తుంటాయి. కానీ రాష్ట్రంలో అధికార పార్టీ ఏం చేస్తున్నదో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో రివర్స్ నిఘా పెట్టింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ కదలికలను కేంద్ర ఐబీ పసిగడుతున్నది. నిఘా మీద నిఘా కొనసాగుతున్నది. ఇందుకు ప్రగతి భవన్ కూడా అతీతం కాలేదు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ఏం జరుగుతోంది? ఎవరెవరు వచ్చిపోతున్నారు? ఎంతసేపు లోపల ఉంటున్నారు? ఏం మాట్లాడి ఉండొచ్చు.. వారి మధ్య గతంలో ఉన్న బంధం ఎలాంటిది? ఈ మీటింగుల తర్వాత జరిగిన పరిణామాలేంటి? కొత్త ప్రాజెక్టులు లేదా పథకాలకు ఈ మీటింగులకు ఉన్న సంబంధం ఏంటి? ఇట్లాంటి అంశాలన్నింటిపై కేంద్ర ఐబీ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నది.
టీఆర్ఎస్, బీజేపీల మధ్య గతంలో ఉన్న స్నేహం ఇప్పుడు లేకపోవడం, అధికారం కోసం రాజకీయ సమరం చేస్తుండటంతో రాష్ట్రం నుంచి ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని కేంద్రం సేకరిస్తున్నది. ఇక రాష్ట్రంలోని కాషాయ దళపతి కూడా ప్రగతి భవన్ నుంచి రహస్యాలను తనదైన శైలిలో సేకరిస్తున్నారు. నిత్యం సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండే ఒకరిద్దరిపై ఆధారపడి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వెంటనే అది ఢిల్లీకి చేరుతున్నది. ప్రగతి భవన్ నుంచి సమాచారం బయటకు రావడం అంత ఆషామాషీ కాదనేది కమలనాథులకు తెలియనిది కాదు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరనే సామెతే కమలదళానికి అస్త్రంగా మారింది. అందుకే అక్కడ పనిచేసే సిబ్బందినే వేగులుగా మార్చుకున్నారేమో అనే అనుమానం బలపడుతున్నది. సమాచారం ఇచ్చినందుకు కమలనాథుల నుంచి ఎలాంటి ప్రతిఫలం పొందుతున్నారనేది నాణేనికి మరో పార్శ్వం.
కేసీఆర్‌ను టార్గెట్ చేయడానికేనా?
రాష్ట్రంలో పాగా వేయాలన్నది బీజేపీ అంతిమలక్ష్యం. అందుకు 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్. దక్షిణాదిన కర్నాటక ఉన్నప్పటికీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి తగినంత స్పేస్ ఉందనేది ఆ పార్టీ ప్రగాఢ విశ్వాసం. దుబ్బాకలో ఆ వ్యూహానికి పదును పెట్టింది. గ్రేటర్ ఎన్నికల్లో నమ్మకం కుదిరింది. టీఆర్ఎస్‌ను ఎక్కడ కార్నర్ చేయవచ్చో, కేసీఆర్ ఎలా లొంగి వస్తారో అనే అంశాలను బీజేపీ పసిగట్టింది. పదేపదే ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ బంగారు తెలంగాణ నినాదాన్ని వల్లె వేస్తున్నందున ఆ అంశం నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాలని బీజేపీ ప్లాన్ వేసింది. అందుకే ప్రాజెక్టుల్లోని లొసుగులు, రీడిజైన్, అంచనా వ్యయాన్నిపెంచడం, మూడో టీఎంసీ, డీపీఆర్ లాంటి అంశాలపై పట్టుబట్టింది. చివరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సైతం డీపీఆర్ చుట్టే కథ నడిపిస్తున్నది. జలశక్తి మంత్రి ఏకంగా సీఎం మూడు లేఖలు రాశారు.
