ఢిల్లీలో తేలని టీ కాంగ్రెస్ లొల్లి.. రాహుల్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన అసంతృప్తి నేతలు!

by Satheesh |   ( Updated:2022-04-07 00:31:13.0  )
ఢిల్లీలో తేలని టీ కాంగ్రెస్ లొల్లి.. రాహుల్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన అసంతృప్తి నేతలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎండ్రికాయల కథే కొనసాగుతున్నది. ఒకరిపై ఒకరు కంప్లయింట్ చేసుకోవడం.. వాటిని ఏఐసీసీ పెద్దలు కూడా వింటుండటం ఓ ఫార్సుగా మారింది. ఇంతకు ఎవరేం చెబుతున్నారు.. ఎవరి మాట చెల్లుతుంది.. అనేది ఎప్పటికీ సస్పెన్సే..! ఎవరికి వారు రాహుల్, సోనియా, కేసీ వేణుగోపాల్ లాంటి పెద్దలను కలువడం.. 10 జనపథ్ బయటికి వచ్చి మీడియాతో మాట్లాడడం.. మేం చెప్పిన పాయింట్లన్నీ నోట్ చేసుకుంటారు.. యాక్షన్​ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేయడం రివాజుగా మారింది.

ఇదంతా చెప్పిన తర్వాత ఆఖరుకు "మేమంతా కలిసి పని చేస్తాం.. ఇక నుంచి బహిరంగంగా గొడవలు పెట్టుకోం" అంటూ చెప్పి వెళ్లడం మరో విశేషం. ఇటీవలే అసంతృప్తి నేతలు, సంతృప్తి వర్గాన్ని మొత్తం ఒక్కటి చేసి ఏఐసీసీ అగ్రనేతతో మూడు గంటల పాటు సమావేశం నిర్వహించి బయటకు వచ్చి ఐక్యతారాగాలు తీసిన నేతలు మళ్లీ ఫిర్యాదుల పరంపర కొనసాగించారు. ఒకరి వెంట ఒకరు వేర్వేరుగా ఏఐసీసీ పెద్దలను కలుస్తున్నారు. చెప్పిందే చెప్పుకుంటూ ఆరోపణలను అపడం లేదు. ఇక ఇవన్నీ వింటూ విననట్టుగానే ఏఐసీసీ కూడా వ్యవహరిస్తోంది. దీంతో కాంగ్రెస్​లో కలహాలు ఒడువని ముచ్చటగానే మారాయి.

రాష్ట్ర కాంగ్రెస్​వ్యవహారం ఢిల్లీలోనూ కొనసాగుతోంది. రాష్ట్రానికి చెందిన నేతలు అధిష్టానంతో వేర్వేరుగా భేటీ అవుతూనే ఉన్నారు. ఈ నెల 4న 39 మంది నేతలతో సమావేశం నిర్వహించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ నేతలంతా సయోధ్యతో ఉండాలని సూచించారు. అయితే, ఆ సమావేశంలో కొంతమంది టీపీసీసీ చీఫ్ రేవంత్​వ్యవహారంపై ఆరోపణలు చేశారు. కానీ, ఒక్కొక్కరుగా మళ్లీ రాహుల్​తో భేటీ అయ్యారు. ముందుగా కేసీ వేణుగోపాల్‌ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్​బాబు, మధుయాష్కీ, జగ్గారెడ్డి తదితరులు కలువగా.. బుధవారం టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​జగ్గారెడ్డి కుటుంబంతో సహా రాహుల్​ను కలిశారు. మరో నేత మహేశ్​కుమార్ గౌడ్​కూడా రాహుల్‌తో భేటీ అయ్యారు. ఇక సాయంత్రం టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​గీతారెడ్డి కూడా రాహుల్‌తో సమావేశమయ్యారు.

అది టీ కాంగ్రెస్..

​రాహుల్‌తో వేర్వురుగా భేటీ అయిన నేతలు టీపీసీసీ చీఫ్​ తీసుకుంటున్న నిర్ణయాలపైనే ప్రధానంగా ఫోకస్​పెట్టి ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక దశలో రాష్ట్ర కాంగ్రెస్‌ను టీడీపీ కాంగ్రెస్​అంటూ విమర్శించినట్లు సమాచారం. చంద్రబాబు సూచనల్లోనే కాంగ్రెస్​పార్టీ నడుస్తుందనే ఆరోపణలకు దిగారు. అందుకే రేవంత్​ వర్గాన్ని టీ కాంగ్రెస్‌గా వర్ణిస్తున్నారని, తామంతా టీఎస్​కాంగ్రెస్​అంటూ నేతలు రాహుల్​ముందు చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి, మహేశ్​కుమార్​గౌడ్, సీఎల్పీ భట్టి వంటి నేతలంతా ఇవే ఫిర్యాదులు చేసినట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. అంతేకాకుండా కేసీ వేణుగోపాల్​ఎదుట కూడా రేవంత్‌పై ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. అటు మాణిక్కం ఠాగూర్​వైఖరిని కూడా పార్టీ నేతలు తప్పు పట్టారు. కానీ, రాహుల్ గాంధీ మాత్రం నేతల విమర్శలపై స్పందిస్తూనే.. ముందుగా అంతా కలిసి పని చేయాలని సూచించినట్లు సదరు నేతలు మీడియాతో చెప్పుతున్నారు. అదేవిధంగా ఇటీవల జగ్గారెడ్డి రాజీనామా అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చర్చించారు. జగ్గారెడ్డి, మహేశ్​ కుమార్‌తో సమావేశమై, రాజీనామా ప్రకటనకు దారి తీసిన వ్యవహారాన్ని అడిగి తెలుసుకున్నారు. అయితే, పార్టీ నేతలు పదేపదే రాజీనామా అంటూ ప్రకటించడం పద్దతి కాదని కేసీ సూచించినట్లు తెలుస్తోంది.

రాహుల్‌ను కలిసేందుకు ఢిల్లీలో..!

రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించిన తర్వాత కొంతమంది నాయకులు ఇంకా ఢిల్లీలోనే మకాం వేశారు. బుధవారం వరకు పలువురు అక్కడే ఉన్నారు. రాహుల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, ఇటీవల సమావేశంలో సమస్యలు ఉంటే తనకు, కేసీకి చెప్పుకోవాలని రాహుల్​చెప్పడంతో.. పలు అంశాలను చర్చించేందుకు అపాయింట్​మెంట్​కావాలంటూ అసంతృప్తి నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే రాహుల్​గాంధీ అపాయింట్​మెంట్​లేదంటూనే.. పలువురు నేతలకు అవకాశం కల్పించారు. బుధవారం జగ్గారెడ్డి, మహేశ్​కుమార్​గౌడ్‌కు అపాయింట్​మెంట్​ఇచ్చిన ఏఐసీసీ.. సాయంత్రం వరకు మరో టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​గీతారెడ్డికి సైతం అవకాశం ఇచ్చారు.

Advertisement

Next Story