రాష్ట్రంలో వెంటనే ఆర్టికల్ 360 అమలు చేయండి: మాజీ మంత్రి రామకృష్ణ

by Manoj |   ( Updated:2022-03-26 10:41:10.0  )
రాష్ట్రంలో వెంటనే ఆర్టికల్ 360 అమలు చేయండి: మాజీ మంత్రి రామకృష్ణ
X

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ జగన్ తన మూడేళ్లపాలనలో అప్పులు, అవినీతి, వ్యవస్థల విధ్వంసం తప్ప సాధించిందేమీలేదు. ఎఫ్ఆర్ బీఎం నిబంధనలు కూడా కాదని ఇష్టారాజ్యంగా అప్పులు తెచ్చి.. ఆసొమ్ముని ప్రజలకోసం ఖర్చు పెడుతున్నామని చెప్పడం పచ్చి అబద్ధం, 2020-21 కాగ్ నివేదికను పరిశీలిస్తే, జగన్ ప్రభుత్వం రూ.48 వేల కోట్లకు పైగా సొమ్ముని లెక్కాపత్రం లేకుండా దుర్వినియోగం చేసినట్టు స్పష్టమవుతోంది' అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2020-21లో ప్రజా సంక్షేమానికి రూ.లక్షా73వేల కోట్లకుపైగా ఖర్చుపెట్టినట్టు ప్రభుత్వం చెప్తున్న లెక్కల్లో రూ.48వేల కోట్లకు పైగా సొమ్ము దుర్వినియోగమైనట్టు కాగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. కాగ్ అభ్యంతరాలపై స్పందించే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా అని పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు.

రూ.48వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లినట్లు

'తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని చెప్తూనే ఉంది. అది నిజమని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. రూ.48వేల కోట్లకుపైగా లెక్కా పత్రంలేని సొమ్మంతా వైసీపీ నేతలు, ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్లిందని స్పష్టమవుతోంది. సొమ్ము దుర్వినియోగంపై ఈ ప్రభుత్వం స్పెషల్ బిల్స్ కింద వాడామని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. అలా స్పెషల్ బిల్స్ కింద ట్రెజరీకోడ్‌ను కాదని నిధులు ఇష్టానుసారం వినియోగించడానికి వీల్లేదు. ట్రెజరీకోడ్‌ను, బీఆర్ ఏను వయోలేట్ చేసిమరీ ప్రభుత్వం ప్రజల సొమ్ముని దుర్వినియోగంచేసింది అని కాగ్ చెబుతోంది' అని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు.

కేంద్రం జోక్యం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను గాలికొదిలేసింది. ప్రజల నుంచి వివిధ మార్గాల్లో వసూలు చేస్తున్న సొమ్ముకు లెక్కా పత్రం ఉండటం లేదు. 15వ ఆర్థికసంఘం బడ్జెట్ పరిధిలోని అప్పులు కాకుండా హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్‌ను ఎలాఖర్చు పెడుతున్నారో ప్రభుత్వం చెప్పడం లేదు. 2024 చివరికి రాష్ట్ర అప్పులు 8లక్షల కోట్ల నుంచి 9లక్షల కోట్ల వరకు చేరే అవకాశముంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం చేసిన అప్పులకుగాను రూ.31వేల కోట్ల వరకు వడ్డీలు చెల్లిస్తోంది. రోజురోజుకు అప్పుల గ్రోత్ రేట్ పెరిగిపోతుంటే, రెవెన్యూ గ్రోత్ రేట్ తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి రాబోయే రెండేళ్లు కూడా ఉంటే తర్వాత రాష్ట్రానికి రూపాయి అప్పు పుట్టదు. ఉద్యోగులకు జీతాలిచ్చి కూర్చోవడం తప్ప..పేదలకు ఎలాంటి పథకాలు అమలుచేయలేం. ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కాకూడదంటే ప్రభుత్వం అప్పులు, ప్రజల సొమ్ము దుర్వినియోగం పై కేంద్రం కలుగుచేసుకోవాలి. ఆర్టికల్ 360 ప్రకారం (ఫైనాన్షియల్ ఎమర్జన్సీ తలెత్తినప్పుడు) రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వెంటనే ఆర్టికల్ 360 అమలు చేయకపోతే చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చే మార్గాలన్నీ వైసీపీ నేతల పరమైపోయాయి. అందువల్లే రాష్ట్రం ఇంతలా కోలుకోలేని విధంగా ఆర్థికంగా దెబ్బ తినడం జరిగింది. రూ.48వేలకోట్లు ఏమయ్యాయి.. ఆ సొమ్ము ఎవరి చేతుల్లోకి వెళ్లిందనేది ఒక స్వతంత్ర సంస్థతో కేంద్రం దర్యాప్తు జరిపించాలి. ఏపీని కేంద్రం ఇప్పుడు గానీ ఆదుకోకపోతే, పూర్తిగా కోలుకోలేని విధంగా రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనం అవుతుంది'అని యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేపిటల్ ఎక్స్ పెండేచర్ కింద రూ.18వేలకోట్లపైన ఖర్చుపెడితే, రెవెన్యూ డెఫిషియన్స్ రూ.35వేలకోట్లపైగా ఉంటోంది. అసలు ఇలాంటి దారుణాలు ఎక్కడాచూడం. 2019-20, 2020-21 ఆర్థికసంవత్సరాల్లో కేపిటల్ ఎక్స్ పెండేచర్‌కి, రెవెన్యూలోటుకి చాలా వ్యత్యాసం ఉంది అని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు.

