వాళ్లు చెప్పిన​ సెంచరీ మిస్​

by Anukaran |
వాళ్లు చెప్పిన​ సెంచరీ మిస్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : గులాబీల టార్గెట్​ మిస్సయింది. గ్రేటర్​లో సెంచరీ కొడుతామని, 100 స్థానాలు మావేనంటూ ప్రచారం చేసి​ చాలా దూరంలోనే ఆగిపోతున్నారు. గ్రేటర్​ ఓట్ల లెక్కింపులో ముందస్తు సర్వేల అంచనాలు కూడా తారుమారవుతున్నాయి. టీఆర్​ఎస్​ పార్టీ గత గ్రేటర్​ ఎన్నికల్లో 99 స్థానాల్లో విజయం సాధించి సొంతంగా మేయర్​ స్థానాన్ని దక్కించుకుంది. అదే రీతిన ఈసారి కూడా 100 స్థానాలు మావేనని ప్రచారం చేసుకుంది.

అక్టోబర్​లో కురిసిన వరదలతో హైదరాబాద్​ చాలా ప్రాంతం ఆగమాగమైంది. దీంతో వరద సాయాన్ని ఇష్టారీతిన ఇంటికి రూ. 10 వేల చొప్పున పంపిణీ చేపట్టారు. ఈ పంపిణీలో అధికార పార్టీ నేతలు వాటా పంచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అసలైన బాధితులకు ఇవ్వకుండా బినామీల పేరుతో సగానికిపైగా నొక్కేశారు. దీంతో ప్రభుత్వం పంపిణీ విధానాన్ని మార్చుకుంది. కానీ అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఆదేశాలతో పంపిణీ నిలిపివేశారు. అయితే వరదసాయాన్ని ఓట్లకు బదలాయించుకున్న గులాబీ పార్టీ గ్రేటర్​లో 100 స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. కానీ ఇచ్చిన సాయం కంటే వ్యతిరేకతే ఎక్కువైందని ఆ తర్వాత పరిణామాల్లో గుర్తించారు.

కాగా మంత్రి కేటీఆర్​ మొత్తం గ్రేటర్​ బాధ్యతలను మీదేసుకుని ప్రచారం చేశారు. ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత కూడా బాధ్యతలు పంచుకుంది. ఇక మొత్తం 1‌‌02 డివిజన్లలో కేటీఆర్​ రోడ్​ షో చేశారు. ఈ రోడ్​షోలో, ప్రచారపర్వం, మీడియా ఇంటర్వ్యూల్లో 100 స్థానాలు కచ్చితంగా మావేనంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత కూడా పోలింగ్​కు ముందు నుంచే సెంచరీ సాధిస్తున్నామంటూ ప్రకటించారు. ఓట్ల లెక్కింపు రోజు కూడా అదే చెప్పారు. గత ఎన్నికల్లో సెంచరీని ఒక్క సీటుతో మిస్​ అయ్యామని, ఈసారి సెంచరీ సాధిస్తామంటూ పదేపదే చెప్పుకున్నారు.

కానీ ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో సెంచరికీ చాలా దూరంలోనే ఔట్​ కావాల్సి వస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉన్న ఫలితాల లెక్కల ప్రకారం అధికార టీఆర్​ఎస్​ పార్టీ 48 స్థానాల్లో ముందంజలో ఉండగా బీజేపీ 40 స్థానాల్లో ఉంది. మజ్లీస్​ పాతబస్తీలో హవా కొనసాగిస్తోంది. దీంతో టీఆర్​ఎస్​ 60 నుంచి 70 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో గులాబీ పాట సెంచరీ అందుకోలేకపోయింది. కేటీఆర్​ సార్​… కవితా మేడం… మీరు సెంచరీ మిస్​ అయ్యారంటూ సోషల్​ మీడియా విస్తృతంగా ట్రోల్​ చేస్తోంది.

Advertisement

Next Story