రోడ్కెక్కాలంటే భయం.. రోడ్డు దాటుతున్న వ్యక్తికి తీవ్రగాయాలు

by Vinod kumar |
రోడ్కెక్కాలంటే భయం.. రోడ్డు దాటుతున్న వ్యక్తికి తీవ్రగాయాలు
X

దిశ, శంకర్ పల్లి: రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి 100 మీటర్లు లాక్కెళ్ళిన హృదయవిదారక సంఘటన శంకర్పల్లి ఇంద్రా రెడ్డి చౌరస్తాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ పల్లికి చెందిన గండేట్ కృష్ణ గౌడ్(55) పనిముగించుకుని ఇంటికి వచ్చేందుకు రోడ్డు దాటి వస్తుండగా అతి వేగంగా వచ్చిన ఓ వాహనం డీ కొట్టింది.


ఢీ కొట్టడమే కాదు వాహనం ముందు భాగంలో వ్యక్తి ఇరుక్కొని అలాగే లాక్కెళ్ళుతుండగా తీవ్ర రక్తస్రావం అయి.. గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న శంకర్పల్లి పోలీసులు 108 కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శంకర్పల్లి ఎస్సై కృష్ణ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తించి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సిగ్నల్ వ్యవస్థ లేకపోవడమే ప్రమాదానికి కారణమా..?


శంకర్పల్లి ఇంద్రారెడ్డి చౌరస్తా నాలుగు రహదారులకు ప్రధాన కూడలిగా ఉంది. చేవెళ్ల సంగారెడ్డి హైదరాబాద్ రహదారులతో పాటు రైల్వే స్టేషన్ కి వెళ్లే రహదారులకు ప్రధాన కూడలిగా ఉండడంతో వాహనాలు ఏ వైపు నుంచి ఏ వైపు వెళ్తాయి? ఎటు నుంచి ఎటు వస్తాయో తెలియక మహిళలు, వృద్ధులు, పిల్లలు రోడ్డు దాటాలంటే భయాందోళనకు గురవుతున్నారు.


ఇక శంకర్పల్లి సంత జరిగే ఆదివారం, బుధవారం రోజు ఇళ్ల నుంచి దుకాణాలకు కూరగాయల కొనుగోలుకు రావాలంటేనే మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రహదారుల వెంబడి ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్లు అనేవి లేకపోవడంతో వాహనదారులు అతివేగంగా వెళుతుండటం వాటిని నియంత్రించే దిశగా ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ పోలీసుల జాడే లేకుండా పోయింది.


ప్రధాన కూడలిలో ఉన్న సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ జరుగుతున్న ప్రమాదాలను పోలీసులు పరిశీలిస్తున్న.. అందుకు అనుగుణంగా నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలు శూన్యం. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ పోలీసుల నైనా నియమించాలి సిగ్నల్ వ్యవస్థనైనా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story