Pragathi Bhavan: ప్రగతి భవన్ ఆస్తిపన్ను రూ.25.49 లక్షలు పెండింగ్..

by Vinod kumar |   ( Updated:2022-04-12 12:31:50.0  )
Pragathi Bhavan: ప్రగతి భవన్ ఆస్తిపన్ను రూ.25.49 లక్షలు పెండింగ్..
X

దిశ, ఉప్పల్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి గొంతు విప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు రావడం లేదని ఒకప్పుడు గలగల లాడిన జీహెచ్ఎంసీ ఖజానా లేక నేడు వెలవెలగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం చివరకు ప్రగతి భవన్‌కు సైతం ఆస్తి పన్నును చెల్లించడం లేదన్నారు. ఐదేళ్లలో ఏడాదికి రూ.5.28 లక్షల చొప్పున రూ.25.49లక్షల ఆస్తి పన్ను బకాయి ఉందన్నారు. సామాన్యులు ఇంటికి ఆస్తి పన్ను చెల్లించకపోతే ఇంటి ముందు చెత్త పోసి బలవంతంగా ఆస్తి పన్ను వసూలు చేసే జీహెచ్ఎంసీ, ప్రగతి భవన్ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు. నగరంలో రాష్ట్ర ప్రభుత్వ భవనాలు, సంస్థలకు చెందిన సుమారు 2500 ఆస్తులు ఉన్నాయని.

వీటికి ఏడాదికి రూ.102 కోట్ల చొప్పున ఏడేళ్లల్లో మొత్తం రూ.714 ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉందన్నారు. కానీ కేవలం రూ.35 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. అన్ని ప్రాజెక్టులను అప్పులు చేసి బల్దియా చేపడుతోంది. గడిచిన నాలుగేళ్ళలో సుమారు రూ.4500 కోట్లకు పైగా అప్పులు చేసిందని వీటికి ప్రతి నెల రూ.30 కోట్ల వడ్డీలను చెల్లిస్తుందని, కొత్త పథకాలను అమలు చేయాలని బల్దియాపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందన్నారు. నిధులు రాక, పనులు లేక ఏడాది తర్వాత కూడా ప్రజల ముందుకు వెళ్లలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించికపోవడంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రతి డివిజన్ కు కోటీ రూపాయలు నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed