రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక రవాణా.. స్పందించని ఖాకీలు

by Vinod kumar |
రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక రవాణా.. స్పందించని ఖాకీలు
X

దిశ, కల్వకుర్తి: యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేదు. అనుమతులు లేకున్నా అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లలో పరిమితికి మించి ఇసుకను తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక మాఫియా తమ అక్రమ దందాతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా.. నదులు, కాలువలు, చెరువులను నిర్జీవం చేస్తున్నా.. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇసుక తవ్వకాలు మొదలు.. అమ్మకాల దాకా ప్రతి దశలో ముడుపులు అందడంతోనే యంత్రాంగం మౌనంగా ఉంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సందట్లో సడేమియా అన్న చందంగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు. కల్వకుర్తి డివిజన్ లోని మండల స్థాయి, గ్రామ స్థాయిలో నాయకులుగా చెలామణి అవుతూ జోరుగా ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో అనేక మంది గ్రామ స్థాయి నాయకులు కూడా ఇదే బాట పట్టడం విశేషం.


అభివృద్ధి పనులు చేస్తే వచ్చే లాభం కన్నా మూడు నాలుగింతలు ఇసుక అక్రమ రవాణా ద్వారా వస్తుండటంతో ప్రధాన దృష్టి అభివృద్ధి పనులు పూర్తి చేయడం కన్నా ఇసుక తరలింపుపైనే కేంద్రీకరించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారనటంలో అతిశయోక్తి లేదు. కల్వకుర్తి మండలం సుద్దకల్ గ్రామ శివారులోని సోమవారం రాత్రి జరిగిన ఘటనే ఇసుక అక్రమ రవాణా వ్యవహారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అనునిత్యం రాత్రి వేళల్లో మేడిపూర్ వాగు నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల సహాయంతో అక్రమంగా ఇసుకను కల్వకుర్తి పట్టణానికి తరలిస్తున్నారు.

గత 4 రోజుల క్రితం ఇసుక పక్కదోవ పట్టిస్తూ.. ప్రభుత్వ రెవెన్యూ ఆదాయానికి గండి కొడుతున్న విషయాన్ని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం లో పాలమూరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ లు కలెక్టర్, జడ్పీ చైర్మన్ లకు విన్నపించిన సంగతి పాఠకులకు విదితమే. అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం ద్వారా అక్రమ ఇసుక మాఫియాకు అడ్డుకట్టలేకపోయిందని వాపోయారు.

అదే క్రమంలో సోమవారం రాత్రి ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుకను తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు కొంత మంది పాత్రికేయులు వీడియో కవరేజ్ కోసం సుద్దకల్ గ్రామ రహదారి వైపు వెళ్లారు. మార్గమధ్యలో అక్రమ ఇసుకను తరలిస్తూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల వస్తుండగా అందులో ఏపీ22ఏఎమ్ 0869 , టిఎస్31ఈ6254 గల వాహనాలను పాత్రికేయులు వీడియో కవరేజ్ చేస్తున్న క్రమంలో మద్యం మత్తులో ఉన్న సుద్దకల్ గ్రామ ప్రజా ప్రతినిధి భర్త వారిపై దాడులకు ప్రయత్నించాడు.

నేను ఎవరికి భయపడను.. అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తూ.. అక్రమంగా ఇసుకను తరలిస్తా మీకు ఇష్టమొచ్చింది చేసుకోండి..అధికారులకు చెప్పుకుంటే చెప్పుకోండని హెచ్చరించారు. ఓ గ్రామ ప్రజా ప్రతినిధి భర్త అయివుండి అక్రమ ఇసుకను నిలువరించేది పోయి ఏకచక్రాధిపతివోలె దగ్గరుండి వ్యవహారం నడిపిస్తుంటే అడిగేదెవరు ఆపేదెవరింకా. ఇదే విషయమై ఇసుక తరలిస్తున్న విషయం ఇద్దరి చరవాణులతో 100 డైల్ కి తెలుపగా స్థానిక పోలీసులు మీకు సహాయం చేస్తారని చెప్పడంతో దాదాపు 3 గంటలు వేచి చూసినప్పటికీ పోలీసుల సహాయం అందలేదు. ఫిర్యాదుకు సంబంధిన కేసు ఐడి లు 20220001320763 , 20220001321412 లు మాత్రం వచ్చాయి కానీ సమస్య మాత్రం తీర్చలేకపోయారు.

వాస్తవానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పాటు ప్రజలు ఏ ఆపద వచ్చినా, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పిస్తామని,అత్యవసర సమయంలో డైల్ 100 కు కాల్ చేయాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి స్పందించడంలో నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు విఫలమవుతున్నారే విమర్శలు ప్రజల నుండి వస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకొనుటలో కల్వకుర్తి పోలీసులు విఫలమవుతున్నారు. ఏది ఏమైనా బాధ్యత గల సర్కారు ఉద్యోగాలు నిర్వహిస్తూ.. ప్రజలకు న్యాయం చేకూరేలా వ్యవహరించాలి. ఇప్పటికైనా జిల్లా అధికారుల అక్రమ ఇసుక తరలించే వారి పై కొరడా ఝలిపిస్తారా.. లేదా? వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed