నానమ్మపై ఐదు లీటర్ల పెట్రోల్ పోసి చంపిన మనవడు

by Anukaran |   ( Updated:2020-07-14 09:38:05.0  )
నానమ్మపై ఐదు లీటర్ల పెట్రోల్ పోసి చంపిన మనవడు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తన కొడుక్కి కొడుకు పుడితే ఉప్పొంగి పోయింది. వంశాన్ని మోసేవాడు వచ్చాడని గుండెలకు హత్తుకుంది. కొడుకు పోలికలతో పాటు నానమ్మ పొలికలు వచ్చాయని మురిసిపోయింది. ఆనంద బాష్పాలు తీస్తూ అంబరాన్నంటేంత సంతోష పడింది. పసిప్రాయంలో ఏడిస్తే నిద్రలు మాని ఊయల ఊపింది. అంబాడుతుంటే ఆట బొమ్మలు తెచ్చి ఆడుకుంది. బుడి బుడి అడుగులతో ఉరికొస్తుంటే తన కొడుకు ప్రతిరూపాన్ని చూసి.. ఆరాటపడి అన్నం తినిపించింది. సంకనేసుకొని వీధుల్లో తప్పింది. ఇంటిముందు కొట్టుకాడ అడిగినవన్నీ కోనిచ్చింది. బడిబాట పట్టేవరకు గారబంగా చూసుకొని చల్లని దీనెలతో దేవుళ్ల కరుణను కోరింది. కానీ చివరకు తాను కలలో కూడా ఊహించని రీతిలో తలరాతను రాసుకుంది. తన చేతుల్లో పెరిగిన మనవడి చేతుల్లోనే కక్షకు గురై ప్రాణాలు పోగొట్టుకుంది. నిండు మనసున్న ఓ నానమ్మ. తెలంగాణలో జరిగిన విషాదరకర సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ఎలవర్తి గ్రామంలో గాండ్ల దశరథ, కంసమ్మ దంపతులకు కొడుకు సత్యనారాయణ, ముగ్గురు కుమార్తెలు సువర్ణ, పద్మ, మంజుల ఉన్నారు. వీరందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. సత్యనారాయణ, విజయ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు పదో తరగతి చదువుతున్నాడు. ఇంకో బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే దశరథ, కంసమ్మ దంపతులు.. తమకు ఉన్న 8 ఎకరాల భూమిలో కొడుకు సత్యనారాయణ పేరిట 3ఎకరాలను రిజిస్ట్రేషన్ చేశారు. కూతుళ్లకు ఒక్కొక్కరికి ఎకరం 10గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. మిగిలిన ఎకరానికి పైగా భూమిని వారి వద్దే ఉంచుకున్నారు. సత్యనారాయణ ఐదేళ్ల క్రితం చనిపోయాడు.

మేనత్తలకు ఎకరం భూమి ఇవ్వడంతో..

దశరథ, కంసమ్మ దంపతులు తమ వద్ద ఉన్న ఎకరానికి పైగా భూమిని ముగ్గురు కూతుళ్లకు గతనెలలో రిజిస్ట్రేషన్ చేశారు. అంతకుముందు నుంచే ఆ భూమిని తమకు రాసివ్వాలని నానమ్మతో గొడవ పడుతున్న పెద్ద మనవడు మంగళవారం మరోసారి ఘర్షణ పడ్డాడు. తమకు ఇవ్వాల్సిన భూమిని ఎందుకు మేనత్తలకు రిజిస్ట్రేషన్ చేశావంటూ నానమ్మ కంసమ్మ (65)పై 5లీటర్ల పెట్రోల్ పోసి, నిప్పంటించి తలుపులు పెట్టి పరారయ్యాడు. మంటల వేడికి తట్టుకోలేక పోయిన కంసమ్మ ఇంటి గుమ్మం వద్ద ప్రాణాలు విడిచింది. ఈ క్రమంలో ఇల్లు మొత్తం దగ్ధం అయ్యింది. గమనించిన స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కంసమ్మ కోడలు విజయ, మనవళ్లు పరారీలో ఉన్నారు. మృతురాలి సోదరుడు టంగుటూరు కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed