- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రెగ్యులరైజేషన్ పేరుతో భూములు అన్యాక్రాంతం.. యథేచ్ఛగా కన్వెయెన్స్ డీడ్స్ జారీ

దిశ, తెలంగాణ బ్యూరో: క్రమబద్ధీకరణ పేరిట విలువైన స్థలాలు ప్రైవేటుపరం అవుతున్నాయి. ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వంద అడుగుల నిర్మాణం లేకపోయినా వేల గజాల జాగలకు కన్వెయెన్స్ డీడ్స్ జారీ చేశారు. డెవలపర్లు, రియల్టర్లు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల బినామీలకు ఎకరాల కొద్దీ ఖాళీ స్థలాలు కట్టబెట్టారు. ఎకరం రూ.100 కోట్ల వరకు పలికే కోకాపేట చుట్టు పక్కలే కాకుండా.. ఎయిర్ పోర్టుకు చుట్టూ సైతం ఈ దందా సాగింది. 2023 ఆగస్టు నుంచి నవంబరు దాకా సాగిన ఈ దరఖాస్తుల పరిశీలన, కన్వెయెన్స్ డీడ్స్ జారీలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఖాళీ జాగల క్రమబద్ధీకరణ పూర్తి చేశారు. అయితే ఎయిర్ పోర్టుకు అత్యంత సమీపంలో క్రమబద్ధీకరణ పేరిట భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. బాలాపూర్, రాజేంద్రనగర్, ఇబ్రహింపట్నం, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, సరూర్ నగర్, మహేశ్వరం మండలాల్లో దాఖలైన దరఖాస్తుల జాబితాను వెరిఫై చేస్తే ఎన్నేసి అక్రమాలు.. ఎన్ని రూ.వందల కోట్ల విలువైన ప్రాపర్టీస్ ప్రైవేటు చేతుల్లో ఉన్నాయో అర్థమవుతుంది. కొందరి చేతుల్లో పది ఎకరాలకు పైగానే ప్రభుత్వ స్థలాలు, సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్లు పెట్టుకున్న అప్లికేషన్లల్లో పేర్కొన్న విస్తీర్ణాలు పరిశీలిస్తే వామ్మో అనాల్సిందే. ఈ ప్రాపర్టీస్ ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలోనే ఉండడం విశేషం. అయితే ఈ దరఖాస్తులు ఏ స్టేజీలో ఉన్నాయన్నది రెవెన్యూ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
విస్తీర్ణంపై నిబంధనలు లేకపోవడంతో..
జీవో 59, జీవో నం.92, జీవో 215 ల కింద ఏ మేరకు విస్తీర్ణాన్ని క్రమబద్ధీకరించాలన్న నిబంధనలు పెట్టకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. అందులోనూ ఎన్నేండ్ల క్రితం ఎంత విస్తీర్ణంలో నిర్మాణం ఉన్నది? ఎన్నేండ్ల నుంచి వినియోగిస్తున్నారు? అన్న అంశాలేవీ ప్రామాణికంగా తీసుకోకుండానే ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ విలువలో 25 శాతం నుంచి 100 శాతం కట్టించుకొని కట్టబెట్టేశారు. ఒక్క రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోనే కన్లెయెన్స్ డీడ్స్ శాంక్షన్ చేసిన జీవో 59 దరఖాస్తులను లెక్కిస్తే వాటి విలువ బహిరంగ మార్కెట్లో కనీసం రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
గజాలు కాదు.. ఎకరాలు
కొందరు అక్రమార్కులు జీవో 59, 92 ల కింద ఎకరం నుంచి 11 ఎకరాల వరకు ఖాళీ జాగాలను లీగల్ గా కొట్టేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అందరూ పెద్ద వాళ్లే. కొన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల పేరిట కూడా అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఎకరం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు పలికే భూములు కూడా ఉన్నాయి. ఎయిర్ పోర్టుకు అత్యంత సమీపంలో, ఓఆర్ఆర్ కు దగ్గరలో ఉండే భూములకు సంబంధించి దరఖాస్తులు కూడా ఉన్నాయి. అయితే గజాల వంతున ఉండే అప్లికేషన్లను ఓకే చేయొచ్చు కానీ ఎకరాల్లో ఉండే అత్యంత ఖరీదైన స్థలాలను