ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన పేటీఎం వ్యవస్థాపకుడు!

by Harish |
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన పేటీఎం వ్యవస్థాపకుడు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజ సంస్థ పేటీఎం స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయినప్పటి నుంచి వరుసగా రికార్డు నష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీ షేర్లు భారీగా పతనమవుతున్న నేపథ్యంలో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానాన్ని కోల్పోయారు. భారత్‌లో మెరుగైన ఆదరణను సాధించిన పేటీఎం సంస్థ గడిచిన నాలుగు నెలల్లో పబ్లిక్ ఇష్యూ ధర రూ. 2,150 నుంచి ఏకంగా 70 శాతానికి పైగా కృంగిపోయిందని ఫోర్బ్స్ గణాంకాలు పేర్కొన్నాయి. పేటీఎం సంస్థ ఐపీఓకు రాకముందు విజయ్ శేఖర్ సంపద 2.35 బిలియన్ డాలర్ల(రూ. 17.88 వేల కోట్ల) నుంచి ప్రస్తుతం 999 మిలియన్ డాలర్ల(రూ. 7,600 కోట్ల) దిగువకు చేరుకుంది.

లిస్టింగ్ తేదీ నుంచి విజయ్ శేఖర్ శర్మ రోజుకు రూ. 88 కోట్ల సంపదను కోల్పోయారు. అంతేకాకుండా ఐపీఓ సమయంలో 1.39 ట్రిలియన్(1.39 లక్షల కోట్ల)తో ఉన్న పేటీఎం మార్కెట్ విలువ 1 ట్రిలియన్(రూ. లక్ష కోట్ల)ను నష్టపోయింది. ప్రస్తుతం రూ. 40 వేల కోట్లతో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 112వ స్థానానికి పడిపోయిందని ఫోర్బ్స్ వివరించింది. కాగా, బుధవారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో పేటీఎం సంస్థ షేర్ ధర 7.15 శాతం పుంజుకుని రూ. 634.80 వద్ద నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed