Nirmal Collector: తహసీల్దార్ కార్యాలయంలో దిశ కథనం సంచలనం.. వెనక్కి వెళ్లిన వీఆర్ఏలు

by Javid Pasha |   ( Updated:2022-04-14 06:30:16.0  )
Nirmal Collector: తహసీల్దార్ కార్యాలయంలో దిశ కథనం సంచలనం.. వెనక్కి వెళ్లిన వీఆర్ఏలు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. జిల్లా కలెక్టరుతో పాటు అదనపు కలెక్టరు హేమంత్ బోర్కడే, మరికొందరు అధికారులకు టెన్నిస్ ఆడే అలవాటు ఉంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో టెన్నిస్ కోర్టు ఏర్పాటు చేయగా.. ప్రతిరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ టెన్నిస్ ఆడుతుంటారు. కలెక్టర్ టెన్నిస్ ఆడుతుంటే బాల్స్ అందించేందుకు రోజుకు ముగ్గురు చొప్పున వీఆర్ఏలు ఉండాలని అర్బన్ తహసీల్దార్ శివప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మంగళవారం రోజున 'దిశ పత్రిక' వెలుగులోకి తెచ్చింది.

దీంతో దిశ కథనం సోషల్ మీడియాతో పాటు బయట వైరల్‌గా మారింది. 21 మంది వీఆర్ఏలు.. ప్రతి ముగ్గురిని మానిటరింగ్ చేసేందుకు ఓ వీఆర్వో (ఏడుగురు)ను నియమించగా.. ప్రతి రోజు సాయంత్రం 5.30గంటలకు తప్పకుండా ఉండేలా చూసేలా పర్యవేక్షించాలని నిర్మల్ ఎంఆర్ఐకి బాధ్యతలు అప్పగించారు. ప్రతి రోజు బాల్స్ అందించటంతో పాటు కలెక్టర్ వచ్చినప్పటి నుంచి వెళ్లిపోయే వరకు అక్కడే ఉంటున్నారు. మంగళవారం 'దిశ పత్రిక'లో కథనం రావటంతో.. వివాదానికి దారి తీసింది. దీంతో బుధవారం రోజున వీఆర్ఏలు లేకుండానే కలెక్టర్ టెన్నీస్ ఆడారు.


బంతులు అందించేందుకు వచ్చిన వీఆర్ఏలను వెనక్కి పంపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ స్పందించారు. తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను తాను చూడలేదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నిజంగా ఉత్తర్వులు ఇస్తే చూసి మాట్లాడుతానని.. దేనికి, ఏ ఉద్దేశ్యంతో ఇచ్చారో తెలుసుకుంటానన్నారు. ఉత్తర్వులు చూశాక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను జారీ చేయడాన్ని అర్బన్ తహసీల్దార్ శివప్రసాద్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

ప్రోటోకాల్ కోసమే పెట్టామని.. ఆఫీస్ కార్యాలయంలోనే కోర్టు ఉన్నందున దానిని క్లీన్ చేయిస్తున్నామని అన్నారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అర్బన్ తహసీల్దార్ శివ ప్రసాద్ ఈ ఉత్తర్వులు ఇచ్చారా.. లేదా తహసీల్దార్ అత్యుత్సాహంతో ఈ ఉత్తర్వులు జారీ చేశారా.. అనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయో.. లేదో వేచి చూడాలి.

Advertisement

Next Story