- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Karrigutta: కర్రిగుట్ట సెర్చ్ ఆపరేషన్ లో కీలక పరిణామం.. హిడ్మాను చుట్టుముట్టిన భద్రతా బలగాలు?

దిశ, డైనమిక్ బ్యూరో : మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్‌గా ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో భద్రతబలగాలు చేపట్టిన కూంబింగ్‌లో (Karrigutta Search Operation) భాగంగా భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో 38మంది మావోయిస్టులు (Maoists) మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో కర్రిగుట్టల్లో భద్రతా దళాలు వరుసగా ఐదో రోజు కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. కేంద్ర పారమిలటరీ బలగాలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు గంజపర్తి, నంబి, పూజారికాంకేర్, భీమవరంతోపాటు కస్తూరిపాడు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించగా కర్రిగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు భారీ సంఖ్యలో చనిపోయినట్లు తెలుస్తోంది. దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఓ జవాన్ సైతం తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.
హెలికాప్టర్లతో బాంబుల వర్షం..
ఐదు రోజులుగా సాగుతున్న సెర్చ్ ఆపరేషన్‌లో తీవ్రమైన ఎండ భద్రతా బలగాలకు (Security Forces) ఇబ్బందిగా మారడంతో హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో మావోయిస్టులు ఉన్న స్థావరాలను గుర్తించి బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. కూంబింగ్ కారణంగా అడవుల్లో నుంచి వినిపిస్తున్న భారీ శబ్దాలు, తుపాకుల మోతలతో స్థానిక గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగా కూంబింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు, పౌర హక్కుల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలతో సమస్య పరిష్కారం అవుతుందని తాము భావిస్తున్నామని అయినా ప్రభుత్వం భిన్నంగా ఆలోచిస్తోందని నిన్న బస్తర్ మావోయిస్టు పార్టీ ఇన్‌చార్జి రూపేశ్ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయినా సైన్యం మాత్రం సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తోంది.
హిడ్మాను చుట్టుముట్టిన బలగాలు?..
ఆపరేషన్‌లో సాధారణ మావోయిస్టులతోపాటు పార్టీ అగ్రనేతలైన హిడ్మా, దేవా, కేశవ్, సహ్‌దేవ్ వంటి వారిని టార్గెట్‌గా చేసుకుని భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగు రోజులుగా అడవుల్లోకి దూసుకుపోతున్న బలగాలు ఇవాళ కీలక పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. తాజాగా మావోయిస్టు అగ్రనేతలు భద్రతా దళాల వలయంలో చిక్కుకుపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో కర్రిగుట్టల నుంచి ఏ క్షణంలోనైనా సంచలన సమాచారం వెలువడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.