స.హ. చట్టానికి తూట్లు.. అధికారులపై కమిషన్ సీరియస్

by S Gopi |   ( Updated:2022-03-05 13:38:15.0  )
స.హ. చట్టానికి తూట్లు.. అధికారులపై కమిషన్ సీరియస్
X

దిశ, మల్యాల: జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ అధికారులు సమాచారం హక్కు చట్టం ద్వారా అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పంచాయతీ అధికారులపై రాష్ట్ర కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయితీలో నిధుల దుర్వినియోగం జరుగుతుందని.. అందుకు సంబంధించి సమాచారం అడిగినా అధికారులు ఇవ్వకుండా రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించారని ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి ఆరోపించారు.

గైర్హాజరైన అధికారులు..

సమాచార హక్కు చట్టం 2005 ద్వారా అడిగినా సమాచారం ఇవ్వకపోవడంతో జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి, బుగ్గారం గ్రామ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయానికి మొత్తం మూడు తాఖీదులు జారీ అయ్యాయి. ఈ విషయమై శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సమాచార కణిషనర్ ఎదుట జిల్లా పంచాయతీ, బుగ్గారం మండల పంచాయతీ అధికారులు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అనారోగ్యం పేరుతో బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ ఖాన్, సెలవు పేరుతో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుండి గైర్హాజరయ్యారు. వారి స్థానంలో మహిళా సీనియర్ అసిస్టెంట్ ను, బుగ్గారం పంచాయతీ కార్యదర్శిని పంపి చేతులు దులుపుకొన్నారు.

మండిపడిన కమిషన్? వారంలో అడిగిన సమాచారం ఇవ్వకుంటే చర్యలు

పంచాయతీ అధికారులు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఎదుట హాజరుకాకుండా నిర్లక్యంగా వ్యవహరించడం పట్ల సమాచార కమిషనర్ తీవ్రంగా మండిపడ్డారని, కమిషన్ ఎదుట హాజరైన సీనియర్ అసిస్టెంట్, కార్యదర్శికి వారంలోగా పూర్తి సమాచారం అర్జీదారునికి అందజేయాలని సీరియస్ గా ఆదేశించారని సమాచారం. లేనిపక్షంలో జరిమానా విధించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కమిషనర్ హెచ్చరించినట్లు తెలిసింది.

జగిత్యాల జిల్లాలోని పలు మండలాలకు సంబంధించిన గ్రామాల నుండి కూడా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, అధికారులు శనివారం రెండో అప్పీల్ విచారణకు రాష్ట్ర సమాచార కమిషన్ ఎదుట హాజరైనట్లు చుక్క గంగారెడ్డి తెలిపారు. వారి వెంట నడిమెట్ల రాజేశం, ఐలవేని నర్సయ్య, సామల్ల భరద్వాజ్, పూరెళ్ల వంశీ, పూరెళ్ల రాజేష్, ఆనంద్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed