టీఆర్​ఎస్​కు ఈటల ఫీవర్​.. రంగంలోకి ఇంటెలిజెన్స్

by Nagaya |   ( Updated:2022-07-06 00:00:54.0  )
టీఆర్​ఎస్​కు ఈటల ఫీవర్​.. రంగంలోకి ఇంటెలిజెన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ అలర్టు అయింది. ఈటలకు బీజేపీ చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించడంతో నేతలు కారు దిగకుండ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఎవరెవరూ టచ్ లో ఉన్నారు... ఆయన వద్దకు ఎవరు వెళ్లే అవకాశం ఉందనే వివరాలను పార్టీతోపాటు ఇంటెలిజెన్స్ తో వివరాలను సేకరిస్తుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈటల ట్రాక్ లో పడకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈటల ప్రభావం ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో ఎక్కువ ప్రభావం ఉంటుంది.. మాజీలు, ఉద్యమకారులు, ఎమ్మెల్యేలు, జిల్లా, రాష్ట్ర కమిటీ నేతలు ఎవరూ ఆయనవైపు చూస్తున్నారనే పూర్తి సమాచారంను గులాబీ పార్టీ సేకరిస్తుంది.

టీఆర్ఎస్ పార్టీలో 18 ఏళ్లపాటు సుధీర్ఘంగా ఈటల రాజేందర్ పనిచేశారు. రాజకీయ అనుబంధం ఉంది. వైఎస్ఆర్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా పనిచేశారు. ప్రతి ఎన్నికల్లో నేతలను, కార్యకర్తలను కోఆర్డినేషన్ చేస్తూ టీఆర్ఎస్ విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రతి వ్యూహాలు ఈటలకు తెలుసు. విపక్ష నేతల బలాలు, బలహీనలు కూడా తెలువడం, ఏ సెక్షన్ ఓట్లను ఎలా ఆకర్షించాలో తెలిసిన నేర్పరి ఈటల. కేసీఆర్ ప్రభుత్వంలో రెండు టర్మ్ లు మంత్రిగా పనిచేశారు. నేతలు, క్యాడర్ తో విస్తృత సంబంధాలు ఉన్నాయి. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కేసీఆర్ ను విభేదించి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఈటల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. జూన్ 19న ఢిల్లీలో అమిత్ షాతో భేటీ... జూలై 2న హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాల్లో మోడీ, అమిత్ షాతో ఈటల భేటీలో తెలంగాణపై అనుసరించాల్సిన వ్యూహం, అధికారంలోకి రావాలంటే చేయాల్సిన విధివిధానాలను15 నిమిషాల పాట వివరించారు. ఈటలను అభినందించారు... ఆయన రాజకీయ అనుభవాన్ని గుర్తించిన బీజేపీ అధిష్టానం చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ బాధ్యతలను అప్పగించింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది.

ఈటల ఎన్నికల్లో కేసీఆర్ అనురించే వ్యూహాలు తెలుసు. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న నాయకులతో పాటు ప్రస్తుత నాయకులు, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి టీఆర్ఎస్ నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఏ నాయకుడి బలం ఏంది? బలహీన ఏందీ అని తెలిసిన నాయకుడు ఈటల. అంతేకాదు పార్టీకి ఏ వర్గం, ఏ సెక్షన్ బలంగా ఉంది... వారిని ఎలా చేస్తే బీజేపీకి దగ్గర అవుతున్నారనే విషయం సైతం తెలుసు. దీంతో టీఆర్ఎస్ నేతల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. ఈటలతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వివరాలను పార్టీతో పాటు ఇంటలిజెన్స్ తో వివరాలను సేకరిస్తుంది.

ఈటలతో సన్నిహితంగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు... పోటీ చేసి ఓడిపోయినవారెవరూ... నేతలు ఎవరూ అనే వివరాలను సేకరించే పనిలో టీఆర్ఎస్ పార్టీ నిమగ్నమైంది. అంతేకాదు.. ఈటల ప్రభావం ఏ జిల్లాలో... ఏ నియోజకవర్గంలో ఎక్కువగా పడబోతుందనే వివరాలను సైతం సేకరిస్తోంది. అదే విధంగా ఈటలకు ముదిరాజ్ కులస్తుడు కావడం, ఆయన మంత్రి, ఎమ్మెల్యేగా వారి సమస్యలపై ఫోకస్ పెట్టడం, పరిష్కరించడంతో ఆ కులస్తుల్లో ఆదరణ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ఆయనకు టచ్ లో ఉన్నారు. వారిని సైతం చేజారకుండా ఈటలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ముదిరాజ్ లకు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని వివరించి కట్టడి చేసే పథకాన్ని రచిస్తున్నట్లు సమాచారం.

ఈటలకు ప్రజల్లో కొంత ఆదరణ ఉంది. ఆ ఆదరణతో టీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల బీజేపీలో చేరిన సమయంలో ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ మాత్రమే చేరడంతో టీఆర్ఎస్ లైట్ గా తీసుకుంది. అయితే బీజేపీలో సైతం ఈటల వచ్చిన తర్వాత చేరికలను ప్రోత్సహించడం లేదనే అపవాదు ఉండటంతో దానిని రూపుమాపేందుకు గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే దానికి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ అప్రమత్తమై ఈటలతో టచ్ లో ఉన్న నేతల వివరాలను సేకరించే పనిలో పడింది. ఎవరూ పార్టీ మారకుండా చర్యలు చేపడుతుంది. నేతలపై ఎక్కడికక్కడ నిఘా పెట్టింది. ఈటల ట్రాక్ లో ఎవరైన పడితే జరిగే నష్టనివారణకు సైతం చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.

రాజకీయ పునరేకీకరణతో రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఉద్యమకారులతో పాటు వివిధ పార్టీల నుంచి చేరినవారికి తగిన గుర్తింపు లభించకపోవడం, తాజా మాజీ ఎమ్మెల్యేలకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. అంతేగాకుండా రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలకు సైతం సరైన భరోసాను కేసీఆర్ ఇవ్వకపోవడంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. కొంతమంది నేతలు పార్టీలోనే ఉంటూ పార్టీ మంత్రులు, నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటివారిపై ఈటల దృష్టిసారించడంతో టీఆర్ఎస్ చక్కదిద్దే పని చేపడుతోంది. ఎవరైనా ఈటల ట్రాక్ లో పడితే వారి ఆర్థిక ములాలపై దెబ్బకొట్టి ప్రయత్నం సైతం చేసే అవకాశం లేకపోలేదు. పార్టీ మారకుండ కట్టదిట్టమైన చర్యలు పూనుకుంటుంది టీఆర్ఎస్. ఏమేరకు టీఆర్ఎస్ పార్టీ నేతలు పార్టీ మారకుండా కాపాడుకుంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story