ఎన్నింటిని రెగ్యులరైజ్ చేశారో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఏ కుటుంబమైనా నివసించేందుకు వంద గజాలు చాలు. కానీ ఈ సంపన్న వర్గాలు ఏకంగా ఎకరాల స్థలాలను తాము కబ్జా చేశామంటే రెగ్యులరైజ్ చేస్తుండడం విడ్డూరంగా ఉన్నది. ప్రభుత్వ భూమిని కబ్జా చేశామంటే.. విస్తీర్ణంతో సంబంధం లేకుండా ధారదత్తం చేస్తున్నారు. కనీసం స్థలాలను క్రమబద్ధీకరించడంలో అక్కడ నివాసం ఉంటున్నట్లుగా ఆధారాలు చూపాలి. కానీ అక్కడ అలాంటి ఆధారాలేం లేకుండానే పాజిటివ్ రిపోర్ట్ రాసిన ఉదంతాలు ఉన్నాయి. పైగా గతంలో ఒకటీ రెండు సార్లు అప్లికేషన్లను రిజెక్ట్ చేసినప్పటికీ, తాజాగా కొందరు రెవెన్యూ అధికారులు మాత్రం క్లియర్ చేసినట్లు తెలుస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ గజం రూ.15,200 గా ఉన్నది. అందులో సగం ధరకే కట్టబెడుతున్నారు. నిజానికి అక్కడ గజం ధర రూ.లక్ష నుంచి రూ.3 లక్షల పైమాటే. కనీసం పెండింగులో ఉన్న అప్లికేషన్లు, ఆ ల్యాండ్ పార్శిల్స్ పై విచారణ చేయాల్సిన అవసరం ఉంది.
వారికి ఎలా వచ్చింది?
జీవో 59ను అడ్డుపెట్టుకొని నాలుగు నెలల్లో సుమారు రూ.50 వేల కోట్ల విలువైన స్థలాలను కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. ఒక్కొక్కరికీ రూ.వందల కోట్ల విలువైన స్థలాలను రాసిచ్చారు. వేల గజాలు, ఎకరాల్లోనే కన్వెయెన్స్ డీడ్స్ జారీ చేశారు. ఒక్కో కుటుంబానికి మూడు, నాలుగు ప్లాట్లను కట్టబెట్టారు. అయితే అప్లికేషన్ ఏ డాక్యుమెంట్లు సమర్పించారు? అసలు అవి ఒరిజినలా? డూప్లికేటా? కొన్నేండ్ల క్రితం రాసుకున్నవా? ఈ మధ్య కాలంలోనే సంతకాలు పెట్టుకున్నారా? ఇప్పుడీ సందేహాలు అధికార వర్గాల్లో తలెత్తుతున్నాయి. ఆయా స్థలాల్లో కనీసం గుడిసె ఆనవాళ్లు లేకున్నా.. దరఖాస్తుదారుడు కొన్నేండ్ల నుంచి ఉంటున్నట్లు రిపోర్టు ఇచ్చిన అధికారులపై అనుమానాలు కలుగుతున్నాయి.
నకిలీ బిల్లులే!
జీవో 59 దరఖాస్తులతో పాటు జత చేసిన ఇంటి పన్నులు, విద్యుత్తు బిల్లుల వంటి కాపీలు కూడా నకిలీవేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఖాళీ జాగలకు ఇంటి పన్ను పత్రాలు ఎలా పుట్టుకొచ్చాయి? అసలు కరెంటు మీటరే లేకుండా బిల్లు ఎలా వస్తుంది? రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో సమర్పించిన ఈ డాక్యుమెంట్లను వెరిఫై చేయాల్సిన అవసరం ఉందని అధికారులు అంటున్నారు. రెగ్యులరైజేషన్ కోసం ఏవో కొన్ని పత్రాలను జత చేయాలి. అందుకే నకిలీ బిల్లు పత్రాలను సమర్పించి ఉంటారని అనుమానం. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఆ బిల్లులపై ఉన్న నంబర్ల ఆధారంగా ఆయా శాఖల్లో సరిపోల్చుకుంటే అవి డూప్లికేటా? ఒరిజినలా? అన్నది తేలిపోతుంది. తాము ఫలానా యజమాని దగ్గర కొన్నాం.. ఇవిగో పత్రాలంటూ సమర్పించారు. కానీ స్థలాన్ని విక్రయించిన వ్యక్తికి ఆ హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ భూమికి ఆయన హక్కుదారుడు ఎలా అయ్యాడు? లింక్ డాక్యుమెంట్లు లేకుండా గజం రూ.లక్షల్లో పలికే భూములను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? అది కూడా ఎకరాల కొద్దీ స్థలాలను నోటరీ ద్వారా కొనుగోలు చేసిన సంపన్న వర్గాలను ఏ కోణంలో చూడాలని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాంటివేవీ పరిశీలించకుండానే రెవెన్యూ అధికారులు ఖాళీ స్థలాలకు కన్వెయన్స్ డీడ్స్ జారీ చేశారనే విమర్శలు ఉన్నాయి.
