ప‌శ్చిమ నుంచే పోటీ చేస్తా: జంగా రాఘ‌వ‌రెడ్డి

by S Gopi |   ( Updated:2022-03-18 03:46:01.0  )
ప‌శ్చిమ నుంచే పోటీ చేస్తా: జంగా రాఘ‌వ‌రెడ్డి
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్ కాంగ్రెస్ రాజ‌కీయం వేడెక్కుతోంది. ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గర ప‌డుతున్నా కొద్దీ రాజ‌కీయ వ్యూహాలు ప‌దునెక్కుతున్నాయి. నేత‌లు స్థానాల‌ను ఖరారు చేసుకుంటూ ప్రయ‌త్నాల‌ను ముమ్మరం చేస్తున్నారు. తాజాగా గురువారం కాజీపేట‌లో జ‌రిగిన ఓ ప‌రామ‌ర్శ కార్యక్రమంలో తాను ఈసారి వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నుంచే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జంగా రాఘ‌వ‌రెడ్డి చేసిన క్లియ‌ర్ కామెంట్ ఇప్పుడు కాంగ్రెస్‌లో, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయంలో హాట్ టాపిక్‌గా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావుపై పోటీ చేసిన జంగా ఓట‌మిపాలైన విష‌యం విధిత‌మే. ఆ త‌ర్వాత జ‌న‌గామ డీసీసీ అధ్యక్ష ప‌ద‌వి ద‌క్కించుకున్న ఆయ‌న ఈసారి పాల‌కుర్తి కానీ, జ‌న‌గామ నుంచి కానీ పోటీ చేస్తార‌న్న ప్రచారం జ‌రిగింది. అయితే ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌తోపాటు సొంత నియోజ‌క‌వ‌ర్గమైన వ‌రంగ‌ల్ పశ్చిమ‌లో ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉంది. ఏడాది క్రితం జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఆయ‌న మార్క్ క‌నిపించింది. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఇద్దరు కార్పొరేట‌ర్లలో ఇద్దరు ఆయ‌న అనుచ‌రులే కావ‌డం గ‌మ‌నార్హం.

స్థాన‌బ‌లం ఉంటుంద‌నే మొగ్గు...

స్వత‌హాగా వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని టేకుల‌గూడెం వాసి అయిన జంగాకు కాజీపేట మండ‌లంపై మంచి ప‌ట్టు ఉంది. మాస్ లీడర్‌గా పేరుపొందిన ఆయ‌న‌కు బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలోనే వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నుంచే బ‌రిలోకి దిగాల‌ని ఆయ‌న అనుచ‌రులు కొద్దిరోజులుగా ఒత్తిడి తీసుకువ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పాల‌కుర్తితో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు క‌లిసిరావ‌నే ఆ నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్యట‌న‌లకు కూడా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. జ‌నగామ నుంచి కూడా పొన్నాల ల‌క్ష్మయ్యతో టికెట్ పోరు ఉంటుంద‌నే ముంద‌స్తు వ్యూహంతో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ వైపు జంగా మొగ్గు చూపిన‌ట్లుగా తెలుస్తోంది.

రేవంత్‌ను ఒప్పించే ప‌నిలో జంగా..!

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని నిర్ణయించుకున్న జంగా ప్రస్తుతం అధిష్ఠానం పెద్దల‌ను ఒప్పించే ప‌నిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి అనుమ‌తితో దూసుకెళ్లాల‌ని భావిస్తున్నట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి హ‌న్మకొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల డీసీసీ అధ్యక్షుడు నాయిని ఎన్నాళ్లుగానో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నిక‌ల్లో మ‌హా కూట‌మి పొత్తుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని మిత్ర పార్టీకి కేటాయించింది. దీంతో నాయినికి పోటీ చేసే అవ‌కాశం లేకుండా పోయింది. ఈసారి త‌ప్పకుండా త‌న‌కు టికెట్ వ‌స్తుంద‌నే ధీమాతో ఉన్నారు. ఇంత‌లో జంగా క్లియ‌ర్ క‌ట్ ప్రక‌ట‌న‌తో నాయినికి షాక్ ఇచ్చారు. మ‌రి అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పంద‌న వ్యక్తమ‌వుతుందో కొద్దిరోజులు ఆగితే గానీ తెలియ‌రాదు.

Advertisement

Next Story

Most Viewed