కాగ్‌కు వివరణ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం

అసెంబ్లీ, మండలి సమావేశాల తీరును దారుణంగా ఉంది. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపై చట్టసభల్లో మాట్లాడకూడదనే నిబంధనను తుంగలో తొక్కారు. అమరావతి విషయంలో ప్రతిపక్షాలపై బురద జల్లి, ప్రజలను తప్పుదోవ పట్టించే తంతుని చట్టసభల్లో కొనసాగించారు. 365 రోజుల్లో ప్రతి రోజూ వేజ్ అండ్ మీన్స్ కింద రాష్ట్రపాలకులు అప్పులు తెచ్చారు. అలానే ప్రతి మూడున్నరరోజులకు ఓడికింద అప్పులు తెచ్చారు. అవికాకుండానే మార్కెట్ బారోయింగ్స్ కింద రూ.55వేలకోట్లు, హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కింద రూ.లక్షా09వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఈప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే రూ.లక్షా 75 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టింది. దానిలో రూ.48 వేల కోట్లకు పైగాసొమ్ము దుర్వినియోగమైంది. ప్రజలసొమ్ముకి బాధ్యతవహించాల్సింది ప్రభుత్వమే'అని మాజీ మంత్రి యనమల చెప్పుకొచ్చారు. స్పెషల్ బిల్స్ అనేవి ఇవ్వడానికి వీలేలేకపోతే, వాటికింద రూ.48వేలకోట్లు ఖర్చుపెట్టామని ఎలా చెబుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ ఇప్పటికే నాలుగు సార్లు అడిగింది. కాగ్‌కు వివరణ ఇవ్వలేక సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. సీఎఫ్ఎంఎస్ విధానం అనేది చాలా చాలా పారదర్శకమైనది. అలాంటి విధానం ఈ ప్రభుత్వానికి నచ్చలేదంటే.. ఇలా దొడ్డిదారిన ప్రజలసొమ్ముని దారిమళ్లించడానికే. సీఎఫ్ఎంఎస్ విధానంలో మూడో వ్యక్తి ప్రమేయంలేకుండా ప్రజల సొమ్ము సక్రమంగా వారికే చేరేలా చేరుతుంది. అలా చేరకుండా ప్రభుత్వం వ్యవహరించింది. రూ.48 వేల కోట్ల సొమ్మును కాజేసేందుకే ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ విధానాన్ని వ్యతిరేకించింది అని యనమల ఆరోపించారు.

ముఖ్యమంత్రి న్యాయమూర్తులను తప్పుబట్టడం సరికాదు

పీఏసీ సమావేశం కూడా నిర్వహించకుండా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. చట్టాలకు పవర్ లేదని కోర్టు ఎక్కడ అనలేదు.. అమరావతిపై హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందో కూడా ప్రభుత్వం చదవకుండా.. చట్టసభలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఫండమెంటల్ లాస్‌కు వ్యతిరేకంగా చట్టాలు చేసినప్పుడే కోర్టులు కొట్టేస్తుంటాయి. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఎవరు చేశారు.. దాన్ని ఆమోదించింది ఎవరు.. అనేది కూడా తెలియకుండా ప్రజల్ని తప్పుదోవపట్టించారు. ముఖ్యమంత్రి కూడా న్యాయమూర్తులను తప్పుపట్టేలా మాట్లాడితే ఎలా? న్యాయమూర్తులపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదనే నిబంధన రాజ్యాంగంలోనే ఉంది. శాసనసభలను, చట్టాలను, కోర్టులను గౌరవించినప్పుడే రాజ్యాంగానికి ఒక విలువ ఉంటుంది.. అది నిలబడుతుంది. ప్రజల సొమ్ముకు పాలకులు చేస్తున్న దోపిడీకి సంబంధం లేనప్పుడు కేంద్రం జోక్యంచేసుకోవచ్చు అని మాజీ మంత్రి యనమల సూచించారు.

Advertisement

Next Story