మద్యం అమ్మకాల్లో.. రాష్ట్రంలో ఆ జిల్లా టాప్!

by Web Desk |
liquor sales
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్రంలో మద్యం సేల్ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిల్లోనున్న తెలంగాణలో మద్యం షాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. మద్యం ప్రియులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వైన్ షాపుల వద్దే గడుపుతారు. ఇలాంటి వాళ్లతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని రాజకీయ విశ్లేషకులు, మేధావులందరూ వివరిస్తున్నారు.

ప్రజలను తాగుడుకు బానిసలను చేసి ప్రభుత్వంలోని పెద్దలు ఆర్దికంగా బల పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాదిలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా మూడో స్థానంలో హైదరాబాద్ నిలవడం విశేషం.

తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక అమ్మకాలు జరుగుతున్నాయి. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రూ.31 వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగితే.. కేవలం రంగారెడ్డి జిల్లాలోనే రూ.6909 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. అత్యధిక మద్యం అమ్మకాల జాబితాలో రంగారెడ్డి జిల్లా టాప్‌లో ఉంటే ఆ తర్వాతి స్థానంలో రూ.3288 కోట్ల ఆదాయం తో నల్లగొండ రెండో స్థానంలో, రూ.3208 కోట్ల ఆదాయంతో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలవడం విశేషం.

2020లో రూ.5747 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, నల్లగొండలో రూ.2854 కోట్లు, హైదరాబాద్‌లో రూ. 2676 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2020 తో పోలిస్తే 2021లో మద్యం అమ్మకాలు 20 శాతం వృద్ధి కన్పించింది. ఈ ఏడాది ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తుంది.

వైన్స్ షాపులతో బెల్ట్ షాప్‌లు మిలాఖాత్..

గత ఏడాది వరకు జిల్లాలో 196 మద్యం దుకాణాలు ఉండగా, కొత్త మద్యం పాలసీలో భాగంగా ఇటీవల సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ డివిజన్‌ పరిధిలో 20, శంషాబాద్‌ డివిజన్‌ పరిధిలో 18 చొప్పున కొత్త మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం జిల్లాలో 234 మద్యం దుకాణాలు ఉండగా, వీటిలో నెలకు సగటున రూ.550 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా.

పాత దుఖానాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన వారికి కూడా గత నవంబర్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని 134 షాపులకు 4102 దర ఖా స్తులు రాగా, శంషాబాద్‌ ఎక్సైజ్‌ యూనిట్‌ పరిధిలోని వంద వైన్స్‌కు 4137 దరఖాస్తులు వచ్చాయి. కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.164.78 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటికి రిజర్వేషన్ల ప్రాతిపదికన దుకాణాలు కేటాయించారు.

దీనిలో భాగంగా గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు పది శాతం, ఎస్టీలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి ఆ మేరకు గత నవంబర్‌ 20న ఆయా వర్గాలకు లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించారు. తర్వాత వీటికి అనుబంధంగా లిక్కర్‌మాల్స్‌కు కూడా అనుమతి ఇచ్చారు. షాపింగ్‌ మాల్‌ తరహాలో వీటిని తీర్చిదిద్ది ఖరీదైన మద్యాన్ని కూడా మద్యం ప్రియులకు అందుబాటులో ఉంచారు. గతంలో క్వార్టర్‌ బాటిల్‌ కొనేవారు సైతం.. ప్రస్తుతం ఫుల్‌బాటిల్‌ను ఖరీదు చేస్తుండటం గమనార్హం.

ఖర్చు పెట్టడంలో ముందే..

ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి ఆర్థికంగా ధనవంతులున్న జిల్లా. దీనికి తోడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇక్కడ ఎక్కువ. పారిశ్రామిక సంస్థలకు తోడు ఐటీ అనుబంధ సంస్థలు, వాటి ఉద్యోగులు ఇక్కడే ఉన్నారు. ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, క్లబ్బులు, పబ్బులు కూడా ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న భారీ నిర్మాణాల్లో దేశవ్యాప్తంగా ఉన్న కూలీలు పని చేస్తున్నారు.

రోజంతా పని చేసి శారీరకంగా అలిసిపోయి సాయంత్రం ఉపశమనం కోసం మద్యం సేవిస్తున్నారు. అంతేకాదు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు అటు ఇటుగా అనేక ఫంక్షన్‌ హాల్స్‌ విస్తరించి ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు, రిసెప్షన్లు ఎక్కువ జరుగుతున్నాయి. విందులో మద్యం అనివార్యమైంది. జిల్లాలో అమ్మకాలు ఎక్కువగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమని ఎక్సైజ్‌ అధికా రులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు జిల్లా వాసులు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. సాయంత్రమైందంటే చాలూ ఏ ఇద్దరు స్నేహితులు, ఉద్యోగులు, బంధువులు కలిసినా కలిసి సుక్కేయాల్సిందే. ప్రస్తుతం కరోనా తీవ్రత కూడా తగ్గిపోవడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని వారు భావిస్తున్నారు. అయితే పరిమితికి మించి మద్యం సేవించడం వల్ల పలు అనార్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా మద్యం అమ్మకాలు మాత్రం తగ్గకపోగా.. మరింత పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

Next Story