అయినా కేసీఆర్ మాత్రం ఆ లేఖలను తేలిగ్గానే తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది రాష్ట్రంలోని ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లన్నీ ఇప్పటికే కేంద్రం చేతికి చేరినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. సవరించిన అంచనాల ప్రకారం రూపొందిన డీపీఆర్ లు కేంద్రానికి వెళ్లినట్లు బీజేపీ రాష్ట్ర నేతల వ్యాఖ్యల ద్వారా, వారు ఉటంకిస్తున్న గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది. ప్రగతిభవన్ నుంచే ఆ డాక్యుమెంట్లన్నీ వెళ్లినట్టు ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. వీటితో పాటు ఆర్థికపరమైన అంశాలు కూడా బయటికి వెళ్లినట్లు అనుమానం. కేసీఆర్ ను టార్గెట్ చేయడానికి వీటిని బలమైన అస్త్రాలుగా బీజేపీ ఉపయోగించుకోవాలనుకుంటున్నది. అందుకే పదేపదే ఆ పార్టీ నేతలు కేసీఆర్ కుటుంబం ఊచలు లెక్క పెట్టక తప్పదు, జైలుకు వెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కాలం మనగలగడం కష్టమే.. లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
లీకు వీరులకు ఉద్వాసన
ప్రగతిభవన్ నుంచి సమాచారం అందించే ఆ వ్యక్తులెవరో పసిగట్టడానికి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. ఒకరిద్దరికి ఉద్వాసన కూడా పలికారు. ఇక్కడ నమ్మకంగా ఉంటూనే బీజేపీ అంతకన్నా ఎక్కువ నమ్మకంతో నాలుగు గోడల మధ్య జరిగే వివరాలను చేరవేయడంపై భారీ స్థాయిలో రాష్ట్రంలో చర్చలు జరిగాయి. ఏ ప్రలోభానికి లోనై ఇలా వ్యవహరిస్తున్నారనేదానిపై సీరియస్ అయ్యారు. నిఘా వర్గాల నుంచి కూడా నివేదిక తీసుకున్నారు. ప్రగతిభవన్‌లో పనిచేసే సిబ్బందితో పాటు ఇతర చోట్ల పనిచేసే అధికారులకేమైనా సంబంధం ఉన్నదా..? అనే అంశంపైనా ఆరా తీయడం మొదలైంది. అనుమానం ఉన్నవారికి ప్రగతి భవన్‌లోకి ఎంట్రీని నిలిపేశారు.
కట్టడిపైనే ప్రధాన దృష్టి
ప్రగతి భవన్ లోపలి నుంచి ఎవరి ద్వారా లీక్ అవుతుందో నిర్ధారించుకోడానికి ప్రత్యేక వ్యూహాన్నే అమలుచేస్తున్నట్టు సమాచారం. ఒక్కో క్యాబిన్ కు ఒక్కరినే పరిమితం చేశారు. గంటల తరబడి అక్కడ ముచ్చట్లు చెప్పుకొనే పరిస్థతిపై కత్తెర పడింది. అధికారులకు కూడా వారి స్థాయిని బట్టి పరిమిత ప్రాంతం వరకే యాక్సెస్ ఇచ్చారని వినికిడి. గతంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రగతిభవన్ కు వెళ్లి, రాజకీయపరమైన అంశాలను చెప్పుకొనేవారు. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. నిర్దిష్ట పనికి సంబంధించిన అంశాలపై మాత్రమే ఆ శాఖకు చెందిన అధికారులతో కలిసి పరిష్కరించుకోవాలంటూ సూచనలు వెళ్ళాయి. సీఎంఆర్ఎఫ్ వ్యవహారాలను పర్యవేక్షించే ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్లి గంటల తరబడి చర్చించుకునే సంప్రదయానికీ బ్రేక్ వేశారు. రాజకోట రహస్యాలు బయట పడకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు అమలవుతున్నాయని సమాచారం.