37 మంది ప్రయాణికులు జల సమాధి..

by Sumithra |   ( Updated:2021-02-16 04:50:58.0  )
37 మంది ప్రయాణికులు జల సమాధి..
X

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సిద్ది జిల్లాలో బ్రిడ్జీ పై నుంచి వెళ్తున్న బస్సు కెనాల్‌లో పడింది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ప్రమాదంలో 37 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి ఉన్నట్టు తెలిసింది. బస్సులో మొత్తం 54 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. సిద్ధి నుంచి సత్నా జిల్లాకు వెళ్తుండగా శారదాపాఠక్ గ్రామంలోని బ్రిడ్జీపైకి చేరగానే డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయారు. అంతే, క్షణాల్లో బస్సు బ్రిడ్జీ పై నుంచి కెనాల్‌లోకి పడిపోయింది. ఉదయం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని సాక్షులు చెప్పారు. కొద్ది సేపటి తర్వాత బస్సు పూర్తిగా నీట మునిగింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకున్న తర్వాత బన్‌గంగా ప్రాజెక్టు నుంచి కెనాల్‌లోకి నీటిని నిలిపేశారు. బ్రిడ్జీకి కొంత దూరంలో కెనాల్‌లో బస్సు తేలింది. సుమారు మూడు గంటలపాటు శ్రమించిన తర్వాత రెండు క్రేన్ల సహాయంతో బస్సును ఒడ్డుకు చేర్చారు. ఇప్పటి వరకు ఏడుగురిని రక్షించినట్టు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి ఉన్నారని కలెక్టర్ రవీంద్ర కుమార్ చౌదరి వివరించారు. కెనాల్‌లో బస్సు పడగానే డ్రైవర్ సహా ఆరేడుగురు ఈదుకుంటూ కెనాల్ ఒడ్డుకు వచ్చినట్టు సమాచారం. సహాయక చర్యలు ముగిశాయి. ముందు జాగ్రత్తగా గల్లంతైనవారికోసం సుమారు 20 కిలోమీటర్ల మేరకు కెనాల్ వెంట పెట్రోలింగ్ టీమ్‌ను పంపినట్టు కలెక్టర్ వివరించారు.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. వారికి రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ. 50వేల పరిహారాన్ని అందించనున్నట్టు ట్వీట్ చేశారు. బస్సు ప్రమాదం ఘటన కలచివేసిందని రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రం మొత్తం బాధితుల పక్షాన నిలబడి ఉన్నదని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ దుర్ఘటన కారణంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మధ్యప్రదేశ్‌లో సుమారు లక్ష ఇళ్లను నిర్మించారు. ఈ పథకం లబ్దిదారులతో సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం 11 గంటలకు పాల్గొనాల్సి ఉంది. కానీ, ఈ కార్యక్రమాన్ని మరో రోజుకు వాయిదా వేస్తున్నట్టు సీఎం చౌహాన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed