ఐపీఎల్‌కు లైన్‌ క్లియర్!

by Shyam |
ఐపీఎల్‌కు లైన్‌ క్లియర్!
X

– టీ20 వరల్డ్ కప్‌పై చేతులెత్తేసిన ఆస్ట్రేలియా
– సెప్టెంబర్‌లో నిర్వహణకు సన్నద్ధమవుతున్న బీసీసీఐ

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ఐసీసీ ఇంకా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండగా క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ నిర్వహించలేమని చేతులెత్తేసింది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్ కార్ల్ ఎడ్డింగ్స్ మంగళవారం ఒక వీడియో ప్రకటనలో పరోక్షంగా వెల్లడించారు. ఈ మెగా టోర్నీ నిర్వహణ నిర్ణయాన్ని జూన్ 10న ఐసీసీ ప్రకటిస్తుందని అందరూ భావించారు. కానీ, నిర్ణయాన్ని నెల రోజులపాటు వాయిదా వేసింది. ఈ లోగా ఆస్ట్రేలియా ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో టీ20 వరల్డ్ కప్‌కు మార్గం సుగమమైందని అందరూ భావించారు. తాజాగా సీఏ అధ్యక్షుడు మాత్రం ఈ మెగా టోర్నీ నిర్వహించలేమని సంకేతాలు పంపించారు. ‘టీ20 వరల్డ్ కప్ ఇప్పటి వరకైతే రద్దు లేదా వాయిదా వేయడం లేదు. కానీ, టోర్నీలో పాల్గొనే 16 దేశాల క్రికెట్ జట్లను ఇక్కడికి రప్పించడంపై ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. ఇక్కడికి వచ్చే జట్లలోని చాలా దేశాల్లో కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల జట్లను ఆస్ట్రేలియాలోకి అనుమతించడం రిస్క్ అవుతుంది. నా అంచనా ప్రకారం ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగడం చాలా కష్టం’ అని ఆ వీడియో ప్రకటనలో కార్ల్ ఎడ్డింగ్స్ స్పష్టం చేశారు.

ఐపీఎల్ తేదీలు ఖరారు?

జూన్ 10న జరిగిన ఐసీసీ సమావేశంలో టీ20 వరల్డ్ కప్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా వేశారు. సమావేశం ముగిసిన వెంటనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు, ఫ్రాంచైజీలకు ఒక లేఖ రాశారు. ఐపీఎల్ నిర్వహణకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తాజా సమాచారం మేరకు సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు ఐపీఎల్ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆ రోజుల్లో ఐపీఎల్ నిర్వహణకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియాకు బీసీసీఐ లేఖ రాసింది. ప్రస్తుతం తమ వద్ద ఉన్న సమాచారం మేరకు టీ20 వరల్డ్ కప్ వాయిదా పడుతుంది. ఇప్పటికే సెప్టెంబర్, నవంబర్ మధ్యలో ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా లేవు. శ్రీలంక, జింబాబ్వే పర్యటనలు కూడా రద్దయ్యాయి. ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఉండదని బీసీసీఐ చెబుతున్నది. ‘ఐపీఎల్ నిర్వహణపై మా సన్నాహాలు ఆపలేం. ఐసీసీ తన నిర్ణయాన్ని ఏ సమయంలో చెప్పినా ఐపీఎల్ నిర్వహణపై మాత్రం ముందుకే పోతున్నాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఐపీఎల్ తేదీలపై నిర్ణయం తీసుకున్నా ఎక్కడ నిర్వహించాలనే దానిపై మాత్రం చర్చలు జరుగుతున్నాయి. ‘కొన్ని వేదికల్లో ఐపీఎల్ ఖాళీ స్టేడియాల్లో ఇండియాలోనే నిర్వహించవచ్చులేదా విదేశాలకు తరలించవచ్చు. ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ, ఐపీఎల్ జరుగుతుంది’ అని లీగ్ చీఫ్ బ్రిజేష్ పటేల్ అన్నారు.

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో రాజీనామా

క్రికెట్ ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సీఈవో కెవిన్ రాబర్ట్స్ మంగళవారం రాజీనామా చేశారు. కరోనా ప్రభావం కారణంగా క్రికెట్‌ను గట్టెక్కించే నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడమే కాకుండా టీ20 వరల్డ్ కప్ సందిగ్ధతను పరిష్కరించడంలో కూడా చొరవ చూపలేదని ఆయనపై విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియాను నడింపడానికి ఒక సమర్థుడి అవసరం ఉందని అధ్యక్షుడు ఎడ్డింగ్స్ చెప్పారు. ఈ విషయం కెవిన్‌తో కూడా చర్చించిన అనంతరం ఆయన రాజీనామా చేయడానికి ఒప్పుకున్నట్లు అధ్యక్షుడు ఎడ్డింగ్స్ మీడియాకు తెలిపారు. క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవోగా నిక్ హోక్లే నియామకమయ్యారు. కొంతకాలంగా కెవిన్ నిర్ణయాలపై ఆటగాళ్లు, రాష్ట్రాల అసోసియేషన్లు అసంతృప్తిగా ఉండటంతో అతను పదవి నుంచి వైదొలిగినట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story