త్వరలో స్కోడా ఎలక్ట్రిక్ కార్లు!

by Manoj |
త్వరలో స్కోడా ఎలక్ట్రిక్ కార్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే కొన్నేళ్లలో దేశీయంగా గ్రీన్ మొబిలిటీ విభాగం గణనీయంగా పుంజుకుంటుందని ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా తెలిపింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం ఉన్న కార్ మోడళ్లలో మెరుగైన అమ్మకాలను సాధిస్తోంది. అయితే, సీఎన్‌జీ విభాగంలో వాహనాలను తయారు చేసే ఆలోచన లేదని కంపెనీ స్పష్టం చేసింది. 'భారత ఆటో పరిశ్రమలో దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం ఉంది.

అందుకోసం త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగంలోకి ప్రవేశించనున్నట్టు' స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ అన్నారు. 2030 నాటికి దేశీయ మార్కెట్లో మొత్తం 25-30 శాతం ఈవీ కార్లు ఉంటాయనే అంచనాలున్నాయి. ఇందులో మెరుగైన వాటాను స్కోడా కలిగి ఉంటుందనే లక్ష్యంతో ఉన్నామని, అందుకోసం వినియోగదారులకు నచ్చే స్థాయిలో ఈవీ కార్లను మార్కెట్లో విడుదల చేస్తామని జాక్ వివరించారు. ఇప్పటికే దిగ్గజ లగ్జరీ బ్రాండ్లు ఆడి, పోర్షె సంస్థలు తమ హై-ఎండ్ ఈవీలను తీసుకొచ్చాయని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా దేశీయ మార్కెట్లో స్కోడా సంస్థ గతేడాది దాదాపు 24 వేల యూనిట్ల కార్లను విక్రయించిందని, ఈ ఏడాది అంతకంటే మూడు రెట్లు అధిక అమ్మకాలను సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని జాక్ తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి తాము పుంజుకోవడమే కాకుండా 2021లో 140 శాతం వృద్ధిని సాధించగలిగామన్నారు.

Advertisement

Next Story