అనేక ఉదాహరణలు..
- బండ్లగూడ ఖల్సా సర్వే నం.103/13/2, 103/14/2, 103/15/2, 103/15/2, 103/16/2లో 42.30 ఎకరాలు అహ్మద్ మెమోరియల్ సొసైటీ ఖాజా హుస్సేన్ పేరిట రెగ్యులరైజేషన్ ను అప్లయ్ చేశారు. TSULCR21600029864 అప్లికేషన్ నంబరు ద్వారా దాఖలు చేశారు.
- అదే రెవెన్యూ పరిధిలో సర్వే నం.103/13/2, 103/14/2, 103/15/2, 103/16/2లో 15.15 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయాలని అదే సొసైటీ పేరిట అప్లయ్ చేశారు. అప్లికేషన్ నం.TSULCR021600030963 ద్వారా దాఖలు చేశారు.
- బాలాపూర్ మండలం జల్ పల్లి సర్వే నం.179లో ఏకంగా 9,680 గజాలు రెగ్యులరైజ్ చేయాలని రమేశ్ కుమార్ మిట్టల్ అనే వ్యక్తి అప్లికేషన్ నం. APLRRD 150306006782 ద్వారా అప్లయ్ చేశారు.
- బాలాపూర్ లో సర్వే నం.11/1లో 3,754 గజాలు రెగ్యులరైజ్ చేయాలని సత్తిరెడ్డి అనే వ్యక్తి అప్లికేషన్ నం.APLRRD 150307008325 ద్వారా అప్లయ్ చేశారు.
- బాలాపూర్ సర్వే నం.11/1లో 3,746 గజాల స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని పనాల మల్లారెడ్డి APLRRD 150307008323 ద్వారా అప్లయ్ చేశారు.
- రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్ సర్వే నం.131లో ఏకంగా 50 వేల గజాల స్థలం అంటే 10 ఎకరాలకు పైగా రెగ్యులరైజ్ చేయాలని పూర్ణ నర్సింహ అనే వ్యక్తి APLRRD 150130002300 ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇది ఎయిర్ పోర్టుకు అత్యంత సమీపంలోనే ఉంటుంది. ఇక దీని విలువ ఎన్ని కోట్లు ఉంటుందో అంచనా వేయొచ్చు.
-బాలాపూర్ మండలం పాపయ్యకుందన్ లో 2,979 గజాల స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని బొల్లినేని కన్ స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ TSULCR 021600025900 ద్వారా అప్లయ్ చేసుకున్నారు.
- బాలాపూర్ మండలం రేణుకాపూర్ లో ఎం.బాలయ్య అనే వ్యక్తి 17,303 గజాలు, మేకల బాలయ్య 10,043 గజాలు, సాలేన్ బిన్ అబ్దుల్లా బహతాబ్ 2,400 గజాలు, మేకల శ్రీశైలం 10,043, మేకల శ్రీనివాస్ 10,043 గజాలు, మేకల మల్లేశ్ 10,043 గజాలు, కొత్తపేటలో ఎం.మహేందర్ 10 వేల గజాలు రెగ్యులరైజ్ చేయాలని అప్లయ్ చేశారు.
- అబ్దుల్లాపూర్ మెట్ సర్వే నం.212లో ఉమ్మ నర్సింహారెడ్డి ఏకంగా 9,680 గజాల స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని APLRRD 15020900 ద్వారా అప్లయ్ చేశారు. ఎర్ర మాసయ్య APLRRD 15030500 ద్వారా 7 వేల గజాలకు అప్లయ్ చేశారు.
- ఇబ్రహింపట్నం మండలం మంగల్ పల్లిలో వెయ్యి గజాలకు పైగా స్థలాలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య గణనీయంగానే ఉన్నది. ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలోనే ఉంటుంది. ఆర్. వెంకట్రావు అనే పేరుతో ఏకంగా 16,940 గజాలకు, డి.రంగ ప్రసాద్ పేరిట 13,310 గజాలకు అప్లయ్ చేశారు. ఇలా జీవో నం.92, జీవో 215 ల కింద దరఖాస్తు చేసుకున్నారు.